Spicejet విమానంలో మంటలు.. Patna లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN , First Publish Date - 2022-06-19T19:25:44+05:30 IST

పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్‌జెట్(SpiceJet) విమానంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించి, తక్షణమే అప్రమత్తమైన పైలెట్లు విమానాన్ని వెనక్కితిప్పారు. పాట్నాలోని

Spicejet విమానంలో మంటలు.. Patna లో ఎమర్జెన్సీ ల్యాండింగ్

పాట్నా : పాట్నా నుంచి ఢిల్లీ వెళ్తున్న స్పైస్‌జెట్(SpiceJet) విమానం గాల్లో ఉండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన పైలెట్లు అప్రమత్తమై విమానాన్ని వెనక్కితిప్పారు. పాట్నాలోని బిహ్తా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌(Bihta Airforce Station)లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో అదృష్టవశాత్తూ పెనుప్రమాదం తప్పింది. మొత్తం 185 మంది ప్రయాణికులతో స్పైస్‌జెట్ బోయింగ్ 727లో ఈ ఘటన జరిగింది. విమానం ల్యాండవ్వగానే అక్కడే సిద్ధంగా ఉన్న పోలీసులు, ఎయిర్‌పోర్ట్ అధికారులు ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తొలుత ప్రయాణికుల్లో ఒకరైన ఫుల్వారి షరీఫ్ విమానం ఎడమ రెక్కపై మంటలు గుర్తించాడు. వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాడని పాట్నా అధికారి చంద్రశేఖర్ సింగ్ వెల్లడించారు.


పక్షి ఢీకొనడంతోనే మంటలు: డీజీసీఏ

స్పెస్‌జెట్ విమానాన్ని పక్షి ఢీకొనడంతోనే మంటలు చెలరేగడానికి కారణమని డీజీసీఏ(డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) నిర్ధారించింది. పక్షి ఢీకొట్టడంతో ఇంజిన్ 1 వైఫల్యానికి కారణమని వివరించింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ఇదే కారణమని వెల్లడించింది. కాగా ఈ మంటలకు సాంకేతిక లోపమే కారణమని అధికారులు తొలుత అనుమానించారు. ఇంజనీరింగ్ బృందం తదుపరి దర్యాప్తు చేయనుందని తెలిపారు. కాగా విమానం 2 బ్లేడ్లు వంకరపోయాయి.


విమానం మధ్యాహ్నం 12:30కి టేకాఫ్ తీసుకుంది. విమానం బయలుదేరినప్పుడే ఏదో తేడాగా అనిపించిందని ఓ ప్రయాణికుడు పేర్కొన్నాడు. విమానం వెళ్తున్నప్పుడు లోపలి లైట్లు వెలిగిఆరిపోతుండేవని మరో ప్రయాణికుడు చెప్పాడు. మొదటి నుంచీ ఏదో లోపం ఉన్నట్టు అనిపించిందని పేర్కొన్నాడు. దీనంతటికీ స్పైస్‌జెట్ కారణమని నిందించారు. విమానం సాధారణ ఎత్తుకు చేరడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎమర్జెన్సీ ల్యాండింగ్ ముందు విమానం దాదాపు 25 నిమిషాలపాటు గాల్లోనే ఉందని ప్రయాణికులు వివరించారు.

Updated Date - 2022-06-19T19:25:44+05:30 IST