సయోధ్యకు బాటలు

ABN , First Publish Date - 2022-04-05T07:32:48+05:30 IST

నేపాల్ ప్రధాని మూడురోజుల పర్యటనకు భారత్ విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వం ఆయనను ఘనమైన స్వాగత సత్కారాల్లో ముంచెత్తింది. మోదీ నుంచే కాదు, యూపీ ముఖ్యమంత్రి యోగి నుంచి కూడా...

సయోధ్యకు బాటలు

నేపాల్ ప్రధాని మూడురోజుల పర్యటనకు భారత్ విశేష ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వం ఆయనను ఘనమైన స్వాగత సత్కారాల్లో ముంచెత్తింది. మోదీ నుంచే కాదు, యూపీ ముఖ్యమంత్రి యోగి నుంచి కూడా షేర్ బహదూర్ దేవ్‌బా దంపతులు ఆత్మీయతను అందుకున్నారు. వారణాసిలో దేవ్‌బా దంపతులను భారీ ఏర్పాట్లతో స్వాగతించడమే కాక, విశేష పూజలకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. భారత ప్రభుత్వ ఆదరణకు తన భర్త ఎంతో సంతోషించారంటూ నేపాల్ ప్రధాని భార్య ప్రత్యేకంగా పేర్కొంటూ మోదీకి కృతజ్ఞతలు తెలియచేశారు కూడా.


ఉభయదేశాల బంధానికి అప్పుడప్పుడు ఎదురుదెబ్బలు తగలకపోలేదు కానీ, రెండేళ్ళ కె.పి.శర్మ ఓలి పాలనలో నేపాల్ నుంచి భారత్ తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంది. సరిహద్దులను తిరగరాయడం సహా భారత్‌ను ఓలి పలు ఇబ్బందులు పెట్టి, సంబంధాలను దిగజార్చేసిన నేపథ్యంలో దేవ్‌బా పర్యటన ఉభయదేశాలకు కొత్త ఊపిరినిచ్చింది. మంచి మాటలతో, సానుకూల భావనతో, కొత్త ప్రాజెక్టుల ఆరంభంతో బంధాన్ని దృఢతరం చేసుకొనేందుకు ఈ సందర్భంగా విశేష కృషి జరిగింది. ఉభయదేశాల మధ్యా బ్రాడ్ గేజ్ రైలుమార్గాన్ని, విద్యుత్ సరఫరాలైన్లను, నేపాల్‌లో రూపే చెల్లింపుల వ్యవస్థను ఇద్దరు నేతలూ వర్చువల్‌గా ఆరంభించారు. రైల్వేలు, విద్యుత్ తదితర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేసుకొనేందుకు నాలుగు ఒప్పందాలు చేసుకున్నారు. సంయుక్త అభివృద్ధి వ్యూహాన్ని సిద్ధంచేసుకోవడం, జలవిద్యుత్ విరివిగా ఉన్న నేపాల్ నుంచి భారీగా విద్యుత్ దిగుమతి చేసుకోవడం మంచి నిర్ణయాలు. భారత ఆర్థిక సాయంతో నిర్మితమైన విద్యుత్, రైలుమార్గాల పూర్తికీ, వినియోగానికీ ఓలీ సృష్టించిన రాజకీయవాతావరణం మోకాలడ్డిన విషయం తెలిసిందే. ఇకపై రూపే కార్డు వినియోగానికి నేపాల్‌లోనూ వీలుండటంతో భారత పర్యాటకుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. భారత్, నేపాల్ చమురు కార్పొరేషన్ల మధ్య సరఫరా ఒప్పందాన్ని మరో ఐదేళ్ళు పొడిగించడం మెరుగుపడుతున్న బంధానికి మరో నిదర్శనం.


