రూ.3,145 కోట్ల బకాయిలు ఇవ్వండి

ABN , First Publish Date - 2022-01-25T06:54:03+05:30 IST

కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వివిధ పద్దుల కింద

రూ.3,145 కోట్ల బకాయిలు ఇవ్వండి

  • వెనుకబడిన ప్రాంతాల నిధులు రూ.900 కోట్లు
  • ఆర్థిక సంఘం నిధులు రూ.817 కోట్లూ రావాలి
  • కేంద్ర మంత్రి నిర్మలకు మంత్రి హరీశ్‌రావు లేఖ

  

హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు వివిధ పద్దుల కింద రావాల్సిన నిధుల బకాయిలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సోమవారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. వివిధ పద్దుల కింద రాష్ట్రానికి రూ.3,145.81 కోట్లు రావాల్సి ఉందని, వీటిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ నిధుల విషయమై గతంలోనూ పలుమార్లు విజ్ఞప్తులు చేశామని గుర్తు చేశారు.


ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్‌ 94(2) ప్రకారం.. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాల్సి ఉందని తెలిపారు. దీని కింద రెండు సంవత్సరాలకు సంబంధించి రూ.900 కోట్ల బకాయిలు ఉన్నాయని వివరించారు. 2019-20కి సంబంధించి రూ.450 కోట్లు, 2020-21కి సంబంధించి రూ.450 కోట్లు.. మొత్తం రూ.900 కోట్లను వెంటనే విడుదల చేయాలని కోరారు. దీంతో పాటు ఈ గ్రాంట్‌ను 2021-22 తర్వాత మరో ఐదేళ్లకు పొడిగించాలని కోరారు. నీతి ఆయోగ్‌ సిఫారసు చేసిన రూ.24,205 కోట్లను కూడా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.


రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ.817.61 కోట్లు ఇవ్వాలంటూ 14వ ఆర్థిక సంఘం సిఫారసు చేయగా.. కేంద్రం ఎందుకు తిరస్కరించిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని షరతులను పూర్తి చేసిందని, నిర్దిష్ట కారణం లేకుండా ఈ గ్రాంటును తిరస్కరించారని ఆరోపించారు. ఇప్పటికైనా వీలైనంత త్వరగా నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2020-21లో రాష్ట్రానికి పన్నుల్లో వాటా తగ్గుతుందని, ఈ దృష్ట్యా తెలంగాణకు రూ.723 కోట్ల ప్రత్యేక గ్రాంటును విడుదల చేయాలంటూ 15వ ఆర్థిక సంఘం సూచించిందని వివరించారు. ఇలాంటి ఆర్థిక సంఘం సిఫారసులను గతంలో ఎప్పుడూ తిర


స్కరించిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. ఈ నిధులను కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి రాష్ట్రం ఏర్పడిన మొదటి సంవత్సరం(2014-15)లో కేంద్రం వాటాను తెలంగాణకు కాకుండా పొరపాటున ఆంధ్రప్రదేశ్‌కు విడుదల చేశారని తెలిపారు. దీంతో తెలంగాణకు రావాల్సిన రూ.495.20 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయన్నారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పాటు అకౌంటెంట్‌ జనరల్‌ దృష్టికి తీసుకువెళ్లామని, కానీ ఇప్పటి వరకు ఆ నిధులను రాష్ట్రానికి సర్దుబాటు చేయలేదని వివరించారు. ఈ నిధులను వెంటనే విడుదల చేయాలన్నారు. వీటితోపాటు పెండింగ్‌లో ఉన్న ఐజీఎస్టీ నిధులు రూ.210 కోట్లను విడుదల చేయాలని హరీశ్‌ డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-01-25T06:54:03+05:30 IST