పాత ట్రాక్టర్‌ షెడ్డులో.. పేదల బియ్యం!

ABN , First Publish Date - 2022-08-08T05:36:41+05:30 IST

ఏళ్ల తరబడి రహస్యంగా పేదల బియ్యాన్ని అక్రమంగా గోడౌన్‌లో నిల్వ ఉంచిన గుట్టు ఆదివారం రట్టు అయింది.

పాత ట్రాక్టర్‌ షెడ్డులో..  పేదల బియ్యం!
పాత ట్రాక్టర్‌ షెడ్‌లో గుర్తించిన పీడీఎస్‌ బియ్యం

264 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత 

  నిడమానూరు పొలిమేరలో రహస్య స్థావరం 

  కంకిపాడు, పెనమలూరు, విజయవాడ రూరల్‌ మండలాల నుంచి దిగుమతి 

  ఇంటింటి కొనుగోలుదారుల నుంచి గోడౌన్‌కు తరలింపు 

ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఏళ్ల తరబడి రహస్యంగా పేదల బియ్యాన్ని అక్రమంగా గోడౌన్‌లో నిల్వ ఉంచిన గుట్టు ఆదివారం రట్టు అయింది. ఎన్టీఆర్‌ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారిణి కోమలి పద్మ మాటు వేసి అక్రమాన్ని వెలికితీశారు. 264 క్వింటాళ్ల పేదల బియ్యం పట్టుకున్నారు. పాత ట్రాక్టర్‌ షెడ్‌లో పేదల బియ్యాన్ని నిల్వచేస్తున్న మాజిద్‌ ముల్కీ మహ్మద్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పీడీఎస్‌  బియ్యాన్ని అక్రమంగా వ్యాపారం చేస్తున్న మాజిద్‌ ముల్కీని విచారించగా.. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల పరిధిలోని పలు మండలాల నుంచి ఇంటింటి దగ్గర కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసే వారి నుంచి తాను ఈ బియ్యం సేకరిస్తున్నట్టు నేరాన్ని అంగీకరించాడు. నగరంలోని జాతీయ రహదారుల మీదుగా రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతోందని ఎన్టీఆర్‌ జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులకు తరచూ సమాచారం వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని శనివారం రాత్రి డీఎస్‌వో కోమలి పద్మ నేతృత్వంలోని పౌరసరఫరాల బృందాలు జాతీయ రహదారుల మీద నిఘా వేశాయి. అర్ధరాత్రి ద్విచక్ర వాహనాల మీద రేషన్‌ బియ్యం బస్తాలు రవాణా అవుతుండటం గమనించారు. పౌరసరఫరాల బృందాలు ఈ ద్విచక్ర వాహనాలను గుర్తించి వెంబడించారు. ద్విచక్ర వాహనాలన్నీ నిడమానూరు గ్రామం వైపు వస్తుండటాన్ని గుర్తించారు. నిడమానూరు గ్రామ పొలిమేరన ఉన్న ఓ పాత ట్రాక్టర్‌ షెడ్‌లోకి వెళ్ళటం గమనించారు. వెంటనే తన బృందంతో ట్రాక్టర్‌ షెడ్‌ మీద డీఎస్‌వో కోమలి పద్మ దాడి చేశారు. రేషన్‌ బియ్యం తెలుపు సంచుల్లో నిల్వ చేసి ఉండటాన్ని గుర్తించారు. మొత్తం 264 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు.   నిర్వాహకుడు మాజిద్‌ ముల్కీగా గుర్తించి అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనిని విచారించగా.. కంకిపాడు, పెనమలూరు, విజయవాడ రూరల్‌ మండలాల నుంచి ఇంటింటికీ వెళ్లి కార్డుదారుల నుంచి బియ్యం కొనుగోలు చేసే వారి నుంచి సేకరించినట్టుగా తెలిపాడు. వెంటనే అతనిపై కేసు నమోదు చేశారు. స్థానికంగా ఉన్న రైస్‌ మిల్లుకు ఈ బియ్యాన్ని సివిల్‌ సప్లయీస్‌ అధికారులు తరలించారు. ఈ దాడుల్లో సర్కిల్‌ - 3 ఇన్‌చార్జి ఏఎస్‌వో ధనుంజయ రెడ్డి, పీడీఎస్‌ డీటీలు బత్తిన రామకృష్ణ, ఇస్మాయిల్‌, మాధవి, ఆర్‌ఐలు శరత్‌, కి షోర్‌ పాల్గొన్నారు. 


 

Updated Date - 2022-08-08T05:36:41+05:30 IST