Pawan Kalyan Birthday: నిజమే.. కాగితపు పులి వంటి సినిమా హీరో కాదు పవన్.. మిగతావాళ్లకు పవర్ స్టార్‌కు ఇదే అసలు తేడా..!

ABN , First Publish Date - 2022-09-03T00:48:16+05:30 IST

నిజమే.. కాగితపు పులి వంటి సినిమా హీరో కాదు పవన్.. మిగతావాళ్లకు పవర్ స్టార్‌కు ఇదే అసలు తేడా..!

Pawan Kalyan Birthday: నిజమే.. కాగితపు పులి వంటి సినిమా హీరో కాదు పవన్.. మిగతావాళ్లకు పవర్ స్టార్‌కు ఇదే అసలు తేడా..!

"విజయదశమి మరుసటి రోజు సినీనటుడు పవన్ కళ్యాణ్(Pavan Kalyan) ఒక సామాజిక సేవాసంస్థ (కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్)ను స్థాపించి దానికి కోటి రూపాయల విరాళం ప్రకటించి వార్తలకెక్కారు. అయితే అదేరోజు ఆయన హృదయాంతరాళం నుంచి అలవోకగా జాలువారిన జీవిత అస్తిత్వవేదనను మీడియా అంతగా పట్టించుకోలేదు. తనదైన శైలిలో రివాల్వర్ చేబూని, ఆ నిర్జీవ ఆయుధాన్ని ఆయన ముద్దు పెట్టుకున్న దృశ్యాల మధ్య యువకథానాయకుడి అంతర్వేదన కనుమరుగైంది. 'ఇరవై ఏళ్ళుగా సినీ పరిశ్రమలో ఉన్నా, అద్దాల మేడల్లో ఉంటున్నా, లక్షల రూపాయల విలువచేసే కార్లలో తిరుగుతున్నా నిత్యం ఏదో వెలితిగానే ఉంది' అన్నారు పవన్ కళ్యాణ్.


అలాస్కాలో 20వ శతాబ్ది మొదట్లో బంగారం కోసం పరుగెత్తిన అమెరికన్ల 'గోల్డ్ రష్' లాంటి సంపద లాలసతో పరుగుపందెంలో జీవితాలు కోల్పోతున్న ఆధునిక తెలుగు ప్రజలు, ముఖ్యంగా హైదరాబాదీల ప్రతి ఒక్కరి జీవితానుభవానికి రూపం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ను మెచ్చుకోవాల్సివుంది."

- ఇది నవంబర్ 20, 2007- ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక(Andhrajyothy) ఎడిట్ పేజిలో ప్రచురించబడ్డ వ్యాసం ప్రారంభ వాక్యాలు. 


'నిజమే పవన్! ఏమిటీ వెలితి?' అనే శీర్షికతో ప్రచురితమైన ఈ వ్యాసం రచయిత- ప్రముఖ మానవహక్కుల ఉద్యమకారుడు, న్యాయవాది, రచయిత స్వర్గీయ భువనగిరి చంద్రశేఖర్(Bhuvanagiri Chandrashekar). ఒక సీరియస్ ఉద్యమకారుడు, వెండితెర మీద వేషాలేసుకునే ఒక పాపులర్ హీరో మాటలు అంతగా పట్టించుకోవడం ఏమిటని తెలుగు మేధావి వర్గం ఆశ్చర్యపోయింది. కానీ, పవన్ కళ్యాణ్ ఆ వ్యాసంతో ఎంతో ప్రభావితం కావడం, ఆ వ్యాస రచయితని స్వయంగా కలుసుకొని చర్చలు జరపడాన్ని బట్టి పవన్ కళ్యాణ్, మిగతా వారిలా కాగితపు పులి వంటి సినిమా హీరో కాదని అర్థం చేసుకుంది ఆ వర్గం. 


