వారిని ఏకం చేస్తారా.. వీరిని ఆదుకుంటారా!?

ABN , First Publish Date - 2020-12-04T04:26:37+05:30 IST

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో రెండు రోజుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

వారిని ఏకం చేస్తారా.. వీరిని ఆదుకుంటారా!?
నాయుడుపేట : వర్షపునీటిలో మునిగి పనికిరాకుండా పోయిన నారును చూపుతున్న రైతులు

నేడు, రేపు జిల్లాలో జనసేనాని పర్యటన

‘నివర్‌’ ప్రభావిత ప్రాంతాల పరిశీలన

జరిగిన నష్టంపై రైతులు, ప్రజలతో వాకబు

పార్టీ జిల్లా నేతలతోనూ సమావేశం

జిల్లాలో జనసైనికులు ఉన్నా నాయకత్వలేమి!

కమలనాథులతోనూ అంటీముట్టనట్టే!

అభిమానుల ఆశలన్నీ పవన్‌ కల్యాణ్‌పైనే

ఓ వైపు ముంచుకొస్తున్న తిరుపతి పార్లమెంట్‌ ఉప ఎన్నికలు.. మరోవైపు నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో చితికిపోయిన రైతన్నలు.. ఈ పరిస్థితుల్లో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ జిల్లా పర్యటన అటు రాజకీయంగా... ఇటు సామాజికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తుఫాన్‌ బాధితులను పరామర్శించడానికి, వారికి సముచిత సాయం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి శుక్ర, శనివారాల్లో పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో పర్యటించనున్నారు. పనిలోపనిగా భవిష్యత్‌ రాజకీయాలపై పార్టీ ప్రముఖులతో  ఆయన సమీక్షించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాల్లో పర్యటించి సాయంత్రానికి నెల్లూరు చేరుకుంటారు. రాత్రి పార్టీ ప్రముఖులతో సమావేశం అవుతున్నారు. శనివారం  నెల్లూరు నగరంలో పర్యటిస్తారు.


నెల్లూరు, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ జిల్లాలో రెండు రోజుల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ అంశాల్లోకి వస్తే జిల్లాలో ఆ పార్టీది వింత పరిస్థితి. అభిమానులు ఉన్నా నాయకత్వలేమి జిల్లాలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒకరిద్దరు నాయకుల పేర్లు మినహా మరెవరూ జనసేన జెండాతో కనిపించడం లేదు. జిల్లా బాధ్యతలను మనుక్రాంత్‌రెడ్డికి అప్పగించారన్న ప్రచారం జరుగుతున్నా ఆయన ఎప్పుడూ ప్రజల్లో కనిపించడం లేదు. నెల్లూరు సిటీ నుంచి కేతంరెడ్డి వినోద్‌రెడ్డి, రూరల్‌ నుంచి జి.కిషోర్‌లు మాత్రం ప్రజల్లో కనిపిస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు సాయం చేయడంలో అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో కేతంరెడ్డి వినోద్‌రెడ్డి చురుగ్గా పనిచేస్తున్నా పార్టీ పరంగా ఆయనకు తగిన గుర్తింపు లేదు. ఇటీవల జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఎదుట వినోద్‌రెడ్డి కంటతడి పెట్టుకున్న ఘటనే దీనికి నిదర్శనం. జిల్లావ్యాప్తంగా ఒకరిద్దరు నాయకులు చురుగ్గా పనిచేస్తున్నా వారిలో కూడా సఖ్యత లేదు. ఇక  కార్యకర్తల విషయానికి వస్తే ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం జరగలేదు. ఇటీవలే సిటీ రూరల్‌ నియోజకవర్గాల్లో క్రియాశీలక సభ్యత్వ నమోదు చేస్తున్నారు. ఈ రెండు ప్రాంతాలు మినహా జిల్లాలో మరెక్కడా పార్టీ ఉనికి కనిపించడం లేదు. మరోవైపు మిత్రపక్షం బీజేపీ నేతలు కూడా జనసేనను పరిగణలోకే తీసుకోవడం లేదు. మెగా కుటుంబ అభిమానులు, ప్రత్యేకించి పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నా వారిని రాజకీయంగా ఉపయోగించుకోవడంలో జనసేన పార్టీ విఫలమవుతోంది. ఈ కారణంగానే బీజేపీతో సహా అన్ని రాజకీయ పార్టీలకు జనసేన అంటే తేలిక భావన ఏర్పడింది. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికైనా తమ నాయకుడు జిల్లాపై దృష్టి సారించాలని పవన్‌ అభిమానులు కోరుకొంటున్నారు. మరోవైపు బీజేపీ, జనసేన పార్టీలు జత కలిసిన తర్వాత తొలిగా జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికలు కూడా ప్రతిష్ఠాత్మకంగా మారాయి. ఈ ఎన్నికలను 2024 ఎన్నికలకు రెఫరాండం అని.. వైసీపీ రెండేళ్ల పాలనకు రెఫరండం అని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. గెలుపు ఓటముల ప్రస్తావన కన్నా ఈ మిత్రపక్షాలు చీల్చుకునే ఓట్ల ఆధారంగానే రాష్ట్రంలో వాటి రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. 


