Sanjay Raut: 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ABN , First Publish Date - 2022-08-08T20:17:06+05:30 IST

పట్రా చావల్ ల్యాండ్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌ను 14 రోజుల పాటు..

Sanjay Raut: 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ

ముంబై: పట్రా చావల్ ల్యాండ్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టయిన శివసేన ఎంపీ సంజయ్  రౌత్ (Sanjay Raut)ను 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి (Judicial custody) ముంబైలోని ప్రత్యేక కోర్టు సోమవారం ఆదేశించింది. ఈడీ కస్టడీ గడువు సోమవారంతో ముగుస్తుండటంతో ఆయనను అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈడీ ఈసారి ఆయన కస్టడీని పొడిగించాలని కోరలేదు.


పట్రా చావల్  రీవలప్‌మెంట్‌లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే అభియోగంపై సంజయ్‌ రౌత్‌ను ఆగస్టు 1న ఈడీ అరెస్టు చేసింది. తొలుత ఈనెల 4 వరకూ ఈడీ కస్టడీకి ఆదేశించిన కోర్టు, ఆ తర్వాత ఈడీ విజ్ఞప్తి మేరకు 8వ తేదీ వరకూ పొడిగించింది. ఈ కేసులో అలీబాగ్‌లో ఆస్తుల కొనుగోలుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న ఈడీ, సంజయ్ రౌత్ భార్య హర్షా రౌత్ బ్యాంకు అకౌంట్‌లో రూ .1.08 కోట్లు ఉన్నట్టు గుర్తించింది. ఇందుకు సంబంధించి వర్షా రౌత్‌ను శనివారంనాడు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించింది. శివసేన చీఫ్, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు అత్యంత సన్నిహితుడైన రౌత్ మాత్రం తాను ఏ తప్పు చేయలేదని, ఈడీ తప్పుడు కేసు బనాయించిందని అంటున్నారు.

Updated Date - 2022-08-08T20:17:06+05:30 IST