Payyavula Keshav: వైసీపీ ప్రభుత్వమే డేటా చౌర్యం చేస్తోంది...

ABN , First Publish Date - 2022-09-20T19:57:30+05:30 IST

డేటా చౌర్యం జరిగిందని ప్రభుత్వం చెబుతోందని, ఏం డేటా పోయిందో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని పయ్యావుల అన్నారు.

Payyavula Keshav: వైసీపీ ప్రభుత్వమే డేటా చౌర్యం చేస్తోంది...

అమరావతి (Amaravathi): డేటా చౌర్యం జరిగిందని ప్రభుత్వం చెబుతోందని, ఏం డేటా పోయిందో చెప్పే ధైర్యం ప్రభుత్వానికి లేదని టీడీపీ నేత  పయ్యావుల కేశవ్‌ (Payyavula Keshav) అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కమిటీ నివేదికలో పెగాసెస్ (Pegasus) జరిగిందా? లేదా? అనేదే లేదన్నారు. పెగాసెస్ వాడినట్లు అనుమానం ఉందని నివేదికలో చెప్పలేకపోయారన్నారు. ప్రభుత్వం కొండను తవ్వి చీమను కూడా పట్టలేకపోయిందని ఎద్దేవా చేశారు. లేనిది ఉన్నట్లుగా చెప్పాలని కమిటీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రయత్నించారని విమర్శించారు. టీడీపీ చెప్తే ఈసీ ఓట్లు తొలగిస్తుందా? అని పయ్యావుల ప్రశ్నించారు.


వైసీపీ సర్కార్‌ (YCP Govt.) మాటలతోనే కాలం గడుపుతోందని పయ్యావుల కేశవ్ విమర్శించారు. ఇంటింటికీ వాలంటీర్లను పంపి ఆధార్‌కార్డులు తీసుకుంటూ.. వైసీపీ ప్రభుత్వమే డేటా చౌర్యం చేస్తోందని పయ్యావుల కేశవ్‌ ఆరోపించారు. వైసీపీ సర్కార్‌ వచ్చిన తర్వాత జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని, దమ్ముంటే ఈ కేసు విచారణ కూడా సుప్రీంకోర్టుకు ఇవ్వాలని పయ్యావుల కేశవ్‌ సవాల్ చేశారు.

Updated Date - 2022-09-20T19:57:30+05:30 IST