కేన్సర్‌ అని నా దగ్గరకు తీసుకొస్తే 12 వారాల్లో తగ్గించేశా

ABN , First Publish Date - 2020-02-08T01:48:24+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో హోమియోపతి వైద్యానికి చిరునామాగా మారిన వ్యక్తి పావులూరి కృష్ణచౌదరి. ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన ఆయన హోమియో వైద్య వ్యాప్తికి చేసిన కృషి అపారం. అల్లోపతి, హోమియోపతి.. రెండూ మిళితం చేయడం ద్వారా రోగికి అతి తక్కువ ఖర్చులోనే వైద్యం అందించడానికి 89 ఏళ్ల వయసులోనూ నిర్విరామంగా శ్రమిస్తున్న అపర ధన్వంతరి.

కేన్సర్‌ అని నా దగ్గరకు తీసుకొస్తే 12 వారాల్లో తగ్గించేశా

పత్రిక పెట్టడమంటే పెద్ద తలనొప్పని రామోజీరావు అన్నారు

నేను అలా చెప్పగానే రామారావు వెంటనే మంజూరు చేశారు

చిన్నజీయర్‌ స్వామి గాయాలను హోమియో మందులతో పూర్తిగా తగ్గించా

చదువుకుని ఉద్యోగం చేయకూడదనేది నా ఫిలాసఫీ

రెండవ ప్రపంచయుద్ధం తరువాత ఆ ట్రీట్‌మెంట్‌ నాపై ప్రభావాన్ని చూపింది

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో హోమియోపతి వైద్యులు పావులూరి కృష్ట చౌదరి


తెలుగు రాష్ట్రాల్లో హోమియోపతి వైద్యానికి చిరునామాగా మారిన వ్యక్తి పావులూరి కృష్ణచౌదరి. ఎంబీబీఎస్‌ పూర్తిచేసిన ఆయన హోమియో వైద్య వ్యాప్తికి చేసిన కృషి అపారం. అల్లోపతి, హోమియోపతి.. రెండూ మిళితం చేయడం ద్వారా రోగికి అతి తక్కువ ఖర్చులోనే వైద్యం అందించడానికి 89 ఏళ్ల వయసులోనూ నిర్విరామంగా శ్రమిస్తున్న అపర ధన్వంతరి. వైద్యరంగంలో హోమియోకు తిరుగులేదంటున్న పావులూరి కృష్ణచౌదరి.. హోమియో వైద్యంపై తనకున్న మమకారాన్ని, ఒక వైద్యుడిగా తన అరవై ఏళ్ల ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను ఓపెన్‌ హార్ట్‌ విత ఆర్కే కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో పంచుకున్నారు.

 

ఆర్కే: నమస్కారం కృష్ణచౌదరి గారు

పావులూరి: నమస్కారం.


ఆర్కే: ఇప్పుడు తొంభై ఏళ్లా?

పావులూరి: 89


ఆర్కే: మాకన్నా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు

పావులూరి: యూజ్‌ ఇట్‌ ఆర్‌ లూజ్‌ ఇట్‌ అని బయాలజీలో ఒక ప్రిన్సిపుల్‌ ఉంది. అందుకే నేను నా బాడీని ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంచుతాను. లేకపోతే మనం చాలా బయాలజికల్‌గా, మెంటల్‌గా చాలా కోల్పోవాల్సి వస్తుంది.

 

ఆర్కే: ఈ ఆరోగ్యం, చలాకీతనం వ్యక్తిగత క్రమశిక్షణ వల్ల వచ్చిందా? లేక హోమియో మందుల వల్ల వచ్చిందా?

