మోదీ గోబ్యాక్ అంటూ పోలీసు స్టేషన్లో పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తదితరుల నిరసన దృశ్యం
పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్
రాజమహేంద్రవరంలో నిరసన.. అరెస్టు
రాజమహేంద్రవరం సిటీ, జూలై 4 : ప్రధాని మోదీ పర్యటనను నిరశిస్తూ చలో భీమవరం నిరసనకు పిలుపునిచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులను రాజమహేంద్రవరంలో పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాజమహేంద్రవరంలో పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ నేతృత్వంలో ఆ పార్టీ నగర అధ్యక్షుడు బాలేపల్లి మురళీధరావు, అసంఘటిత కార్మిక సంఘం చైర్మన్ ఎన్వీ శ్రీనివాస్, గోలి రవి, జిల్లా అధ్యక్షుడు మార్టిన్ లూఽథర్లు కంబాలచెరువు గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులను త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. అనంతరం సాకే శైలజానాథ్ విలేకరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పర్యటించే అర్హత, అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని తాకే అర్హత మోదీకి లేదన్నారు. ఆంధ్ర ప్రజలను మోదీ నమ్మించి మోసం చేశారని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్, విశాఖ ఉక్కు ప్రవేటీకరణ, విభజన చట్టంలో హామీలను కేంద్ర ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు. జగన్ కూడా కేసుల విషయంలో భయపడి మోదీ కాళ్ల వంకే చూస్తుంటారుగాని రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోరన్నారు. మోదీ తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండు చేశారు.