రుయా అత్యవసర విభాగంలో రోగుల వెతలు

ABN , First Publish Date - 2021-07-26T06:25:09+05:30 IST

తిరుపతి రుయాస్పత్రిలోని అత్యవసర విభాగానికొచ్చే రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

రుయా అత్యవసర విభాగంలో రోగుల వెతలు
ఎమర్జెన్సీ వార్డుకు రోగిని తీసుకొస్తున్న బంధువులు - అత్యవస విభాగంలో వైద్యుల కోసం ఎదురు చూస్తున్న రోగి సహాయకులు

వైద్యసేవలు అధ్వానమంటూ రోగి సహాయకుల ఆరోపణ


తిరుపతి సిటీ, జూలై 25: తిరుపతి రుయాస్పత్రిలోని అత్యవసర విభాగానికొచ్చే రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ వైద్యసేవలు అధ్వానంగా ఉన్నాయంటూ రోగి సహాయకులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఆస్పత్రికి దాదాపు 300 మంది వరకు రోగులు వస్తున్నారు. వీరిలో 150 మంది అత్యవసర విభాగానికి చెందినవారే ఉంటున్నారు. ఇటువంటి వారికి త్వరగా వైద్యసేవలు అందిస్తే ప్రాణాలను కాపాడవచ్చు. కానీ ఆస్పత్రిలో ఆ పరిస్థితి కనిపించడం లేదని రోగి సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారి మాటల్లోనే.. ‘108 వాహనంలో వచ్చే రోగులను కనీసం దింపుకునేందుకు కూడా సిబ్బంది ఉండటం లేదు. మేమే రోగిని స్ట్రెచ్చర్‌పై పెట్టుకుని అత్యవసర విభాగానికి వెళ్లి, ఖాళీగా ఉన్న బెడ్‌ వెతుక్కోవాల్సి వస్తోంది. ఆ తర్వాత వైద్యులు వస్తారా.. అంటే గంటల తరబడి వేచి ఉండాల్సిందే. సెలవు రోజులైతే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. సీనియర్‌ వైద్యులెవరూ ఇటువైపు రావడం లేదు. కేవలం జూనియర్‌ డాక్టర్లు మాత్రమే కనిపిస్తారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందన్న విమర్శలున్నాయి. ఇకనైనా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రోగులు, వారి సహాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-07-26T06:25:09+05:30 IST