బుకాయింపులతో వాస్తవాల్ని చెరపలేరు: పట్టాభిరాం

ABN , First Publish Date - 2022-02-02T21:27:40+05:30 IST

చిన్న పిల్లలకిచ్చే చిక్కీల్లో కూడా అవినీతికి పాల్పడి వైసీపీ నేతలు పందికొక్కుల్లా మెక్కుతున్నారని...

బుకాయింపులతో వాస్తవాల్ని చెరపలేరు: పట్టాభిరాం

అమరావతి: చిన్న పిల్లలకిచ్చే చిక్కీల్లో కూడా అవినీతికి పాల్పడి వైసీపీ నేతలు మెక్కుతున్నారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం తీవ్ర స్థాయిలో విమర్శించారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రి కమీషన్ల కోసం కక్కుర్తిపడి చిక్కీల టెండర్లలో నిభంధనలు మార్చి వాళ్లకు కావాల్సిన కంపెనీలకు టెండర్లు కట్టబెట్టారని ఆరోపించారు. దీనిపై తాము ప్రశ్నిస్తే మంత్రి సురేష్ బుకాయిస్తున్నారని, బుకాయింపులతో వాస్తవాల్ని చెరపలేరని అన్నారు. టీడీపీకి సంబంధించిన కంపెనీలకు టెండర్లు దక్కలేదనే ప్రభుత్వంపై బురద చల్లుతున్నారని  ఓ అవినీతి పత్రికలో రాశారని మండిపడ్డారు. కేంద్రీయ బండార్ టీడీపీ కంపెనీనా? కేంద్రీయ బండార్‌లో 68.19 శాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉందని, కాదని మంత్రి చెప్పగలరా? అని ప్రశ్నించారు. ఎన్‌సీసీ‌ఎల్ కేంద్ర భాగస్వామ్యంతో ఉన్న కంపెనీ కాదా?.. ప్రభుత్వ రంగ సంస్ధలకు కాదని వేరే కంపెనీలకు ఎందుకిచ్చారని ప్రశ్నిస్తే.. ఆ కంపెనీలు టీడీపీవి అంటూ అసత్య ప్రచారం చేస్తారా? అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం టెండర్లు ఇచ్చిన కంపెనీలపై వైసీపీ ఎందుకంత ప్రేమ ఒలకబోస్తుందో?.. వాటి నుంచి మంత్రికి ఎంత  ముట్టిందో తేలుస్తామని పట్టాభిరాం అన్నారు.

 

మారుతి ఆగ్రోస్ లాంటి కంపెనీలను ఎందుకు వెనకేసుకొస్తున్నారని పట్టాభిరాం ప్రశ్నించారు. టెండర్ డాక్యుమెంట్లలో నిభందనలు మార్చలేదని మంత్రి నిస్సిగ్గుగా అబద్దాలు  చెబుతున్నారన్నారు. అవినీతిని ప్రశ్నించినందుకు తనపై, మీడియాపై పరువు నష్టం దావా వేస్తానని  మంత్రి బెదిరిస్తున్నారన్నారు. గురువారం సాయంత్రం 4 గంటలకు తన వద్ద ఉన్న ఆధారాలతో మిడ్డే మీల్ డైరెక్టర్ ఆఫీస్‌కు వస్తానని, మంత్రి కూడా రావాలని సవాల్ చేశారు. మీడియా సమక్షంలో టెండర్లు కండినషన్లు మార్చారో లేదో నిరూపిస్తామన్నారు. సమధానం చెప్పకుండా అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తామంటే భయపడేది లేదని పట్టాభిరాం స్పష్టం చేశారు.

Updated Date - 2022-02-02T21:27:40+05:30 IST