పవన్‌ పర్యటనకు అడ్డంకులు

ABN , First Publish Date - 2022-04-23T00:03:03+05:30 IST

జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఏలూరు జిల్లా చింతలపూడి పర్యటన సందర్భంగా స్థానికులపై పలువురు అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు.

పవన్‌ పర్యటనకు అడ్డంకులు

ఏలూరు: జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఏలూరు జిల్లా చింతలపూడి పర్యటన సందర్భంగా స్థానికులపై పలువురు అధికార పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ఏలూరు జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 41 కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు, స్థానిక సమస్యలను తెలుసుకునేందుకు పవన్‌ 23వ తేదీన ఏలూరు జిల్లా చింతలపూడిలో కౌలు రౌతు భరోసా యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఒక్కో రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తారు. కాగా పవన్‌ చేసే సాయంతో ప్రభుత్వం చులకన అవుతుందనే భావనతో పలువురు అధికార పార్టీ నాయకులు ప్రజలను, కౌలు రైతు కుటుంబాలను ఆ కార్యక్రమానికి వెళ్లకుండా అడ్డుపడుతున్నారు.


రైతుల ఇళ్లకు వెళ్లి మరీ బెదిరింపులకు దిగుతున్నారు. నాయకులకు భయపడకుంటే  పోలీసు అధికారులను పంపి మరీ బెదిరిస్తున్నారని కొందరు బాధితులు వివరిస్తున్నారు. అలాగే రచ్చబండ ఏర్పాటుచేయబోతున్న స్థలం కేటాయింపులో కూడా ఇబ్బందులకు గురి చేశారని తెలుస్తోంది. ఇప్పటికే మూడు ప్రాంతాలను మార్చుకున్నట్లుగా జనసేన నాయకులు చెప్పారు. తమ నాయకుడు ఇచ్చే సాయంతో జగన్‌ పాలనా అసమర్ధత మరోసారి బయట పడుతుందని భయపడే ఇలా ప్రజలను, రైతు కుటుంబాలపై బెదిరింపులు, ఒత్తిళ్లు తెస్తున్నారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఎన్ని అవరోధాలు సృష్టించినా పవన్‌ పర్యటనను విజయవంతం చేసి తీరుతామని జనసేన నాయకులు తెలిపారు.

Updated Date - 2022-04-23T00:03:03+05:30 IST