Pay flag fee : విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.20 ఫీజు.. తిరంగా జెండా విక్రేతలకు కూడా..

ABN , First Publish Date - 2022-07-25T19:04:42+05:30 IST

దేశానికి 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట దేశంలో ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది.

Pay flag fee : విద్యార్థులు, ఉపాధ్యాయులకు రూ.20 ఫీజు.. తిరంగా జెండా విక్రేతలకు కూడా..

జమ్మూ : దేశానికి 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ పేరిట దేశంలో ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకాన్ని(National Flag) ఆవిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం(Central Govt) సంకల్పించింది. కానీ ఈ స్ఫూర్తికి విఘాతం కలిగించేలా జమ్మూకాశ్మీర్‌(Jammu Kashmir)లోని అనంత్‌నాగ్(Anathnag) జిల్లా అధికారులు వ్యవహరించారు. స్కూల్ విద్యార్థులు, స్టాఫ్ నుంచి రూ.20 డిపాజిట్ ఫీజు(Deposit Fee) వసూలు చేయాలంటూ అనంత్‌నాగ్ చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్(సీఈవో) శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఫీజు చెల్లించకపోతే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సర్క్యూలర్‌లో హెచ్చరించారు. ఇక జాతీయ జెండా విక్రయించే దుకాణదారులు కూడా రూ.20 ‘డిపాజిట్ ఫీజు’ చెల్లించాలంటూ ప్రకటించారు. లౌడ్-స్పీకర్లు పెట్టి మరీ ప్రచారం చేశారు. ఈ ఆదేశాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవడంతో ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని పూర్తి స్వచ్ఛంధంగా నిర్వహించామని పేర్కొన్నారు.


ఈ వ్యవహారంపై అనంత్‌నాగ్ డిప్యూటీ కమిషనర్ డా.పీయూష్ సింగ్లా ఆదివారం స్పందించారు. తన అనుమతి లేకుండానే ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఈ సర్క్యూలర్ జారీ చేసిన అధికారిని సస్పెండ్ చేశామని వివరించారు. కాగా దుకాణదారుల కోసం శనివారం లౌడ్ స్పీకర్ ప్రచారం ప్రకారం.. అనంత్‌నాగ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల ప్రకారం ప్రతీ దుకాణదారుడు రూ.20 ఫీజును ఆఫీస్‌లో డిపాజిట్ చేయాలని, అప్పుడే జెండాలు విక్రయించేందుకు లైసెన్స్ లభిస్తుందని పేర్కొన్నారు. లేదంటే చర్యలను ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.


బుద్గాం జిల్లాలోనూ ఇంతే..

బుద్గాం జిల్లాలోనూ ఇదే తరహా ఆదేశాలు వెలువడ్డడాయి. విద్యార్థులు, స్టాఫ్ నుంచి రూ.20 ఫీజు వసూలు చేయాలని పేర్కొంటూ బుద్గాం జిల్లా చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సర్క్యూలర్ జారీ చేశారు. విద్యార్థులు, స్టాఫ్ నుంచి ఫీజు  వసూలు చేయాలని కోరుతూ విద్యాసంస్థల అధిపతులకు ఆదేశాలు అందాయి. నాలుగు రోజుల్లో ఫీజు వసూలు చేయాలని పేర్కొన్నారు. ఒక కుటుంబంలో ఒకరి కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఒక్కరి వద్ద నుంచే ఫీజు వసూలు పేర్కొన్నారు. గతవారం జారీ అయిన ఈ ఆదేశాలపై ఉన్నతాధికారులెవరూ స్పందించలేదని సమాచారం. ఈ పరిణామాలపై జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు. దేశభక్తి సహజసిద్ధంగా ఉంటుందని, బలవంతంగా రుద్దకూడదని వ్యాఖ్యానించారు. మరోవైపు బిబ్జెహర పట్టంలో కూడా ఇదే తరహా ప్రకటన చేశారు. అయితే దుకాణదారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటామనే అంశాలను మాత్రం చెప్పలేదు.

Updated Date - 2022-07-25T19:04:42+05:30 IST