Pawan Kalyan: తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటుడు కృష్ణంరాజు..

ABN , First Publish Date - 2022-09-11T17:22:06+05:30 IST

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటుడు కృష్ణంరాజు అని పవన్ అన్నారు.

Pawan Kalyan: తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటుడు కృష్ణంరాజు..

అమరావతి (Amaravathi): తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక పంథాను కలిగిన నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. కృష్ణంరాజు మృతి పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రౌద్ర, రస ప్రధానమైన పాత్రలను ఎంతగా మెప్పించేవారో కరుణ రసంతో కూడిన పాత్రల్లోనూ అలాగే ఒదిగిపోయేవారని కొనియాడారు. నటుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందారన్నారు. కృష్ణంరాజు తుదిశ్వాస విడిచారనే వార్త తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఇటీవలి కాలంలో ఆయన అస్వస్థతకు లోనయ్యారని తెలిసినప్పుడు కోలుకొంటారనే భావించానని అన్నారు. తమ కుటుంబంతో కృష్ణంరాజుకు స్నేహసంబంధాలు ఉన్నాయన్నారు. 


1978లో ‘మన వూరి పాండవులు’ చిత్రంలో కృష్ణంరాజుతో కలసి అన్నయ్య  చిరంజీవి నటించారని పవన్ తెలిపారు. మొగల్తూరు గ్రామవాసులు కావడంతో ఎంతో ఆప్యాయంగా ఉండేవారన్నారు. ‘భక్త కన్నప్ప’లో కృష్ణంరాజు అభినయం ప్రత్యేకమన్నారు. అందులో శివ భక్తిని చాటే సన్నివేశాలను రక్తి కట్టించారని, బొబ్బిలి బ్రహ్మన్న, అమరదీపం, తాండ్ర పాపారాయుడు, మహ్మద్ బిన్ తుగ్లక్, పల్నాటి పౌరుషం లాంటి చిత్రాలు ఆయన శైలి నటనను చూపాయన్నారు. ప్రజా జీవితంలోనూ ఆయన ఎంతో హుందాగా మెలిగారన్నారు.  ప్రజారాజ్యంలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ తరఫున బరిలో నిలిచారన్నారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా కృష్ణంరాజు అందించిన సేవలు మరువలేనివన్నారు. కృష్ణంరాజు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబానికి తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు.

Updated Date - 2022-09-11T17:22:06+05:30 IST