సినిమా రంగాలో హీరోలైనప్పటికీ, ఆ రంగాలకి వెలుపల సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో చాలామంది నటులు జీరోలుగానే ఉంటారు. సినిమాల ద్వారా వచ్చిన క్రేజ్ ను రాజకీయ రంగానికి పెట్టుబడిగా మార్చుకొని అందలాలు అందుకోవాలని ఆశించినవారికి కూడా సామాజిక చలనసూత్రాలు అర్థం కాక తెల్లమొహం వేస్తుంటారు. కానీ, పవన్ కళ్యాణ్ ది ఆ విషయంలో చాలా భిన్నమైన వ్యక్తిత్వం. విస్తృతమైన పుస్తక పఠనమే ఆయన విశిష్ట వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిందని అంటుంటారు. తన ప్రసంగాలలో, ట్విట్టర్ వేదికగా ఆయన తాను చదివిన పుస్తకాలను తలుచుకుంటుంటారు, తనని ప్రభావితం చేసిన కవుల్ని, కవితల్ని కోట్ చేస్తుంటారు. 


ఈ రోజు (సెప్టెంబర్ 2) సందర్భంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్న, కోట్ చేసిన, పంచుకున్న కవితలు, కవులు- కళాకారులు, పుస్తకాల గురించి తలుచుకుందాం.

ఈ ఆర్టికల్ ప్రారంభంలో చెప్పుకున్న భువనగిరి చంద్రశేఖర్ రచనతోనే మొదలెడదాం. చంద్రశేఖర్‌తో తన అనుబంధం చెబుతూ, ఆయన రచించిన "శాక్కో- వాంజెట్టీ" పుస్తకం గురించి ‘వకీల్ సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రస్తావించాడు పవన్ కళ్యాణ్. ఊచకోతకి గురైన చుండూరు దళితుల కోసం, మానవహక్కుల కోసం పోరాడిన చంద్రశేఖర్ అర్థాంతరంగా క్యాన్సర్ బారిన పడి 48 ఏళ్ల వయసుకే కన్నుమూయడం గురించి తన ప్రసంగంలో చెప్పిన పవన్, ఆయన "శాక్కో- వాంజెట్టీ" పుస్తకాన్ని శ్రద్ధగా చదివానని చెప్పాడు. ప్రముఖ మానవహక్కుల ఉద్యమకారుడు కె. బాలగోపాల్ పుస్తకాలను కూడా పవన్ ప్రస్తావించాడు. ‘వకీల్ సాబ్’ లో న్యాయవాది పాత్ర వేస్తున్న సందర్భంగా తొలినాళ్లలోనే తనని ప్రభావితం చేసిన నానీ ఫాల్కీవాలా రచన - 'We, the Nation: The Lost Decades' గురించి కూడా చెప్పుకొచ్చాడు.


‘జనసేన’(Janasena) ప్రారంభమైన తొలినాళ్లలో పవన్ తరచూ కోట్ చేసిన కవితాపంక్తులివి:

"చీకటి పడుతోంది

చిటారుకొమ్మలో నక్షత్రం చిక్కుకుంది

శిధిల సంధ్యాగగనం రుధిరాన్ని కక్కుతుంది

దారంతా గోతులు యిల్లేమో దూరం

చేతిలో దీపం లేదు, ధైర్యమే ఒక కవచం" - ప్రసిద్ధ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ కవిత - ‘నీడలు’లో పాదాలివి. 


తిలక్ సుప్రసిద్ధమైన కవితాసంపుటి 'అమృతం కురిసిన రాత్రి ' కవితాసంపుటిలోని ‘నీడలు’ కవితలోనివే మరి కొన్ని వాక్యాలు కూడా పవన్ కోట్ చేశారు: 

"చిన్నమ్మా

 వీళ్ళందరూ తోకలు తెగిన ఎలుకలు

 కలుగుల్లోంచి బయటికి రాలేరు

 లోపల్లోపలే తిరుగుతారు

 మౌఢ్యంవల్ల బలాఢ్యులు

 అవివేకంవల్ల అవినాశులు

 వీళ్ళందరూ మధ్యతరగతి ప్రజలు

 సంఘపు కట్టుబాట్లకి రక్షకభటులు

 శ్రీమంతుల స్వేచ్ఛావర్తనకి నైతిక భాష్యకారులు

 శిధిలాలయాలకు పూజారులు" - ఈ పాదాలలో చివర్న ‘శ్రీమంతులు’ బదులు, ప్రస్తుత రాజకీయవతావరణానికి నప్పేలా ‘రాజకీయనాయకులు’ అని మార్చి తన ట్వీట్‌లో షేర్ చేస్తూ, ప్రఖ్యాత ఇంగ్లీషు రచయిత Gilbert K Chesterton అభిప్రాయాలతో తిలక్ ఈ భావాలకు ఉన్న దగ్గరితనాన్ని గుర్తుచేశాడు పవన్.


