AP News: ఒక తరాన్ని మేల్కొల్పడానికి పార్టీ పెట్టా: పవన్ కళ్యాణ్

ABN , First Publish Date - 2022-08-15T01:33:12+05:30 IST

గుంటూరు: ఒక తరాన్ని మేల్కొల్పడానికి, బాధ్యత గుర్తు చేయడానికే పార్టీ పెట్టానని జనసేన పార్టీ అధినేత అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలో జనసేన ఐటీ విభాగం రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పవన్ హాజరై ప్రసంగించారు.

AP News: ఒక తరాన్ని మేల్కొల్పడానికి పార్టీ పెట్టా: పవన్ కళ్యాణ్

గుంటూరు: ఒక తరాన్ని మేల్కొల్పడానికి, బాధ్యత గుర్తు చేయడానికే పార్టీ పెట్టానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలో జనసేన ఐటీ విభాగం రాష్ట్రస్థాయి సదస్సు జరిగింది. ఈ సదస్సుకు పవన్ హాజరై ప్రసంగించారు. 


‘‘ఫ్రీడమ్ ఫర్ మిడ్ నైట్ పుస్తకాన్ని చదివాక దేశం కోసం ఏదైనా చేయాలన్న ఆలోచన వచ్చింది. నేను పార్టీ పెడతానని ఎప్పుడూ అనుకోలేదు. రాబోయే తరాలకు బాధ్యత తెలపడానికే జనసేన పెట్టా. ఒక్క ఎన్నిక కోసమే అయితే ఎవరూ జనసేనలోకి రావద్దు. కోట్లాది మందికి నిర్దేశం‌‌ చేయడమే మన లక్ష్యం. పదవి మనల్ని వెతుక్కుని రావాలి.. మనం దాని వెంట పడకూడదు.’’ అని ఉద్వేగంగా మాట్లాడారు.


జగన్‌వి అమలుకు సాధ్యంకాని హామీలు

జగన్ పాలనా తీరుపై పవన్ విరుచుకుపడ్డారు. అమలుకు సాధ్యంకాని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పులమయం చేస్తున్నారని ఆరోపించారు.‘‘వైసీపీకి అధికారమే పరమావధి. అందుకు ఎన్ని అడ్డదారులయినా తొక్కుతారు. జగన్ నోటికి వచ్చిన హామీలు ఇచ్చి ఓట్లు‌ వేయించుకున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఇసుక వంటి విషయాలలో మోసం చేశారు. సంక్షేమ పథకాలకు జనసేన పార్టీ వ్యతిరేకం కాదు. కానీ నడిచే వారికి కూడా పథకాలు ఎందుకు? వాళ్ల కాళ్లపై వాళ్లు నిలబడే వరకు ఊతమిస్తే సరిపోతుంది. భగవంతుని నమ్మి నేను మీ ముందుకు వచ్చాను. రాబోయే కొద్ది సంవత్సరాలలో అధికారం అన్ని వర్గాలకు దగ్గర అవుతుంది. భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బలమైన లక్ష్యంతో ముందుకు‌ వెళదాం’’ అని పేర్కొన్నారు. 


అమరావతిలోనే ఐటీ సంస్థలు 

‘‘ఐటీ ఉద్యోగులు బెంగుళూరు వైపు పరుగులు పెడుతున్నారు. జనసేన అధికారంలోకి వస్తే.. ఇక్కడే ఐటీ సంస్థలు ఏర్పాటు చేస్తాం. పక్క రాష్ట్రాలతో పోటీ పడి అభివృద్ధి చేస్తాం.’’ అని హామీ ఇచ్చారు. 


శ్రీలంక పరిస్థితులు ఏపీలో కనిపిస్తున్నాయి

‘‘మనసు పెట్టి చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. కానీ అలాంటి పాలకులు మనకి లేరు. అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తే ప్రయోజనం ఏమిటి? అడ్డగోలు అప్పులతో దేశ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలై పోతుంది. శ్రీలంకలో ఆ దేశ అధ్యక్షుడిని తరిమి కొట్టారు. ఏపీలో ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా. బరి తెగించి బూతులు తిట్టడమే పాలన కాదు. అధికారం ఉంది కదా.. అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించం. మోసం‌ చేసి మభ్యపెట్టే నాయకులు కావాలా? కష్టంతో మంచి పాలన అందించే నాయకులు కావాలా? ప్రజలే ఆలోచన చేయాలి.’’ అని సమావేశం ముగించారు. 

Updated Date - 2022-08-15T01:33:12+05:30 IST