దేశభక్తి.. వెల్లివిరిసేలా..

ABN , First Publish Date - 2022-08-10T04:23:22+05:30 IST

75వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.

దేశభక్తి.. వెల్లివిరిసేలా..
కల్చరల్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శన ఇస్తున్న విద్యార్థినులు

జిల్లా వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు

కలెక్టర్‌ ఆధ్వర్యంలో వరుస కార్యక్రమాలు


రాయచోటి, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా జీవించగలుగుతున్నాం... అంటే 75 సంవత్సరాలకు మునుపు ఎందరో తమ స్వేచ్ఛను కోల్పోయిన పుణ్యమే.. మరెందరో తమ రక్తాన్ని త్రుణప్రాయంగా చిందించడమే.. ఇంకెందరో తమ మాన, ప్రాణాలను బ్రిటీష్‌ ముస్కరుల తూటాకు అర్పించడమే.. వీటి ఫలితమే.. ఈరోజు మనమందరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం... 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. జిల్లాలో కలెక్టర్‌ గిరీషా ఆధ్వర్యంలో కన్నుల పండువగా జిల్లా యంత్రాంగం కార్యక్రమాలు జరుపుతోంది. ఈనెల 1 నుంచి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. తొలుత జిల్లా స్థాయిలో వార్డు, గ్రామ సెక్రటరీలతో కలెక్టర్‌ సమావేశాన్ని నిర్వహించారు. 2న జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య 146వ జయంతి, బళ్లారి రాఘవ జయంతిలను ఘనంగా నిర్వహించారు. సెల్ఫీ విత్‌ నేషనల్‌ ఫ్లాగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం పట్టణంలో 150 అడుగుల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ గిరీషా, జాయింట్‌ కలెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఆకేపాటి అమరనాథరెడ్డిలు శాంతికపోతాన్ని ఎగురవేసి, జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 3న కలెక్టరేట్‌లో సంతకాల సేకరణను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, కలెక్టర్‌ గిరీషాతో పాటు పలువురు అధికారులు సంతకాలు చేశారు. 4న ఉదయం 6.30 గంటలకు ఎస్పీ కార్యాలయం వద్ద ఉన్న పోలీసుపెరేడ్‌ గ్రౌండు నుంచి వేంపల్లె రోడ్డు కూడలి, మాసాపేట, సాయి ఇంజనీరింగ్‌ కళాశాల, కలెక్టరేట్‌ మీదుగా 5కె రన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.  5న దేశభక్తి నాటకాలను జిల్లాలోని ముఖ్య పట్టణాలలో ప్రదర్శించారు. 6న దేశభక్తి అనే అంశంపైన పలు ప్రదర్శనలు నిర్వహించారు. 7న కలెక్టరేట్‌ నుంచి గాలివీడు రింగురోడ్డు, ఆర్టీసీ బస్టాండు, బంగ్లా మీదుగా కలెక్టరేట్‌ వరకు బైకు ర్యాలీని నిర్వహించారు. 8న జిల్లా స్థాయిలో డ్రాయింగ్‌, పెయింటింగ్‌, వకృత్వ పోటీలను నిర్వహించారు. 9న పట్టణంలోని సాయిశుభ కల్యాణమండపంలో కల్చరల్‌ ఫెస్టివల్‌ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా జరిగాయి. పలువురు కళాకారులు ప్రదర్శన చేశారు. 10న వివి గిరి జయంతి వేడుకలు, 11న జిల్లాలోని వారసత్వ కట్టడాలు, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను శుభ్రం చేయనున్నారు.

    జిల్లా స్థాయి అధికారులు పాల్గొని గుర్రంకొండ కోటను స్వచ్ఛగ్రాహ కార్యక్రమం కింద శుభ్రం చేయించనున్నారు. 12న జిల్లా, మండల స్థాయిలో క్రీడల పోటీలు, 13న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జాతీయ జెండా ముగ్గుల పోటీలు, సాయంత్రం 6 గంటలకు పోలీసుపెరేడ్‌ గ్రౌండులో స్వాతంత్య్ర సమరమోధుల సత్కార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 14న జిల్లాలోని అందరు తహసీల్దార్ల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుల ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులను సత్కరించనున్నారు. 15న పాదయాత్రతో పాటు జెండా ఊరేగింపును నిర్వహించనున్నారు. కొత్త జిల్లా కావడంతో ఈ కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కలెక్టర్‌ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ప్రస్తుత తరానికి స్వాతంత్య్ర పోరాటం గురించి తెలిసే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను సమాయత్తం చేస్తున్నారు. కార్యక్రమాలలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొనాలని కలెక్టర్‌ పిలుపునిచ్చారు. 



Updated Date - 2022-08-10T04:23:22+05:30 IST