పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయాలతో పాటు.. సినిమాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఇక నటనకు దూరం అని చెప్పిన పవన్.. తిరిగి మళ్లీ నటించడానికి రెడీ అయ్యారు. వరసబెట్టి చిత్రాలను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఆయన చేస్తున్న 'వకీల్‌సాబ్' చిత్ర చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఈ చిత్రం తర్వాత క్రిష్ దర్శకత్వంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో, సాగర్ కె చంద్ర దర్శకత్వంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిత్రాలను చేసేందుకు పవన్ అంగీకరించారు. ఈ చిత్రాలకు సంబంధించిన వివరాలను మేకర్స్ అధికారికంగా కూడా ప్రకటించారు. ఇవే కాకుండా పవన్ ఇప్పుడు మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎప్పటి నుంచో పవన్‌ని డైరెక్ట్ చేయాలని చూస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల పవన్‌ని కలిసిన జానీ మాస్టర్ అద్భుతమైన కథని పవన్‌కి వినిపించాడని, పవన్ కూడా స్టోరీ బాగుంది.. చేద్దాం అని మాట ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అంతే కాదు.. ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించనున్నారట. పవన్‌కే కాకుండా కథను చరణ్ కూడా జానీ మాస్టర్ వినిపించాడని, ఈ చిత్రాన్ని నిర్మించేందుకు రామ్ చరణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. చరణ్‌తో జానీ మాస్టర్‌కి ఉన్న బాండింగ్ గురించి తెలియంది కాదు. అలాగే నాన్న చిరంజీవితోనే కాకుండా.. బాబాయ్ పవన్‌తో కూడా సినిమా చేస్తానని చరణ్ మెగాభిమానులకు మాట ఇచ్చి ఉన్నారు. ఆ మాటని ఇప్పుడు నిజం చేయబోతున్నారని అంటున్నారు. అన్నీ కుదిరితే.. అతి త్వరలోనే అధికారికంగా ఈ చిత్ర ప్రకటన రానుందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే.. చరణ్ లేదంటే జానీ మాస్టర్స్‌లో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. అప్పటి వరకు ఈ వార్త నెట్లో వైరల్ అవుతూనే ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే.