ఒకే ఒక్క క్లిక్‌తో రోగుల సమాచారం.. రుయాలో కొత్త సాఫ్ట్‌వేర్‌

ABN , First Publish Date - 2022-03-01T12:24:33+05:30 IST

దేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నెంబరు నమోదు చేస్తే చాలు.. అంతకుముందు ఆ రోగి పొందిన వైద్యం..

ఒకే ఒక్క క్లిక్‌తో రోగుల సమాచారం.. రుయాలో కొత్త సాఫ్ట్‌వేర్‌

  • దేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నెంబరుతో వివరాలు లభ్యం 

చిత్తూరు జిల్లా/తిరుపతి : దేశంలో ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నెంబరు నమోదు చేస్తే చాలు.. అంతకుముందు ఆ రోగి పొందిన వైద్యం, ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవచ్చు. ‘ఈ- హాస్పిటల్‌’ విధానంలో భాగంగా ‘మిస్టరీ ఆఫ్‌ ఎలక్ర్టానిక్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా’ అనే నూతన సాఫ్ట్‌వేర్‌ను కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిని సోమవారం తిరుపతి రుయాలో నేషనల్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ నీతావర్మ ప్రారంభించారు. ఈ- హాస్పిటల్‌ విధానంలో భాగంగా దేశ వ్యాప్తంగా 700 కేంద్రాలను కేంద్రం ప్రారంభించిందని తెలిపారు. అందులో రాష్ట్రంలోని 54 కేంద్రాల్లో ఈ నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చే క్రమంలో తొలిసారిగా రుయాలో ప్రారంభించామన్నారు. 


ఈ నూతన సాఫ్ట్‌వేర్‌ విధానంలో ఒకసారి ఓపీ తీసుకుంటే.. ఆ రోగికి చేసిన వైద్యం, వైద్య పరీక్షలు, మందుల వివరాలు, ఆరోగ్య పరిస్థితి అన్నీ పూర్తిగా నమోదు చేసేందుకు వీలవుతుందని ఆమె వివరించారు. ఓపీ తీసుకునే ప్రతి రోగికీ ఒక ఐడీ నెంబరు వస్తుందన్నారు. దేశంలోని ఏ ఆస్పత్రికి వెళ్లినా ఈ ఐడీని నమోదు చేస్తే వారి పూర్తి వైద్య వివరాలు సంబంధిత వైద్యులు తెలుసుకోవచ్చన్నారు. దీనికీ రోగుల అనుమతి అవసరమన్నారు. సంబంధిత రోగుల ఫోనుకు వచ్చే ఓటీపీ చెబితేనే వివరాలు తెలుసుకునేందుకు సాధ్యమవుతుందని నీతావర్మ తెలిపారు. అనంతరం నూతన సాఫ్ట్‌వేర్‌ విధానంలో రోగులకు ఆమె సొంతంగా ఓపీ నమోదు చేసి ఆ స్లిప్పులను అందజేశారు. 


ఈ విధానం కోసం ఆస్పత్రిలో ఇప్పటికే పది కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, మరో 50కి ప్రతిపాదనలు సిద్ధం చేశామని రుయాస్పత్రి సూపరిటెండెంట్‌ డాక్టర్‌ భారతి తెలిపారు. ప్రసూతి ఆస్పత్రిలోనూ ఈ నూతన సాఫ్ట్‌వేర్‌ విధానంలోనే వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్‌ అండ్‌ స్టేట్‌ ఇన్ఫర్మెటిక్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఇనియా నెహ్రూ, సీనియర్‌ టెక్నికల్‌ డైరెక్టర్‌  సయ్యద్‌ ఉస్మాన్‌, రుయాస్పత్రి వర్కింగ్‌ కమిటీ చైర్మన్‌ బండ్ల చంద్రశేఖర్‌ రాయల్‌, ఆర్‌ఎంవోలు డాక్టర్‌ ఈబీ దేవి, డాక్టర్‌ గోపీనాథ్‌, ప్రసూతి ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖరన్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-01T12:24:33+05:30 IST