భవిష్యత్తులో TDP-Janasena పొత్తు కుదిరితే.. Pawan kalyan బరిలోకి దిగే నియోజకవర్గం ఇదేనా..!?

ABN , First Publish Date - 2022-01-08T17:19:17+05:30 IST

భవిష్యత్తులో TDP-Janasena పొత్తు కుదిరితే.. Pawan kalyan ఇక్కడ్నుంచే బరిలోకి దిగుతారా..?

భవిష్యత్తులో TDP-Janasena పొత్తు కుదిరితే.. Pawan kalyan బరిలోకి దిగే నియోజకవర్గం ఇదేనా..!?

వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ఆ రెండు నియోజకవర్గాలపై జనసేన పార్టీ గురి పెట్టిందా? అక్కడి ఇద్దరు వైసీపీ నేతలకు చుక్కలు చూపించి.. వారిని రాజకీయాల నుంచి ఇంటిదారి పట్టించాలని కంకణం కట్టుకుందా? అందుకే అక్కడ నేరుగా జనసేనాని పవన్‌కల్యాణ్‌ బరిలో దిగుతున్నారా? టీడీపీ కూడా తన వంతు సర్దుబాటుకు సిద్ధమైందా? కాకినాడ సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో చోటుచేసుకుంటోన్న ఆసక్తికర రాజకీయ పరిణామాలేమిటో అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం 


పవన్ పేరెత్తితే చాలు తిట్ల దండకం..!

కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ రూరల్‌లో మంత్రి కన్నబాబు... వీరిరువురు పవన్ కల్యాణ్‌ పేరెత్తితే చాలు తిట్ల దండకంతో పూనకం వచ్చినట్లు అయిపోతారు. ఎడాపెడా విమర్శలతో దాడి చేస్తారు. గడిచిన రెండున్నరే ళ్లుగా వీరిద్దరు పవన్‌కళ్యాణ్‌ను నిందించినంతగా వైసీపీలో మరో నేత లేరంటే అతిశయోక్తి కాదు. ఒకరకంగా జగన్ మెప్పు కోసం వీరిద్దరు పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిగత జీవితంపై ఎన్నో మాటలు తూలనాడారు. మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి తిట్ల దండకం నేరుగా పవన్‌ను తాకింది.


                        దీంతో పవన్‌ కూడా పలుసార్లు- "తేల్చుకుందాం.. సిద్ధంగా ఉండండి.." అన్న రేంజ్‌లో పలు బహిరంగ సభల్లో హెచ్చరిక సంకేతాలు ఇచ్చి హీట్ పెంచారు. ఇందులో భాగంగానే వచ్చే ఎన్నికల్లో కాకినాడ సిటీ, లేదా రూరల్‌లో స్వయంగా పవన్‌ కల్యాణ్‌ బరిలో నిలుస్తారట. ఎమ్మెల్యే ద్వారంపూడి, మంత్రి కన్నబాబును రాజకీయంగా అడ్రస్‌ లేకుండా చేసేలా పవన్‌.. ఈ రెండు నియోజకవర్గాల్లో ఒకచోట పోటీచేసి, వారికి చెక్‌ పెట్టేందుకు పావులు కదుపుతున్నారని జనసేన వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 


ఆ రెండు నియోజకవర్గాల్లో గెలుపు తథ్యమనే ధీమా..

గత ఎన్నికల్లో పవన్ విశాఖ, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాపు సామాజికవర్గం అధికంగా ఉన్న తూర్పుగోదావరి నుంచి పోటీ చేయకపోవడం తప్పిదమే అన్న భావన పార్టీలో ఉంది. అయితే ఆ ఓటమి తర్వాత ఇప్పుడు వ్యూహం మార్చిన పవన్... ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పుగోదావరి నుంచే కచ్చితంగా బరిలోకి దిగుతారని అంచనాలు నెలకొన్నాయి.


                                ఈ నేపథ్యంలో కాపు సామాజికవర్గం ఓట్లు అత్యధికంగా ఉన్న కాకినాడ సిటీ, కాకినాడ రూరల్ నియోజకవర్గాల్లో అయితే బాగుంటుందని పార్టీ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో అయితే గెలుపు తథ్యమనే ధీమా కూడా పార్టీలో ఉంది. ఇక్కడి నుంచి  పోటీ చేయడం ద్వారా పవన్‌ను అదేపనిగా రెచ్చగొడుతున్న వైసీపీ నేతలు కన్నబాబు, ద్వారంపూడికి చెక్ పెట్టవచ్చనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.


