ప్రజలు ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా కల్తీ: Pattabhi Ram

ABN , First Publish Date - 2022-06-28T21:37:49+05:30 IST

ప్రజలు ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా కల్తీల్తీకి పాల్పడుతోందని టీడీపీ నేత పట్టాభిరామ్ ఆరోపించారు.

ప్రజలు ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా కల్తీ: Pattabhi Ram

అమరావతి (Amaravathi): నిన్న మద్యంలో, నేడు ప్రజల ప్రాణాలు కాపాడే మందుల్లో కూడా జగన్ (Jagan) బందిపోటు ముఠా కల్తీకి పాల్పడుతోందని టీడీపీ నేత పట్టాభిరామ్ (Pattabhi Ram) ఆరోపించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన యు.ఎస్.ఎఫ్.డి.ఏ (USFDA) (యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ) పరిశోధనలో అరబిందో ఫార్మా కల్తీకి సంబంధించి సంచలన వాస్తవాలు వెల్లడించిందన్నారు. జనవరి 12, 2022న యు.ఎస్.ఎఫ్.డి.ఏ అరబిందోకి రాసిన ఘాటైన లేఖలో ఈ కల్తీ విషయంపై తీవ్ర హెచ్చరికలు జారీ చేసిందన్నారు. జూన్ 2019లో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ఉన్న అరబిందో ఫార్మా తనిఖీలో కల్తీ పదార్ధాలు కనుగొని యు.ఎస్.ఎఫ్.డి.ఏ మొదటిసారి హెచ్చరికలు చేసిందన్నారు. కానీ పద్ధతి మార్చుకోకపోవడంతో తెలంగాణ బోరపట్ల గ్రామంలోని అరబిందో ఫార్మాలో ఆగష్టు, 2021లో తనిఖీ చేసి కల్తీ జరుగుతున్నట్లు కనుగొనటంతో మరోసారి జనవరి, 2022లో ఘాటుగా హెచ్చరికలు చేసిందన్నారు. మందుల్లో కల్తీ అక్రమాలు కట్టిపెట్టకపోతే అమెరికాలో అరబిందో ఉత్పత్తి చేసే మందులను నిషేధిస్తామని వార్నింగ్ ఇచ్చిందన్నారు. 


అరబిందో ఇటువంటి కల్తీలకు పాల్పడుతూ ప్రపంచ వ్యాప్తంగా దేశ ప్రతిష్టను, రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతోందని పట్టాభిరామ్ అన్నారు. ఇసుక, మద్యం, మైనింగ్, అక్రమాలతో ధనదాహం తీరక నేడు అత్యంత క్రూరంగా తన బినామీ కంపెనీల ద్వారా ప్రజల ప్రాణాలు కాపాడే మందుల్లో సైతం కల్తీలకు పాల్పడుతూ జగన్ కోట్లు మింగుతున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన ఫార్మా కంపెనీ ధనదాహంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం అత్యంత బాధాకరమన్నారు. అరబిందో యజమాని రాంప్రసాద్ రెడ్డి, జగన్ రెడ్డి బినామీ అని, ఏ2 విజయసాయిరెడ్డికి స్వయానా వియ్యంకుడని తెలిపారు. గతంలో జగన్ రెడ్డి ఇదే కంపెనీకి రాష్ట్రంలోని మొత్తం అంబులెన్సుల వ్యవస్థను కట్టబెట్టి రూ.307 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం మరో బినామీ హెటెరో ఫార్మా యజమాని పార్ధసారధి రెడ్డి.. కరోనా సమయంలో రెమిడెసీవియర్ ఇంజక్షన్లు బ్లాక్ మార్కెట్ చేసి వేల కోట్లు దోపిడీకి పాల్పడ్డారన్నారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రదేశాలలో బీరువాలు నిండా హెటెరో నల్లధనం ఐటీ శాఖకు దొరికిన సంగతి తెలిసిందేనన్నారు. తన బినామీల ఫార్మా కంపెనీలైన అరబిందో, హెటెరోలను అడ్డం పెట్టుకుని ప్రజారోగ్యాన్ని సైతం పణంగా పెట్టి జగన్ రెడ్డి తన ఖజానా నింపుకుంటున్నారని విమర్శించారు. ప్రతీరోజు అసభ్యపదజాలంతో కారుకూతలు కూసే ట్వీట్టర్ పక్షి విజయసాయి రెడ్డి తన వియ్యంకుడి కల్తీ భాగోతంపై ఏం సమాదానం చెబుతారని పట్టాభిరామ్ ప్రశ్నించారు.

Updated Date - 2022-06-28T21:37:49+05:30 IST