పావులూరి: రెండింటి ప్రభావం ఉంది. హోమియో వైద్యంను ఒక ధ్యేయంగా మొదలుపెట్టాను. త్రిపురనేని రామస్వామి చౌదరి ప్రభావం నాపై చాలా ఉంది. ఆయన హేతువాది. ఒకరకంగా చెప్పాలంటే చదువుకుని ఉద్యోగం చేయకూడదనేది నా ఫిలాసఫీ. చదువుకుని విజ్ఞానం సంపాదించుకోవాలి. ఆ విజ్ఞానంతో బతకాలి. ఆ దృష్టితోనే ఎంఎస్సీ, మెడిసిస్‌ కోర్సులకు అప్లై చేశా. ఎంఎస్సీ కోర్సులో సీటొస్తే జాయిన్‌ అయ్యా. ఎందుకంటే ఎంఎస్సీ పూర్తి చేసి ట్యుటోరియల్‌ కాలేజ్‌ పెట్టుకోవాలన్నది నా ఆలోచన. అయితే ఆ తరువాత మెడిసిన్‌లో కూడా సీటొచ్చింది. ఇంటికెళ్లి అమ్మానాన్నను అడిగా. అప్పటికే నాకుపెళ్లయింది. మా ఫాదర్‌ ఒక్కటే అన్నారు. నువ్వేం చదవాలో నాకు తెలియదు కానీ, నువ్వేం చదవాలనుకున్నా నేను చదివిస్తా అన్నారు. ఎంపిసీ వాళ్లకు మెడిసిన్‌ సీటివ్వడం మా బ్యాచ్‌తోనే లాస్ట్‌. ఐదేళ్ల చదువు పూర్తయితే ప్రాక్టీస్‌ పెట్టుకోవచ్చని అనుకున్నా. ఏదైనా బతుకు దెరువే. కానీ ఆ బతుకు దెరువు కూడా మనసుకు నచ్చిందే చేయాలి.

 

ఆర్కే: హోమియో వైపు రావాలనే మీ నిర్ణయంపై ఇంట్లో ఏవైనా గొడవలు జరిగాయా?

పావులూరి: నలుగురికీ మేలు చేయడానికి ఏది వీలైతే అదే చేయమని నా ధర్మపత్ని చెప్పేది. ఇంటిపోరు లేదు. కెంట్‌ రిపర్టీ అనే పుస్తకం ఉండేది. ఇప్పుడు మార్కెట్‌లో లేదు. దాని ధర అప్పట్లో 150 రూపాయలు. సవరు బంగారం ధర 55-60 రూపాయల మధ్య ఉండేది. ఆ పుస్తకం ఒక కాపీ ఇంట్లో, ఒక కాపీ హాస్పిటల్‌లో, మూడో కాపీ కారులో ఉండేది. మీకు చాదస్తం ఎక్కువని నా భార్య అనేది. పిల్లలను విద్యావంతుల్ని చేస్తే వాళ్ల సంపాదన వాళ్లు సంపాదించుకుంటారని చెప్పేవాడిని. ఆ రకంగా నాకు ఇంట్లో సపోర్ట్‌ బాగానే ఉండేది.


ఆర్కే: ఇప్పటికీ అల్లోపతి డాక్టర్లు హోమియోను వైద్యంగా అంగీకరించడం లేదు. మరి వీళ్ల మధ్య సాపత్యం ఎలా కుదురుతుంది?

పావులూరి: నేను హోమియోపతి తీసుకున్న తర్వాత మొట్టమొదటగా చేసిన పని నా టేబుల్‌ మీద నుంచి స్టెతస్కోప్‌ తీసేశాను. బిపి చూసేవాడిని కాదు. ఏ రిపోర్టు రాసేవాడిని కాదు. ఇవ్వన్నీ ఎందుకు తీసేశారని ఎవరైనా అడిగితే... ఈ పనులు చేసేవాళ్లు డాక్టర్లు మా వీధిలోనే పదిమంది ఉన్నారని చెప్పేవాడిని. నేను చేసే విధానంతో మీకు మేలుగా ఉందో లేదో చెప్పండి. బిపి తగ్గినా వ్యాధి పోయినట్టు కాదు. రెండు రోజులు మాత్రలు వేసుకోకపోతే బిపి మళ్లీ వస్తోంది. వ్యాధి తగ్గిందా లేదా అనేదే ప్రధానం. బిపి చూశామా లేదా అనేది కాదు.


ఆర్కే: పేషెంట్‌కు బిపి చూడకుండా మందు ఎలా ఇస్తారు?

పావులూరి: మీరు బిపి పేషెంట్‌ అని నా దగ్గరకు వస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. బిపి చూడాల్సిన అవసరం లేదని గాని, అది చూడటం తప్పనిగానీ నా ఉద్దేశం కాదు. పేషెంట్‌ మాటలను, బిపి లక్షణాలను బట్టి తెలుస్తుంది. ఈ రోజుల్లో ప్రతివాళ్లు మనం చెప్పినా చెప్పకపోయినా బిపి చూపించుకుంటూనే ఉన్నారు.


ఆర్కే: గుండె జబ్బులకు సంబంధించి.. వాల్వ్స్‌లో వచ్చే బ్లాక్స్‌ను మందులతో క్లియర్‌ చేయగలరా?