రగిలిపోతున్న జనసేన నేతలు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, మంత్రి కన్నబాబు అదే పనిగా పవన్‌ను తిట్ల దండకంతో విమర్శిస్తూ వస్తున్నారు. గతంలో పీఆర్పీలో పనిచేసి వైసీపీలో చేరిన కన్నబాబు.. చీటికి మాటికి పవన్‌ను తిట్టడంతోపాటు వ్యక్తిగతంగాను దూషిస్తుండటంపై పవన్‌తో సహా జనసేన నేతలు రగిలిపోతున్నారు. అనేకసార్లు పవన్‌ను ఉద్దేశించి కన్నబాబు డ్రామాలు ఆపు.. అన్నింటికీ పవన్ యాక్షనే చేస్తున్నారు అని ఆడిపోసుకున్నారు. మట్టి పిడతలో మజ్జిగన్నం తిన్న పవన్‌ను హాస్య నటుడు అని, ప్రతిదానికీ ఫోటోలా అని ఓసారి దుయ్యబట్టారు. ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్ ప్రతిదానికీ ఊగిపోతారనీ, అందుకే ఆయనకు అన్ని సీట్లు వచ్చాయనీ వ్యంగ్య బాణాలు విసిరారు. జగన్ అంటే పవన్‌కు జలసీ అని.. జగన్‌తో పవన్‌కు పోలికేమిటని? జగన్‌ను చూసి సంస్కారం నేర్చుకో అని కన్నబాబు విమర్శించారు. దీనికి కౌంటర్‌గా పవన్ సైతం అనేకసార్లు కన్నబాబును ఉద్దేశించి గతం మర్చిపోవద్దని.. రా చూసుకుందా అని ప్రతి హెచ్చరిక చేశారు.


ప్యాకేజీ స్టార్ అని, జైల్లో పెట్టాలని దుర్భాషలాడారు..

అటు కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి కూడా అనేకసార్లు పవన్ కల్యాణ్‌ను బండ బూతులు తిట్టారు. ప్యాకేజీ స్టార్ అని, జైల్లో పెట్టాలని దుర్భాషలాడారు. దీనికి నిరసనగా జనసైనికులు.. ఎమ్మెల్యే ద్వారంపూడి ఇంటిని ముట్టడించగా, వారిపై రాళ్ల దాడి జరిగింది. దీనిపై ఢిల్లీ నుంచి కాకినాడకు నేరుగా వచ్చి తేల్చుకుంటానని అప్పట్లో పవన్ సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో కాకినాడ సిటీలోనూ కాపు సామాజికవర్గ ఓట్లు అధికంగా ఉండటం, ఇక్కడ పోటీ చేస్తే ద్వారంపూడిపై రాజకీయ ప్రతీకారం తీర్చుకునేందుకు లెక్కలు సరిపోతాయనే విశ్లేషణలు జనసేన పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి.


భవిష్యత్తులో టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే... 

ఇక కాకినాడ రూరల్‌లో పోటీకి పవన్‌ నిర్ణయం తీసుకుంటే సహకరించడానికి టీడీపీ సిద్ధమనే సంకేతాలు రావడం కూడా జరుగుతోన్న పరిణామాలకు అద్దం పడుతోంది. కాకినాడ రూరల్‌లో టీడీపీకి నియోజకవర్గ ఇన్‌చార్జి లేరు. భర్తీ చేసే ఆలోచనను కూడా పార్టీ పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది. భవిష్యత్తులో టీడీపీ- జనసేన పొత్తు కుదిరితే... ఈ స్థానం జనసేనకు ఇచ్చేందుకు టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఒకవేళ ఇది కాకపోతే కాకినాడ సిటీ స్థానం కూడా వదులుకోవడానికి టీడీపీ అంతర్గతంగా సన్నాహాలు చేసుకుంటోందని వినికిడి. తద్వారా చంద్రబాబును సైతం అదే పనిగా దారుణంగా బూతులు ఆడుతోన్న కన్నబాబు, ద్వారంపూడిపై పవన్ రూపంలో ప్రతీకారం తీర్చుకోవచ్చనే ఆలోచన టీడీపీలో ఉన్నట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2022-01-08T17:19:17+05:30 IST