పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ అసలేం మాట్లాడుకుంటారు?

Sep 18 2021 @ 13:34PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ జీనియస్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసినప్పుడు.. ఆ ఇద్దరూ ఏం మాట్లాడుకుంటారు అనే సందేహం ఎవరికైనా కలగక మానదు. సాధారణంగా అలాంటి ఓ ఇద్దరు లెజెండ్స్ కలిసినప్పుడు సినిమాల గురించో లేక రాజకీయాల గురించో ప్రధానంగా చర్చించుకుంటారు అనుకుంటారు చాలా మంది. అయితే పవన్, త్రివిక్రమ్ ఆ రెండింటి మీదా కాకుండా..  సాహిత్యం మీదే ఎక్కువగా ముచ్చటించుకుంటారని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇప్పుడా ప్రస్థావన ఎందుకొచ్చిందంటే..  శుక్రవారం సాయంత్రం భీమ్లా నాయక్ సెట్లో ..  పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ మహాకవి శ్రీశ్రీ రచనా వైశిష్ట్యం గురించి, ఆయన తన రచనల్లో  పదాల్ని ఎలా పరుగులు పెట్టించి పాఠకుల్ని చైతన్య పరుస్తారు అనే విషయం గురించి .. ముఖ్యంగా యువరక్తాన్ని వేడెక్కించిన మహా ప్రస్థానం .. మహా కావ్యం గురించి చాలా ప్రత్యేకంగా చర్చించుకున్నారు. ఆ సందర్భంగా శ్రీశ్రీ చేతిరాతతో ఉన్న ‘మహా ప్రస్థానం’ ప్రత్యేక స్మరణికను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. దర్శకుడు త్రివిక్రమ్ కు జ్ఞాపికగా అందచేశారు. 


ఈ సందర్భంగా మహా ప్రస్థానం పుస్తకం ముద్రణ గురించి, అందులో అరుదైన చిత్రాల గురించి ప్రత్యేకంగా ముచ్చటించుకున్నారు.  అందులో భాగంగా.. శ్రీశ్రీ గురించి మీ శైలిలో రెండు మాటలు చెప్పండని పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ను కోరారు. దానికి త్రివిక్రమ్ స్పందిస్తూ.. ‘కవి తాలూకు ప్రయాణం అంటే.. ఒక జాతి తాలుకు ప్రయాణం. ఆయన వేసిన ఒక అడుగు...రాసిన ఒక పుస్తకం.. ఒక శతాబ్దం మొత్తం మాట్లాడుకుంటుంది. చాలా శతాబ్దాల పాటు మాట్లాడుకుంటునే ఉంటుంది. ఆయన తాలూకు జ్ఞాపకం మనజాతి పాడుకొనే ఒక గీతం.. శ్రీశ్రీ తెలుగువారు గర్వించతగ్గ కవి. ఈ శతాబ్దం నాది అని గర్వంగా చాటినవాడు. తెలంగాణ విమోచన దినోత్సవం రోజున ఆయన పుస్తకం చూడడం నిజంగా గొప్ప విషయం. ఆయన ఆత్మ ఎక్కుడున్నా స్వాతంత్ర్యం అనే సరికి అక్కడికి వచ్చి ఆగుతుంది’ అన్నారు. దీనికి పవన్ కళ్యాణ్ ... ‘ఒక కవి గురించి మరో కవి మాట్లాడితే వచ్చే సొబగు ఇది’ అన్నారు. దానికి త్రివిక్రమ్  స్పందిస్తూ..  ‘శ్రీశ్రీ అంటే ఓ సమున్నత శిఖరం. మనమందరం ఆ శిఖరం దగ్గర గుళకరాళ్లు’ అన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.