మంత్రాలయంలో రద్దీ

ABN , First Publish Date - 2020-11-27T06:03:02+05:30 IST

తుంగభద్ర పుష్కరాల ఏడో రోజు గురువారం మంత్రాలయం మినహా మిగతా చోట్ల రద్దీ కనిపించలేదు.

మంత్రాలయంలో రద్దీ
మంత్రాలయంలోని మఠం ఘాట్‌ వద్ద భక్తజనం

  1.  సంకల్‌బాగ్‌, గుండ్రేవులలో ఓ మాదిరిగా..
  2.  మిగతా చోట్ల వెలవెలబోయిన ఘాట్లు


కర్నూలు(న్యూసిటీ)/కర్నూలు(రూరల్‌)/ మంత్రాలయం/ఎమ్మిగనూరు టౌన్‌/ నందవరం/ నందికొట్కూరు రూరల్‌/సి.బెళగల్‌/గూడూరు/ జూపాడుబంగ్లా,  నవంబరు 26: తుంగభద్ర పుష్కరాల ఏడో రోజు గురువారం మంత్రాలయం మినహా మిగతా చోట్ల రద్దీ కనిపించలేదు. మంత్రాలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి తరలి వచ్చారు. కర్నూలు నగరంలోని రాంభొట్ల, రాఘవేంద్ర ఘాట్లలలో పుష్కరస్నానాలు ఆచరించారు. భక్తులు పలుచగా ఉన్నారు. కలెక్టర్‌ వీరపాండియన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ డీకే బాలాజీ రాంభొట్ల ఘాట్‌ను  సందర్శించారు. 


 మునగాలపాడు, రాఘవేంద్రమఠం పుష్కరఘాట్లలో రద్దీ కనిపించలేదు. మునగాలపాడుల పిండ ప్రదానాల శిబిరాన్ని దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్‌ రామాంజనేయులు సందర్శించారు. రాఘవేంద్రమఠం ఘాట్‌కు చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన కృష్ణ, స్వాతి దంపతులు వారి సంతానం కవలలతో వచ్చారు. 


 గుండ్రేవుల పుష్కరఘాట్‌కు గత నాలుగు రోజుల కంటే ఈ రోజు భక్తుల సంఖ్య పెరిగింది. పంచలింగాల ఘాట్‌కు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పూజలు చేశారు.


 సుంకేసుల పుష్కర ఘాట్‌లో 7వ రోజు భక్తుల తాకిడి కనిపించింది. ఐదు రోజులుగా సుంకేసుల ఘాట్‌ భక్తులు లేక బోసిపోయింది. రెండు రోజులుగా పరిస్థితి మారుతోంది.  ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించి, నదిలో దీపాలు వెలిగించేవారు పెరిగారు.  


 పుష్కరాల్లో ఏడోరోజు మంత్రాలయానికి భక్తులు తరలివచ్చారు. నదిలో నీటి ఉదృతి పెరగడంతో స్నానాలు చేశారు. పలువురు పిండ ప్రధాన క్రతువును నిర్వహించారు. మఠం పీఠాధిపతి సుబుదేంద్రతీర్థులు బృందావనానికి విశేష పూజలు నిర్వహించారు. 


నాగలదిన్నె, గురుజాల పుష్కర ఘాట్లను జేసీ-2 ఖాజామొహిద్దీన్‌ గురువారం పరిశీలించారు. భక్తులకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. ఎంపీడీవో ఫజుల్‌బాషా, ఈవోఆర్డీ ఈశ్వరయ్యస్వామి, తహసీల్దార్‌ నాగరాజు, ఆర్‌ఐ గురురాజరావు, సర్వేయర్‌ శేఖర్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-11-27T06:03:02+05:30 IST