ప్రజల మనసు గెలవడానికి... 

ఒకవిధంగా చెప్పాలంటే ప్రజల అభిమానాన్ని పొందడానికి ప్రతిపక్షాలకు ఇది మంచి సమయం. గత ఏడాది కాలంగా జిల్లా రైతులు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. ప్రకృతి వైపరిత్యాలకు తోడు దళారుల దోపిడీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జరిగింది. కరోనా కారణంగా కూలీల కొరతతో ఖరీఫ్‌ సేద్యం వ్యయం పెరిగింది. ప్రకృతి సహకరించని కారణంగా పంట దిగుబడి తగ్గింది. వచ్చిన దిగుబడిని దళారులు దోచుకున్నారు. తేమ పేరుతో రైతులను నిలువునా ముంచేశారు. అధికార పార్టీ కండువాలు కప్పుకున్న కొంతమంది దళారుల అవతారం ఎత్తి కోట్ల రూపాయల రైతు కష్టాన్ని కొల్లగొట్టారు. ఈ బాధలన్నీ భరించి అప్పులు చేసి రబీ సాగుకు సిద్ధమైన అన్నదాతలను నివర్‌ తుఫాన్‌ నిలువునా ముంచేసింది. అధికారుల ప్రాఽథమిక అంచనా ప్రకారం 35 వేల హెక్టార్లలో పంట దెబ్బతింది. ఈ విస్తీర్ణం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం అందజేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, ఏ పంటకు ఎంత ఇస్తారో తెలియదు. రైతులకు వరి హెక్టారు సాగుకు 30వేల వరకు ఖర్చు అయ్యింది. ఈ మేర నష్ట పరిహారం అందిస్తే తప్ప రైతు నిలబడలేడు. మరో 30వేల హెక్టార్లలో ఉద్యాన పంటలు పూర్తిగా నాశనం అయ్యాయి. ఏడాది పొడవునా తగులుతున్న వరుస గాయాలకు అన్నదాతలు అల్లాడిపోతున్నారు. ఈ సమయంలో వారికి ఓదార్పు మాత్రమే సరిపోదు. సరైన సమయంలో సరిపోయేంత సాయం అందాలి. ఆ సాయాన్ని అందించే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా జనసేన, బీజేపీ నేతల పర్యటనలు సాగితే ఈ పార్టీల పట్ల ప్రజల్లో నమ్మకం పెరుగుతుంది.   


పవన్‌ పర్యటన ఇలా..

శుక్రవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి నుంచి నాయుడుపేటకు చేరుకుంటారు. పంట నష్టంపై అక్కడ రైతులను పరామర్శించి, గూడూరు చేరుకుంటారు. వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలతో మాట్లాడతారు. ఆ తర్వాత నెల్లూరుకు చేరుకుని రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం హోటల్‌ మినర్వా గ్రాండ్‌లో పార్టీ ప్రధాన నాయకులతో సమావేశమవుతారు. మరుసటి రోజు ఉదయం పెన్నా వారధిని పరిశీలించి, రేణిగుంటకు బయలుదేరుతారు.

Updated Date - 2020-12-04T04:26:37+05:30 IST