పేదల స్థలాల్లో.. పెద్దల నిర్మాణాలు!

ABN , First Publish Date - 2022-05-22T05:36:29+05:30 IST

పేదలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో బినామీలు ఇళ్లు నిర్మిస్తున్నారంటూ పొన్నపుతోట గ్రామస్థులు శనివారం పనులకు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పేదల స్థలాల్లో.. పెద్దల నిర్మాణాలు!
నాపరాళ్లు తొలగిస్తున్న పొన్నతోట గ్రామస్థులు

పనులు అడ్డుకున్న స్థానికులు 

స్థానికేతరుల పట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ 

ఇళ్లులేని నిరుపేదలకు ఇవ్వాలని విజ్ఞప్తి

జమ్మలమడుగు రూరల్‌, మే 21: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన స్థలాల్లో బినామీలు ఇళ్లు నిర్మిస్తున్నారంటూ పొన్నపుతోట గ్రామస్థులు శనివారం పనులకు అడ్డుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు, రాజీవ్‌నగర్‌ కాలనీ సమీపంలోని పొన్నతోట పొన్నపురెడి ్డ కాలనీలోని సర్వే నెంబరు 525/ఎలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సుమారు 100 మంది స్థానికేతరులకు ప్రభుత్వం పట్టాలు ఇచ్చింది. లబ్ధిదారులందరూ స్థానికేతరులు కావడం,  ఇక్కడి స్థలాలకు అప్పట్లో డిమాండ్‌ లేకపోవడంతో ఎవరూ నిర్మాణాలు చేపట్టలేదు. ఆ స్థలాలపై కన్నేసిన పొన్నతోటకు చెందిన కొందరు వైసీపీ నాయకులు వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు పనులు అడ్డుకున్నారు. పునాదుల కోసం సిద్ధం చేసిన నాపరాళ్లను కాలువలో పడవేశారు. ఈ సందర్భంగా  టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, తెలుగురైతు ప్రధాన కార్యదర్శి మల్లికార్జున విలేకరులతో మాట్లాడుతూ తమ గ్రామానికి సుమారు 20 కి.మీ. దూరంలో ఉన్న కొందరు వైసీపీ నాయకులకు తమ గ్రామస్థుల్లోనే కొందరు బినామీలుగా మారి నిర్మాణాలు ప్రారంభించారన్నారు. దీంతో స్థానికంగా ఉన్న ఇళ్లులేని పేదలు కడుపుమండి బయటి వ్యక్తులను అడుకున్నారన్నారు. ఈ విషయంపై  ఏడాది నుంచి స్పందన కార్యక్రమంలో జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని తెలిపారు. ఈ స్థలాల్లో ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టరాదని  రెండు రోజుల క్రితం స్థానిక వీఆర్వో హుస్సేన్‌ హెచ్చరించినా పెడచెవిన పెట్టారని ఆరోపించారు.  ఇప్పటికైనా జిల్లా అధికారులు, స్థానిక అధికారులు పరిశీలించి లబ్ధిదారులకు న్యాయం చేయడంతోపాటు, తమ గ్రామ ప్రజలకు స్థలాలు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నతోటకు చెందిన సుమారు 100 మంది పాల్గొన్నారు. 


Updated Date - 2022-05-22T05:36:29+05:30 IST