ఇంటి పన్ను చెల్లించండి.. బహుమతి పొందండి

ABN , First Publish Date - 2021-12-08T06:44:43+05:30 IST

గ్రామాల్లో ఇంటి పన్నులు వందశాతం వసూలు చేయాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై అధికారుల ఒత్తిళ్లు పెరుగుతున్నాయి.

ఇంటి పన్ను చెల్లించండి.. బహుమతి పొందండి
గ్రామంలో అంబేడ్కర్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్లెక్సీ

మోత్కూరు, డిసెంబరు 7: గ్రామాల్లో ఇంటి పన్నులు వందశాతం వసూలు చేయాలని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై అధికారుల ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. పన్నువసూళ్లకు ఎంత ప్రయత్నించినా ప్రతీ ఏడాది 70నుంచి 80శాతం మాత్రమే వసూలవుతున్నాయి. ఈ ఏడాది వంద శాతం వసూలు చేయాలన్న లక్ష్యంతో మోత్కూరు మండలం దత్తప్పగూడెం సర్పంచ్‌ ఎలుగు శోభసోమయ్య వినూత్నంగా ఆలోచించారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.2.76లక్షలు వసూలు కావల్సిఉండగా, ఇప్పటివరకు రూ.70వేలు మాత్రమే వసూలయ్యాయి. దీనికితోడు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రూ.33వేలు బకాయిలు ఉన్నాయి. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నులు 2022 జనవరి 25లోగా చెల్లించిన వారిలో ముగ్గురిని లక్కీడిప్‌ ద్వారా ఎంపికచేసి మూడు బహుమతులు ఇస్తామని ప్రకటించారు. గ్రామపంచాయతీ నుంచి బహుమతులు ఇచ్చే అవకాశం లేకపోయినప్పటికీ సర్పంచ్‌ ప్రథమ బహుమతిగా రూ.5వేల విలువైన ఎయిర్‌కూలర్‌, ద్వితీయ బహుమతిగా రూ. 3వేల విలువైన స్టాండ్‌ఫ్యాన్‌, తృతీయ బహుమతిగా రూ.2వేల విలువైన రైస్‌కుక్కర్‌ తన సొంత ఖర్చులతో ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి 2022 జనవరి 25వ తేదీలోపు ఇంటి పన్ను చెల్లించిన వారి జాబితాను తయారుచేసి, గణతంత్ర దినోత్సవం (జనవరి 26న) రోజున డ్రా తీసి (లక్కీ డిప్‌ ద్వారా) విజేతలను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తామని సర్పంచ్‌ తెలిపారు. ఈ మేరకు ప్లెక్సీలు ముద్రించి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద, మరో నాలుగు చోట్ల కూడలి ప్రాంతాల్లో మంగళవారం ఏర్పాటు చేయించారు. ప్లెక్సీలు ఏర్పాటు చేయించిన తొలిరోజే రూ.3వేల ఇంటి పన్ను వసూలైందని సర్పంచ్‌ ఎలుగు శోభసోమయ్య తెలిపారు. గ్రామంలో ఒక్కో ఇంటికి పన్ను రూ.100 నుంచి రూ.200 ఉంటుందని, చెల్లిస్తే బాకీ తీరుతుందని, అదృష్టం బాగుంటే  బహుమతి వస్తుందనే ఆలోచనతో ప్రజలు ఇంటి పన్నులు చెల్లిస్తారని సర్పంచ్‌ అన్నీరు. ఈ ఏడాది వంద శాతం ఇంటి పన్ను వసూలవుతుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. దత్తప్పగూడెం సర్పంచ్‌ ఆలోచన ఫలిస్తే మండలంలోని మిగతా సర్పంచ్‌లు కూడా ఇంటి పన్నులు చెల్లించిన గ్రామస్థులకు బహుమతులు ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Updated Date - 2021-12-08T06:44:43+05:30 IST