సిరులు కురిపిస్తున్న వేరుశ‘నగ’

ABN , First Publish Date - 2022-01-22T04:30:28+05:30 IST

వరికి ప్రత్యామ్నాయంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముందస్తు యా సంగి సీజన్‌లో సాగు చే స్తున్న వేరుశనగ పంట రైతులకు సిరులు కురిపి స్తోంది.

సిరులు కురిపిస్తున్న వేరుశ‘నగ’
వనపర్తి మార్కెట్‌కు వచ్చిన వేరుశనగ (ఫైల్‌)

వనపర్తి వ్యవసాయ మార్కెట్‌లో క్వింటాల్‌ ధర రూ. 8311 

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, మహారాష్ట్ర, ఏపీ నుంచి వ్యాపారుల పోటీ

గుజరాత్‌, తమిళనాడు రాష్ర్టాల్లో పంట దిగుబడి తగ్గిపోవడంతో డిమాండ్‌

అఫ్లోటాక్సిన్‌ తక్కువగా ఉండటం వల్ల యూరోపియన్‌ దేశాలకు ఎగుమతి


వనపర్తి, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : వరికి ప్రత్యామ్నాయంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముందస్తు యా సంగి సీజన్‌లో సాగు చే స్తున్న వేరుశనగ పంట రైతులకు సిరులు కురిపి స్తోంది. కొద్దిగా వాతా వరణ ఇబ్బందులతో దిగు బడులు తగ్గుతున్నా, ధర అమాంతంగా పెరుగుతుండటం వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తోంది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా రాష్ట్రంలో వేరుశనగ పంటకు ప్రసిద్ధి పొందింది. ఇక్కడ ఉండే నేలల స్వాభావం కారణంగా అఫ్లోటాక్సిన్‌ బ్యాక్టీరియా తక్కువగా ఉండటంతో ఎగుమతి రకం పంట ఉత్పత్తి అవుతోంది. దీంతో ఇతర రాష్ర్టాల నుంచి వ్యాపారులు వచ్చి ఇక్కడి వేరుశనగను కొనుగోలు చేస్తారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో వ్యాపారులు వచ్చి ధర పెడుతుండటంతో ఎంఎస్‌పీని దాటి రెండేళ్లుగా మద్దతు ధర లభిస్తోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్‌పీ ప్రకారం రూ.5550 వేరుశనగ మద్దతు ధర ఉన్నది. కానీ, అంతకంటే దాదాపు రూ. 2000 నుంచి రూ. 2800 వరకు ఎక్కువగా వెచ్చించి వనపర్తి మార్కెట్‌ యార్డులో వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం గరిష్ఠంగా రూ. 8311 ధర పలుకగా కనిష్ఠంగా రూ. 6500 నుంచి రూ. 7,000 వరకు ధర వస్తోంది. పోటీ ఎక్కువగా ఉండటం వల్లనే ధర వస్తోందని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. 

నాణ్యతతోనే డిమాండ్‌ ఎక్కువ: అన్ని రకాల ధాన్యంతో పాటు గ్రాసం తీసుకునే ఆవు, గేదె పాల నుంచి తయారయ్యే వెన్నలోనూ అఫ్లోటాక్సిన్‌ అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇసుక, ఎర్రనేలలు, గొలుసు భూముల్లో పండించే పల్లీ, ఇతర పంటల ఉత్పత్తుల్లో శాతం తక్కువగా ఉంటుంది. ఈ బ్యాక్టీరియా తక్కువ మోతాదులో ఉంటే ధాన్యం ఏదైనా రుచిగా ఉండటంతో పాటు ఎక్కువ రోజులు నిల్వ చేసుకోవచ్చు. వనపర్తి ప్రాంతంలో పండించే వేరుశనగలో ఈ బ్యాక్టీరియా శాతం చాలా తక్కువగా ఉంది. దీంతో పీనట్‌ బట్టర్‌, పల్లి చిక్కి, ఇంకా వేరుశనగ ఆధారిత ఉత్పత్తులు ఎక్కువగా నిల్వ చేసుకునే దేశాల వారు ఈ వేరుశనగను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. దేశంలోని ఇతర రాష్ర్టాల్లో అఫ్లోటాక్సిన్‌ శాతం వనపర్తితో పోలిస్తే ఎక్కువగా ఉంటుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. దీంతో ఏటా మందస్తు యాసంగి సీజన్‌లో వనపర్తి మార్కెట్‌కు విక్రయానికి వచ్చిన పల్లీని కొనుగోలు చేసేందుకు ఇక్కడి కమీషన్‌ ఏజెంట్లతో ఇతర రాష్ర్టాల వ్యాపారులు ఒప్పందాలు చేసుకుంటారు. ఇక్కడ కొన్న వేరుశనగను వారి ప్రాంతాలకు తీసుకెళ్లి, ప్రాసెసింగ్‌ చేసి ముంబై, చెన్నై పోర్టుల ద్వారా యురోపియన్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 


