
అమరావతి (Amaravathi): మహిళా కూలీల సజీవ దహనం హృదయ విదారకమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆటోపై విద్యుత్ హై టెన్షన్ వైర్లు తెగిపడి అయిదుగురు మహిళా కూలీలు (Women laborers) సజీవ దహనం అయిన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. రెక్కల కష్టం మీద బతికే ఆ కూలీల కుటుంబాలలో హృదయ విదారకమైన విషాదం చోటు చేసుకుందన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు విద్యుత్ వైర్లు తెగిపడడం చూస్తూనే ఉంటామని, మరి వాతావరణం సాధారణంగా ఉన్న ఈ రోజున హై టెన్షన్ తీగ తెగిపడడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా? అనే విషయం ప్రభుత్వం ప్రజలకు చెప్పవలసి ఉందన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచడం మీద చూపించే శ్రద్ధను విద్యుత్ లైన్ల నిర్వహణపై కూడా చూపాలని ప్రభుత్వానికి సూచించారు. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంబాలు ఒరిగిపోయి ఉంటున్నాయని, అలాగే జనావాసాల మీదుగా ప్రమాదకరంగా విద్యుత్ తీగలు వేలాడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితమే ఈ రోజు నిండు ప్రాణాలు పోయాయన్నారు. తాడిమర్రి దగ్గర చోటుచేసుకున్న దుర్ఘటనపై నిపుణులతో విచారణ జరిపించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేస్తూ.. బాధిత కుటుంబాలకు తన తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
సత్యసాయి జిల్లాలో ఘోరప్రమాదం జరిగింది. ఆటోపై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. దీంతో కూలీలతో వెళ్తున్న ఆటో మంటల్లో కాలి బూడిదయ్యింది. ఈ ఘటనలో ఐదుగురు సజీవదహనం కాగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తాడిమర్రి మండలం చిల్లకొండయ్యపల్లిలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతి చెందినవారంతా మహిళలేగా పోలీసులు గుర్తించారు. మృతులు గుడ్డంపల్లి, పెద్దకోట్ల వాసులు కాంతమ్మ, రాములమ్మ, రత్తమ్మ, లక్ష్మీదేవి, కుమారిగా గుర్తించారు. అనంతరం మృతదేహాలను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది వ్యవసాయ కూలీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి