సెటిల్‌మెంట్లకు పాల్పడితే పీడీ యాక్టు

ABN , First Publish Date - 2021-06-17T05:46:45+05:30 IST

రౌడీషీటర్లుగా నమోదు అయిన వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తే సహించేది లేదని, వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ హెచ్చరించారు.

సెటిల్‌మెంట్లకు పాల్పడితే పీడీ యాక్టు
రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్న ఏసీపీ ఉమేందర్‌

- గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌

కోల్‌సిటీ, జూన్‌ 16: రౌడీషీటర్లుగా నమోదు అయిన వారు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, భూకబ్జాలు, సెటిల్‌మెంట్లు చేస్తే సహించేది లేదని, వారిపై పీడీ యాక్టు నమోదు చేస్తామని గోదావరిఖని ఏసీపీ ఉమేందర్‌ హెచ్చరించారు. బుధవారం గోదావరిఖని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో వన్‌టౌన్‌, రామగుండం, ఎన్‌టీపీసీ పోలీస్‌స్టేషన్ల పరిధిలోని నమోదు అయిన రౌడీషీటర్లకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు. రౌడీషీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, వారు వివాదాల్లో తలదూర్చడం, మహిళలను వేధించడం, ఇతర నేరాలకు పాల్పడితే సహించేది లేదన్నారు. రౌడీషీటర్లకు నెలకు రెండుసార్లు కౌన్సిలింగ్‌ నిర్వహిస్తామని, చెడు ప్రవర్తన కలిగిన వారిని బైండోవర్‌ చేస్తామన్నారు. చెడు వ్యసనాలకు అలవాటు పడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని, ప్రవర్తనను మార్చుకుని ప్రశాంత జీవనం సాగించాలన్నారు. అల్లర్లు లేకుండా ప్రశాంత జీవనం గడిపే వారి గురించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రౌడీషీట్‌ తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారు. గోదావరిఖనిలో 25మంది, రామగుండం పరిధిలో 9మంది రౌడీషీటర్ల జీవన విధానం, చిరునామాల గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో గోదావరిఖని వన్‌టౌన్‌ సీఐ రమేష్‌బాబు, రామగుండం సీఐ లక్ష్మీనారాయణ, ఎన్‌టీపీసీ ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-06-17T05:46:45+05:30 IST