గుంటూరు శేషేంద్రశర్మ గొప్ప కవి. ఆయనకి గుంటూరు ఏసీ కాలేజిలో ఎన్టీయార్ క్లాసుమేట్ అయితే, ఆయన కుమారుడు సాత్యకికి ఎన్టీయార్ కుమారుడు నందమూరి బాలకృష్ణ నిజాం కాలేజీలో క్లాసుమేట్. కానీ, శేషేంద్రశర్మ రచించిన 'ఆధునిక మహాభారతం' పునర్ముద్రణ గురించి పవన్ కళ్యాణ్ ను సాయం అడిగారు సాత్యకి. దానికి కారణం- పవన్ కి శేషేంద్ర శర్మ కవిత్వం అంటే ఉన్న ఆరాధన. 

పలుసందర్భాల్లో శేషేంద్ర – ‘ఆధునిక మహాభారతం’, ‘నేను – నా దేశం’ కావ్యాల నుంచి కవితల్ని కోట్ చేస్తుంటాడు పవన్. 

"నీ స్వేచ్ఛ కోసం ఎంత రక్తం పారిందో తెలుసుకో..

అది నీ శరీర క్షేత్రంలో ధైర్యం చల్లకపోతే..

అది నీ గుండెల్లో ఆత్మగౌరవం పండించకపోతే..

నువ్వు ఎప్పటికీ మోచేతి అంబలి తాగే బానిసలా బ్రతకాలనుకుంటే..

ఎంత ద్రోహిగా మారావో ఆ పవిత్ర రక్తానికి..

ఆ చిందించిన రక్తానికి.." అంటూ జగన్(Jagan) మీద విరుచుకుపడ్డాడు పవన్ ఓ సభలో. 



"రాహువు పట్టిన పట్టు ఒక సెకండు.. లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా..

మూర్ఖుడు గడియారంలో ముల్లు కదలనీయకపోతే కాలగమనం అంతటితో తలకిందులైపోతుందా?..

కుటిలాత్ముల కూటమికి క్షణకాలం జయమొస్తే విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా?..

ధనుజలోకమేకంగా దారికడ్డంగా నిల్చుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా?" - అంటూ ‘నేను – నా దేశం’ కవితాపంక్తుల్ని కోట్ చేశాడు పవన్. 


"పోట్లాట నేను బతకడానికి పీల్చే ఊపిరి! నా అవయవాలకు నీచంగా వంగే భంగిమలు తెలియవు. నేను సత్యాగ్రాహి! సత్యం నా గుండెల్లో బద్దలవుతున్న అగ్ని పర్వతం. నా గొంతులో గర్జిస్తున్న జలపాతం!"- అని మరో రాజకీయ వేదిక పైనుంచి శేషేంద్ర శర్మ ఆధునిక మహాభారతం కావ్యం కవిత్వాన్ని సందర్భోచితంగా వాడాడు పవన్. 


ఇంకా పవన్ తరచూ ట్వీటర్ వేదికగా ఈ పుస్తకాలను గురించి పంచుకున్నారు. 

విభూతిభూషణ్ బంద్యోపాధ్యాయ (Bibhutibhushan Bandyopadhyay) బెంగాలీ నవల ‘ఆరణ్యక’కు సూరంపూడి సీతారాం గారి అనువాదం 'వనవాసి' నవల. తన మనసుకు చేరువైన నవలగా పవన్ చెప్పుకున్నాడు పలుమార్లు.   ప్రకృతికి చేరువ కావడం ఎలాగో, అటు తర్వాత దాని సౌందర్యం ఎలా ఆస్వాదించాలో ఆ నవల నేర్పుతుందంటాడు. అలా నేర్చుకున్నందువల్ల మనిషి తోటి మనుషుల్ని ఎంతగా దగ్గరకు తీసుకోగలుగుతాడో కూడా ఆ పుస్తకం నేర్పుతుందంటాడు పవన్.