పావులూరి: బ్లాక్స్‌ క్లియర్‌ చేయలేం, కానీ కాంపెన్సేట్‌ చేస్తాం. అంటే హార్ట్‌ ఎటాక్‌ రాకుండా ఉపశాంతికి ఉపయోగపడేలా మందులు ఇవ్వగలం.


ఆర్కే: చాలా సందర్భాల్లో చివరి అవకాశంగా హోమియో వైపు వస్తున్నారు కదా?

పావులూరి: అవును. పరిస్థితి కొంత మారినా... ఇప్పుడు జరుగుతున్నది అదే. ముఖ్యంగా మన దేశంలో విద్యావంతులు, అవిద్యావంతులు అని రెండు తరగతులు తీసుకుంటే... అవిద్యావంతులకు దీనిగురించి తెలియదు. విద్యావంతుల సపోర్ట్‌ ఉంటే ఇది బతుకుతుంది. ఇప్పుడు మాకు వారి సపోర్ట్‌ దొరికింది.


ఆర్కే: హోమియోలో అన్ని రకాల ఎలిమెంట్స్‌ను ట్రీట్‌ చేయడం సాధ్యం కాదని మీరు చెబుతున్నా..చాలామంది వైద్యులు అన్నీ చేయగలమని చెప్తున్నారు కదా?

పావులూరి: అది వ్యాపార సరళి. కానీ వాస్తవం కాదు. అన్ని రకాల ఎలిమెంట్స్‌ను ట్రీట్‌ చేయడం సాధ్యమైతే నేను ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ సపోర్ట్‌ పెట్టను. హోమియోలో సాధ్యం కాకపోతే రోగిని దృష్టిలో పెట్టుకొని అల్లోపతిని ఇన్వాల్వ్‌ చేయాలి. కానీ ఇలా చెప్పడం కమర్షియల్‌ హోమియోపాథ్స్‌కు నచ్చదు. హోమియోపతికి పరిమితులు ఉన్నాయనే విషయాన్ని ఒప్పుకొని తీరాలి. ఎంపిక చేసిన జబ్బులకు మాత్రం దివ్యంగా పనిచేస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ బాధలు తగ్గుతాయి. పది వర్టిగో కేసుల్లో తొమ్మిది హోమియోతో కచ్చితంగా తగ్గుతాయి.

 

ఆర్కే: మీ దగ్గరకు వైద్యానికి వచ్చే అల్లోపతి డాక్టర్లు ఎందరుంటారు?

పావులూరి: నా దగ్గరకు చాలామంది అల్లోపతి డాక్టర్లు వాళ్ల ఫ్యామిలీతో సహా వస్తుంటారు. నేను అల్లోపతి చదువుకోవడం ఒక కారణం కావచ్చు.

 

ఆర్కే: ఏఏ రుగ్మతలకు హోమియో అద్భుతంగా పనిచేస్తుంది? 

పావులూరి: ఇన్ఫెక్షన్లకు బాగా పనిస్తుంది. రెస్పిరేటరీ డిసీజెస్‌, ఆస్మా, బ్రాంకైటిస్‌కు బాగా పనిచేస్తుంది. మైగ్రేన్‌, పెరాలసిస్‌కు హోమియోలో మంచి మందు ఉంది. నోటిపూత, ఎసిడిటీ, గ్యాస్‌, అల్సర్స్‌, డయేరియా, నెర్వస్‌ సిస్టమ్‌కు సంబంధించిన వ్యాధులకు బాగా పనిచేస్తుంది. మైండ్‌ డిస్ట్రబెన్స్‌కు కూడా మంచి మందులున్నాయి. శరీరంలో ఉండే 12 వ్యవస్థల్లో సైకో, న్యూరో, ఎండోక్రైన్‌, ఇమ్యూన్‌ సిస్టమ్స్‌ నాలుగింటిలో ఏ వ్యాధులు ఉన్నా హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.


ఆర్కే: గైనిక్‌ ప్రాబ్లమ్స్‌ కూడా హోమియోతో తగ్గుతాయా?

పావులూరి: వీటికి హోమియో చాలా మంచిది. వైట్‌ డిశ్చార్జ్‌, ఓవర్‌ బ్లీడింగ్‌ వంటి సమస్యలకు ఇది చాలా మంచి వైద్యం. స్ర్తీలకు చాలా ఉపయోగం.


ఆర్కే: మీ పిల్లలు...

