
రాజమండ్రి : రాజమహేంద్రి ఎయిర్‌పోర్టు నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ బయల్దేరారు. కాసేపట్లో హుకుంపేట బాలాజీపేట రోడ్డుకు శ్రమదానం చేయనున్నారు. శ్రమదానం తర్వాత ఆయన బహిరంగ సభలో పాల్గొననున్నారు. సభా ప్రాంగణానికి చేరుకునే దారులన్నింటినీ పోలీసులు మూసివేశారు. సభా ప్రాంగణానికి ఇరువైపులా 5 కి.మీ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. పవన్ పర్యటనకు సంబంధించిన లైవ్ కోసం క్లిక్ చేయండి..

పవన్ సవాల్..
ఆంక్షల పేరుతో జనసేన కార్యకర్తలనే కాదు.. పవన్‌ను కూడా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నం చేశారు. కేవలం పవన్ కాన్వాయ్‌లోని రెండు వాహనాలకు మాత్రమే పోలీసులు అనుమతిచ్చారు. అయితే ఖాకీల తీరుపై సేనాని కన్నెర్రజేశారు. ఎలా అడ్డుకుంటారో చూస్తానంటూ రాజమండ్రి సెంట్రల్లో పోలీసులకు పవన్ సవాల్ విసిరారు. ఆయన సవాల్ చేస్తున్నప్పుడు తీవ్ర ఆగ్రహంతో చేతులు ఊపుతుంటే అభిమానులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. పార్టీ జెండాలు ఊపుతూ కార్యకర్తలు.. బైకులపై భారీ ర్యాలీగా తరలివచ్చారు.
ఏం జరుగుతుందో..!
ఇదిలా ఉంటే.. పోలీసుల ఆంక్షలను అధిగమించి ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున శ్రమదాన కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు సభా వేదిక ప్రాంతానికి భారీగా జన సైనికులు, పవన్ వీరాభిమానులు చేరుకుంటున్నారు. తుప్పలు, కాలువలు, నడక మార్గాల్లో కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఓ వైపు వందల్లో పోలీసులు మోహరించినా అభిమానులు మాత్రం అవేమీ లెక్కచేయకుండా తెగించి సభకు వచ్చేస్తున్నారు. వీరిని కట్టడి చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క సభ విజయవంతం కాకుండా చేయాలంటూ వైసీపీ మంత్రులు కొందరు పోలీసులపై అదేపనిగా ఒత్తిళ్లు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.