రాజకీయనిర్ణయాధికార ప్రక్రియలో ప్రజల పాత్ర గురించి గొప్పగా వివరించి తనకి ఒక మంచి ధృక్పథాన్ని కలిగించిన పుస్తకంగా డా. ఆర్. బాలసుబ్రమణియం ‘ ‘I, The Citizen’ ని పేర్కొన్నాడు పవన్ మరో చోట. 


'సేవ్ నల్లమల' పేరిట యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమానికి పిలుపిచ్చాడు పవన్ కళ్యాణ్. రాజకీయ పోరాటానికి సమాంతరంగా సామాజిక ఉద్యమాన్ని కూడా కోరుకుంటూ, పర్యావరణ పరిరక్షణపై వరుస ట్వీట్లు చేశాడు.  ప్రకృతితో మమేకమవ్వాలని పిలుపునిస్తూ, Peter Wohlleben రచించిన 'The Secret Network Of Nature' అనే పుస్తకాన్ని తన ట్విట్టర్ లో షేర్ చేశాడు. ప్రాకృతిక ప్రపంచపు తీరుతెన్నులు ఎంత సంక్లిష్టమైనవో, సున్నితమో ఈ పుస్తకం సమగ్రంగా వివరిస్తుందని చెప్తాడు. 


ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లోకి అనువదించబడిన రాసిన 'One Straw Revolution' ('గడ్డిపరకతో విప్లవం') పుస్తకం గురించి కూడా వివరంగా చెప్పుకొచ్చాడు పవన్ అదే పరంపరలో. జపాన్  కు చెందిన ప్రఖ్యాత ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా (Masanobu Fukuoka) తన జీవితమంతా ప్రకృతి వ్యవసాయానికే అంకితం చేశారని, ఆ అనుభవాలే 'గడ్డిపరకతో విప్లవం'  పుస్తకం అనీ పవన్ ప్రశంసించాడు.  


"శిష్టా ఆంజనేయ శాస్త్రి రాసిన 'ఖారవేలుడు' పుస్తకంతో నా రాజకీయ ఆలోచన విధానం మార్చుకున్నాను..." అని చెప్పుకున్నాడు మరో చోట:

"ఒక మనిషి తనకుతాను గొప్పవాడిననుకోవటం ఎంత తప్పో తాను తక్కువ వాడిననుకోవటం కూడా అంతే తప్పు. అది గర్వానికి,  యిది పిరికితనానికి దారితీస్తాయి.మానవ కల్పితాలయిన ఎక్కువ తక్కువలు మనం పరిహరించుకోవచ్చు. తక్కువవారు ఉన్నతి సాధించవచ్చు, ఎక్కువవారు పతనమూ కావచ్చు. అందుకనే ఈ ఎక్కువ తక్కువలు శాశ్వితంకావు."- అని ఆ రచనలోని వాక్యాల్ని కోట్ చేస్తాడు.


ఇంకా తరిమెల నాగిరెడ్డి రచించిన 'తాకట్టులో భారతదేశం' , నల్లజాతి స్వేచ్ఛ కోసం 27 ఏళ్లకు పైగా జైలు శిక్ష అనుభవించిన నెల్సన్ మండేలా (Nelson Mandela)  'లాంగ్ వాక్ టు ఫ్రీడమ్' (Long Walk to Freedom), మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (Martin Luther King Jr) పుస్తకాల ప్రభావం, చే గువేర ( Che Guevara)‘బొలీవియన్ డైరీ’ (The Bolivian Diary), రస్కిన్ బాండ్ కథలు, పరమహంస యోగానంద ‘ఒక యోగి ఆత్మకథ’(Autobiography of a Yogi), ఖలీల్ జిబ్రాన్ (Kahlil Gibran) ‘ప్రొఫెట్’ (The Prophet), రమణ మహర్షి తత్వబోధ తనని విశేషంగా ప్రభావితం చేశాయని చెప్పుకుంటాడు పవన్ కళ్యాణ్.


బహుశా అందుకే కవి శేషేంద్ర ధిక్కారాన్ని తనదిగా చేసుకొని ఇలా నినదించగలుగుతున్నాడు:

"సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఎవడికీ వంగి సలాం చెయ్యదు. నేనింతా ఒక పిడెకెడు మట్టే కావచ్చు. కానీ గొంతెత్తితే నాకు ఒక దేశపు జెండాకున్నంత పొగరుంది."

                                                              * *

Updated Date - 2022-09-03T00:48:16+05:30 IST