పావులూరి: పెద్దబ్బాయి దురదృష్టవశాత్తూ చనిపోయాడు. రెండోవాడు అమెరికాలో చిల్ట్రన్స్‌ స్పెషలిస్ట్‌. నా మనుమరాలు (కూతురు కుమార్తె) ఎంబీబీఎస్‌ చేసి, నాతోపాటు హోమియోపతి ప్రాక్టీస్‌ చేస్తోంది. రెండోవాడిని కావాలనే ఎంబీబీఎస్‌లో చేర్చాను. ఎంబీబీఎస్‌ చేయకుండా హోమియోపతి చేయకూడదు. జిమ్స్‌ కాలేజీలో ఎండిలు, ఎమ్మెస్‌లతో పాఠాలు చెప్పిస్తున్నాం. ఇక్కడి నుంచి బయటకు వెళ్లబోయే విద్యార్థులు ఇండియాలోనే జెమ్స్‌.


ఆర్కే: మీకు ఎప్పుడైనా అల్లోపతి వైద్యం అవసరమైందా?

పావులూరి: నాకు ఏదన్నా సమస్య వస్తే హోమియోపతి తప్ప అల్లోపతి అవసరం రాలేదు. ఇప్పటివరకూ నేను ఏ అల్లోపతి మందు తీసుకోలేదు. నేను ఆరోగ్యంగా ఉండటం కూడా ఒక కారణం కావచ్చు.


ఆర్కే: తర్వాత ఏం ప్లాన్‌ చేస్తున్నారు?

పావులూరి: జిమ్స్‌లో అల్లోపతి డాక్టర్లకు హోమియోపతిలో శిక్షణ ఇస్తున్నాం. దాన్ని పాపులరైజ్‌ చేయాలి. వాళ్లు కోర్సు పాసైన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రభుత్వం అభ్యంతరపెట్టకూడదు. వాళ్లకు హోమియోపతి రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. దశ తెలిసి వైద్యం చేస్తే చాలావరకు ఖర్చు తగ్గుతుంది.

 

***********************************************

ఇంగ్లండ్‌లో రెండవ ప్రపంచయుద్ధం తరువాత ఫ్రీ ట్రీట్‌మెంట్‌ను ప్రారంభించారు. చికిత్స, మందులు అన్నీ ఉచితంగా అందించారు. చికిత్స తీసుకోవడానికి రాలేని వారికి ట్రాన్స్‌పోర్ట్‌ సౌకర్యాన్ని అందించేవారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ హోమియో వైద్యులు డబ్బులు తీసుకుని వైద్యం అందించే వారు. అది కూడా నాపై ప్రభావాన్ని చూపింది. ఇంగ్లండ్‌ వెళ్లి వచ్చాక అల్లోపతి కొనసాగించాలా? హోమియోపతిని ఎంచుకోవాలా? అని సందిగ్దత మొదలయింది. చివరకు హోమియో వైపే మొగ్గు చూపాను. గుంటూరులో హోమియో ప్రాక్టీస్‌ మొదలుపెట్టాను.

 

హైదరాబాద్‌కు షిఫ్ట్‌ కావడానికి కారణం ఉంది. అప్పుడు చీఫ్‌ సెక్రెటరీగా ఉన్న ఎంటి రాజు గారి భార్యకి అనారోగ్యంగా ఉంటే డాక్టర్స్‌తో ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కేన్సర్‌ అని తేల్చింది. చికిత్స కోసం టాటా మెమొరియల్‌, ముంబై తీసుకెళ్లాలని సూచించింది. అప్పుడు మంత్రిగా ఉన్న తిమ్మారెడ్డి నా గురించి చెప్పారు. ముంబైకి వెళ్లే ముందు గుంటూరులో ఉన్న ఆయనకు ఒకసారి చూపించు అని చెప్పారు. నా దగ్గరకు తీసుకొస్తే 12 వారాల్లో తగ్గించేశా. ఆ సంఘటన తరువాత నన్ను హైదరాబాద్‌కు రావాలని ఎంటి రాజుగారు పట్టుబట్టారు. ప్రభుత్వం తరపున కావలసిన సపోర్టు అంతా ఇస్తాను అన్నారు. దాంతో హైదరాబాద్‌కు షిఫ్ట్‌ అయ్యాను.