భారత భూభాగాలు కొన్నింటిని తమవేనంటూ నేపాల్ కొత్త మ్యాప్ ప్రచురించడంతో రెండేళ్ళుగా వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. దానిని పరిష్కరించుకోవడానికి పరస్పర అంగీకారమైన వ్యవస్థను సృష్టించుకోవాలనుకోవడం మంచి ముందడుగు. కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసిన నేపథ్యంలో భారత ప్రభుత్వం 2019 నవంబరులో విడుదల చేసిన కొత్త మ్యాప్‌లో కాలాపాని ప్రాంతాన్ని ఉత్తరాఖండ్ అంతర్భాగంగా చూపింది. మరో ఆర్నెల్ల తరువాత రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘడ్ నుంచి నేపాల్ తన భూభాగంగా చెప్పుకొనే లిపులేఖ్ వరకూ ఓ కొత్త రోడ్డుమార్గాన్ని మానస సరోవర యాత్ర నిమిత్తం ఆరంభించడంతో నేపాల్ మండిపడింది. ఇది జరిగిన ఇరవైరోజుల్లోనే కె.పి.శర్మ ఓలి ప్రభుత్వం నేపాల్ కొత్త మ్యాప్‌ను ప్రకటించి  లింపియతుర, లిపులేఖ్, కాలాపాని వంటి వివాదాస్పద ప్రాంతాలను తన భూభాగాలుగా ప్రకటించుకుంది. సరిహద్దుల వివాదాన్ని పరిష్కరించుకోవాల్సిన ఓ అంశంగా గుర్తించినప్పటికీ, గత ఎనిమిదేళ్ళలో ఒక్కసారి కూడా ఉభయదేశాల మధ్యా సమావేశం జరగనిమాట నిజం. ఆ తరువాత రెండు దేశాలూ దూకుడుగా పోయి సమస్యను జటిలం చేసుకున్నాయి. ఇప్పుడు కూడా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడం గురించి దేవ్‌బా ప్రత్యేకంగా ప్రస్తావించినా, మోదీ నేరుగా స్పందించలేదు. అయితే, సరిహద్దు వివాదాలను రాజకీయం చేయకూడదన్న వ్యాఖ్యమాత్రం వచ్చేనెల చివర్లో నేపాల్‌లో జరగబోతున్న స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చేసిందే. ప్రధానంగా వామపక్షపార్టీలు ఈ అంశాన్ని ఈ ఎన్నికల్లో కూడా రాజకీయ లబ్ధికోసం వాడుతున్నాయని అంటారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నేపాల్‌తో భారత్ వ్యవహారశైలిలో ఎంతో మార్పు వచ్చింది. 2015లో నేపాల్ కొత్త రాజ్యాంగాన్ని రాసుకున్నప్పుడు భారత్ కొన్ని అభ్యంతరాలు ప్రకటించడం, భారతమూలాలున్నవారి ప్రాతినిధ్యాన్ని పెంచమని కోరడం తెలిసిందే. కానీ, నేపాల్ పాలకులు తరై ప్రాంత రాజకీయపక్షాల మనోభావాలను బేఖాతరుచేస్తూ కొత్త రాజ్యాంగం ఆమోదం దిశగా అడుగులు వేయడంతో భారత ప్రభుత్వ పరోక్ష మద్దతుతో ఉద్యమాలు, ఆర్థిక దిగ్బంధాలు జరిగి నేపాల్ కష్టాలపాలైంది. ఇది నేపాలీల్లో భారత వ్యతిరేకతను పెంచిన మాట, దానిని ఓలీ వంటి నాయకులు తమకు అనుకూలంగా వాడుకున్న మాట నిజం. దేవ్‌బా పర్యటనలో అద్భుతాలేమీ జరగకపోయినా, జరిగిన నష్టాన్ని పూడ్చడానికీ, సయోధ్యకు బాటలు వేయడానికీ ఉభయులకూ వీలుకల్పిస్తోంది.

Updated Date - 2022-04-05T07:32:48+05:30 IST