పోటెత్తుతున్న దిగుబడి

 రాష్ట్రంలో సాగయ్యే వేరుశనగ పంటలో మెజారిటీ సాగు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోనే జరుగుతుంది. ముందస్తు యాసంగి (సెప్టెంబరు) వేరుశనగ పంట సాగు చేయడం వల్ల డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు వేరుశనగ పంట మార్కెట్‌కు వస్తుంది. ఉమ్మడి జిల్లాలో పలు మార్కెట్లు ఉన్నప్పటికీ వ్యాపారుల పోటీ, ధర నేపథ్యంలో వనపర్తి మార్కెట్‌కు రైతులు పంటను ఎక్కువగా తీసుకువస్తారు. గతేడాది వనపర్తి మార్కెట్‌లో 1.80 లక్షల క్వింటాళ్ల వేరుశనగ రాగా ప్రస్తుతం జవనరి 20 నాటికి లక్షా 25,391 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. వ్యాపారుల నుంచి పోటీ ఎక్కువగా ఉన్న కారణంగా ఎంఎ్‌సపీ కంటే కనీసం రూ. 2వేల నుంచి రూ. 2800 వరకు ధర అధికంగా వస్తోంది. ఇక వేరుశనగ పంటకు ఈ నేలలు అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల ఇక్కడ వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రం త్వరలో ఏర్పాటు కానుంది. ఇప్పటికే 25 ఎకరాల స్థలం గుర్తించారు. సుమారు రూ.20 కోట్లతో సీఎం కేసీఆర్‌ ఇప్పటికే శంకుస్థాపన చేయాల్సి ఉండగా వాయిదా పడుతోంది. ఈ వేరుశనగ విత్తన పరిశోధన కేంద్రం ఏర్పాటయితే ఐకార్‌ (ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసర్చ్‌) ఆధ్వర్యంలో జూనగఢ్‌ గుజరాత్‌లో నిర్వహిస్తున్న డీజీఆర్‌ (డైరెక్టరేట్‌ ఆఫ్‌ గ్రౌండ్‌నట్‌ రీసర్చ్‌) తర్వాత వేరుశనగ కోసమే ఏర్పాటవుతున్న రెండో కేంద్రం కానుంది. 


క్వాలిటీ పల్లి

వనపర్తిలో దిగుబడి అయ్యే వేరుశనగ మంచి క్వాలిటీ ఉంటుంది. ఇక్కడి వేరుశనగకు యూరప్‌ వంటి దేశాల్లో మంచి డిమాండ్‌ ఉన్నది. అటు రైతులకు అధిక ధర రావడంతో పాటు వ్యాపారులకు మంచి గిట్టుబాటు లబిస్తోంది.

- ఇరిగెల దస్తగిరి రెడ్డి, వ్యాపారి, పొద్దుటూరు


రైతులకు లాభసాటిగా ధరలు

ఏడు ఎకరాల్లో వేరుశనగ వేశాను. క్వింటాలు విత్తనాలను రూ.12,200లను కొ న్నాను. ఏడు వేల నుంచి ఎనిమిది వేల మధ్యలో ధర ఉంటే కొంత లాభసాటిగా ఉంటుంది. ప్రస్తుతం ఎనిమిది వేల వరకు క్వింటాలు ధర పలుకుతుంది. వరిసాగు వద్దన్న ప్రభుత్వం వేరుశనగ రైతులకు లాభసాటిగా ధర నిర్ణయించి ప్రోత్సహించాలి. 

- శంకర్‌నాయక్‌ రైతు, యన్మన్‌బెట్ల తాండ, కొల్లాపూర్

Updated Date - 2022-01-22T04:30:28+05:30 IST