Paytm: పేటీఎంలో రూ. 100 పంపి.. తెలియకుండానే రూ. 4 కోట్ల దోపిడినీ బయటపెట్టేసుకున్న దుండగుడు!

ABN , First Publish Date - 2022-09-02T00:30:12+05:30 IST

చేసిన తప్పులను ఎంత జాగ్రత్తగా కప్పి పుచ్చుకున్నా ఒక్కోసారి అవి బయటపడిపోతూ ఉంటాయి. నోరు జారడం

Paytm: పేటీఎంలో రూ. 100 పంపి.. తెలియకుండానే రూ. 4 కోట్ల దోపిడినీ బయటపెట్టేసుకున్న దుండగుడు!

న్యూఢిల్లీ: చేసిన తప్పులను ఎంత జాగ్రత్తగా కప్పి పుచ్చుకున్నా ఒక్కోసారి అవి బయటపడిపోతూ ఉంటాయి. నోరు జారడం వల్లో, ప్రవర్తనలో తేడా వల్లనో, మరొకరి ద్వారానో.. ఇలా ఏదో ఒక రూపంలో అవి వెలుగులోకి వచ్చేస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి కొదవేలేదు. ఇటీవల జరిగిన 4 కోట్ల రూపాయల భారీ దోపిడీ (heist) ఒకటి రూ. 100 పేటీఎం (Paytm) ట్రాన్సాక్షన్‌తో బయటపడిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. 


ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సెంట్రల్ ఢిల్లీలోని పహర్‌గంజ్ (Paharganj) ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున నలుగురు వ్యక్తులు పోలీసుల్లా నటిస్తూ తమ సహచరుడితో కలిసి ఇద్దరు కొరియర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లను దోచుకున్నారు. వారి కళ్లలో కారం కొట్టిన నిందితులు వారి వద్దనున్న రూ. 4 కోట్ల విలువైన బంగారు నగలున్న బ్యాగులను దోచుకుని పరారయ్యారు. తెల్లవారుజామున 4-5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. 


బంగారు నగలు, కళాఖండాలు వంటి విలువైన వస్తువులను  డెలివరీ చేసే కొరియర్ కంపెనీ (courier company)లో బాధితులు పనిచేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో బాధితులు ఇద్దరూ చండీగఢ్, లుధియానాకు పంపాల్సిన కన్సైన్‌మెంట్స్‌తో కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. వారు తమ వాహనాల వద్దకు నడుస్తుండగా నిందితులు నలుగురు వారిని అడ్డగించి వారి వద్దనున్న సరుకు దోచుకుని పరారయ్యారు. 


బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కొరియర్ కంపెనీ బయట ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను శోధించారు. దోపిడికీ ముందు 15 రోజులు వారు రెక్కీ నిర్వహించినట్టు గుర్తించారు. నిందితుల్లో ఒకడు బయట ఓ టీస్టాల్ వద్ద నిల్చుని టీ తాగుతున్నట్టు ఓ వీడియో రికార్డైంది. కొన్ని క్షణాల తర్వాత ఓ ప్రైవేటు క్యాబ్ డ్రైవర్‌ను ఆపాడు. ఇద్దరి మధ్య కొంత చర్చ జరిగిన తర్వాత అతడి నుంచి రూ. 100 తీసుకున్నాడు. క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడుతూ నిందితుడు మొబైల్ ఫోన్ వినియోగిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో టీ స్టాల్ యజమానిని పోలీసులు ప్రశ్నించారు. అతడు తన వద్ద టీ తాగాడని, అయితే అతడి దగ్గర నగదు లేకపోవడంతో క్యాబ్ డ్రైవర్‌ను ఆపి అతడికి డిజిటల్‌ పద్ధతిలో వంద రూపాయలు పంపాడని, దీంతో క్యాబ్ డ్రైవర్ అతడికి రూ. 100 ఇచ్చాడని, అప్పుడతడు తన టీ డబ్బుల చెల్లించాడని టీస్టాల్ యజమాని వివరించాడు. 


అతడిచ్చిన సమాచారంతో క్యాబ్ డ్రైవర్ వివరాలను పోలీసులు సేకరించారు. అతడిని విచారించగా నిందితుడు తనకు రూ. 100 పేటీఎం చేశాడని వివరించాడు. దీంతో పోలీసులు వెంటనే పేటీఎం హెడ్‌క్వార్టర్స్‌కు వెళ్లి ట్రాన్సాక్షన్ వివరాలు చెప్పి నిందితుడి ఫోన్ నంబరు సేకరించారు. దాని ద్వారా అతడు నజఫ్‌గఢ్‌కు చెందిన వాడని గుర్తించారు. వెంటనే ఓ పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు నజఫ్‌గఢ్‌కు పంపించారు. అయితే, పోలీసులు అక్కడికి వెళ్లడానికి ముందే నిందితుడు ఇతర నిందితులతో కలిసి పరారయ్యాడు. పోలీసులు వారిపై సాంకేతిక నిఘా పెట్టి మిగతా నిందితుల ఫోన్ నంబర్లు సేకరించారు. వాటి ఆధారంగా వారిని ట్రాక్ చేశారు. చివరికి జైపూర్‌లోని ఓ ఫ్లాట్‌లో దాక్కున్న నిందితులను పట్టుకున్న పోలీసులు వారికి బేడీలు వేసి కటకటాల వెనక్కి పంపారు.

Updated Date - 2022-09-02T00:30:12+05:30 IST