 

హైదరాబాద్‌కు వచ్చిన తరువాత హోమియోపతి కాలేజ్‌లో పదేళ్లపాటు పనిచేశాను. ఆ తరువాత బయటకొచ్చి ప్రాక్టీస్‌ పెట్టాను. ఆ క్రమంలోనే రామోజీరావుగారు పరిచయం అయ్యారు. ఆయనకు హోమియో వైద్యంపై అభిమానం లేదు. అయినా వాళ్ల అమ్మానాన్నలను చూడటానికి నన్ను పిలిచేవారు. వారానికొకసారి వెళ్లి చూసే వాణ్ణి. కొంతకాలం తరువాత ఆయనకు నా వైద్యంపై నమ్మకం ఏర్పడింది. ఆ తరువాత ఒకసారి నేనే అడిగా హోమియోపతి పత్రిక పెడతాను అని. ఆప్పుడాయన పత్రిక పెట్టడమంటే పెద్ద తలనొప్పి. మన పత్రికలో రాయండి. మన పత్రిక ద్వారా ప్రజల్లో హోమియో వైద్యంపై అవగాహన కల్పిద్దాం అన్నారు. సరే అన్నాను. అలా పత్రికలో ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ప్రారంభమయింది.

 

నా జీవితాన్ని మలుపు తిప్పిన మరో సంఘటన ఉంది. అది చిన్న జీయర్‌స్వామితో పరిచయం. ఒకసారి చిన్నజీయర్‌ స్వామి గారికి రోడ్డు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయనకు ఇంజక్షన్‌ అంటే ఇష్టం ఉండదు. విజయవాడలో పెట్టారు. చికిత్స కోసం నన్ను పిలిచారు. ఇంజక్షన్‌లు లేకుండా హోమియో మందులతో పూర్తిగా తగ్గించా. దాంతో ఆయనకు నాపై అభిమానం ఏర్పడింది. ఆయన అప్పటికే ఎన్నో మార్గాల్లో ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వైద్యం కూడా అందించాలని సంకల్పించారు. అప్పుడు నేను చెప్పాను ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ హాస్పిటల్‌ పెడదాం అని. అల్లోపతి ఉంటే హోమియో వైద్యం కోసం ఎవరొస్తారు అని కొందరన్నారు. కానీ ఆసుపత్రి ప్రారంభించాక హోమియో వైద్యం కోసం వచ్చిన వాళ్ల సంఖ్యే ఎక్కువ ఉంది. ప్రజల్లోకి తొందరగా వెళ్లడం కోసమే జీయర్‌ ఇంటిగ్రేటివ్‌ మెడికల్‌ సర్వీసెస్‌(జిమ్స్‌) అని పేరు పెట్టాం. హోమియోపతిని యాక్సెప్టబుల్‌ చేయాలంటే ఆసుపత్రికి వచ్చిన రోగికి కావలసిన మిగతా సౌకర్యాలు అందేలా చూడాలి. హోమియో ఒక్కటే ఉంటే చాలదు.

 

రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రభుత్వ వైద్యుల పోస్టుల సంఖ్యను భారీగా పెంచారు. హోమియో వైద్యం ప్రాచుర్యం పొందడానికి అది కూడా కారణం. హోమియో వైద్యం కోసం ఏం చేయమంటారు అని రామారావుగారు అడిగితే ‘‘అల్లోపతి డాక్టర్లున్నారు కానీ, హోమియో, ఆయుర్వేద వైద్యులు లేరు. అసిస్టెంట్‌ డాక్టర్ల పోస్టులను క్రియేట్‌ చేస్తే బాగుంటుంది’’ అని చెప్పడంతో రామారావు గారు వెంటనే మంజూరు చేశారు.

 

హోమియో వైద్యం అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో ‘ఇంటింటా హోమియో వైద్యం’ పేరుతో పుస్తకాన్ని రాశా. యాభై వేల పుస్తకాలు అమ్ముడుపోయాయి.

 

ప్రపంచంలో హోమియోలో ఇంజెక్షన్లు లేవు. ఎవరైనా చేస్తున్నామంటే అదంతా బోగస్‌. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇంగ్లాండ్‌ దేశాల్లో నేను చూశాను. ఎక్కడా ఈ పద్ధతి లేదు. జనాన్ని నమ్మించడం కోసం కొందరు చేస్తున్నారేమో.

 

అల్లోపతి డాక్టర్లు అనారోగ్యంలో దశలు పట్టించుకోవడంలేదు. డాక్టర్‌, పేషెంట్‌ రిలేషన్‌ కమర్షియల్‌గా మారింది. రోగి చెప్పేది వినే ఓపిక వైద్యుడికి ఉండటం లేదు. అసలు దశను అర్థం చేసుకుంటే హోమియోపతిలో డ్రగ్‌ సెలక్షన్‌ సులభం అవుతుంది.

Updated Date - 2020-02-08T01:48:24+05:30 IST