పటిష్టంగా ప్లాస్టిక్‌ నిషేధం అమలు

ABN , First Publish Date - 2022-07-01T06:38:37+05:30 IST

పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్ల నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని పెడన కౌన్సిల్‌ తీర్మానించింది. పట్టణంలో నెలకొన సమస్యలపై కౌన్సిల్‌ సభ్యులు గళమెత్తారు.

పటిష్టంగా ప్లాస్టిక్‌ నిషేధం అమలు

పెడన, జూన్‌ 30 :  పట్టణంలో ప్లాస్టిక్‌ కవర్ల నిషేధాన్ని పటిష్టంగా అమలు చేయాలని పెడన కౌన్సిల్‌ తీర్మానించింది. పట్టణంలో నెలకొన సమస్యలపై కౌన్సిల్‌ సభ్యులు గళమెత్తారు. పెడన మునిసిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం చైర్‌పర్సన్‌ బళ్ళ జ్యోత్స్నరాణి అధ్యక్షతన గురువారం జరిగింది. అజెండాలోని 18 అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. సభ్యులు సమస్యలపై గళమెత్తారు. తొమ్మిదో వార్డు కౌన్సిలర్‌ గరికముక్కు చంద్రబాబు మాట్లాడుతూ, వర్షా కాలంలో డ్రెయిన్లలో సిల్టు తీయడం ఏమిటని ప్రశ్నించారు.  అంతర్గత డ్రెయిన్లలో సిల్టు  తీయకపోవడంతో మురుగునీరు పొంగి రోడ్లపై ప్రవహిస్తోందన్నారు.  వైస్‌చైర్మన్‌ ఎండి ఖాజా మాట్లాడుతూ, స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి రోజుకో వార్డు చొప్పున మొత్తం 23 వార్డుల్లోని అంతర్గత డ్రెయిన్లలో సిల్టు తొలగించాలని  సూచించారు. ఫ్లోర్‌ లీడర్‌ కటకం ప్రసాద్‌ మాట్లాడుతూ, కౌన్సిలర్లకు తెలియకుండా కౌన్సిల్‌ తీర్మానం, టెండర్‌ లేకుండా మునిసిపల్‌ కార్యాలయం ఎదుట వెహికల్‌ పార్కింగ్‌ షెడ్‌ నిర్మించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. షెడ్డు నిర్మాణాన్ని తాము తప్పు పట్టడం లేదని, నిర్మాణానికి అనుసరించిన విధానాన్ని తప్పు పడుతున్నామన్నారు. ఇదే విధానం కొనసాగితే భవిష్యత్‌లో సభ్యులు సమావేశానికి రావాల్సిన అవసరం ఉండదన్నారు.  డంపింగ్‌ యార్డు బాగుచేతకు రూ. 6 లక్షలు కేటాయించడం పట్ల ప్రసాద్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. 17వ వార్డు కౌన్సిలర్‌ మెట్ల గోపీప్రసాద్‌ మాట్లాడుతూ, వాటర్‌ వర్క్స్‌ విభాగంలో రక్షిత మంచినీటి పథకానికి సంబంధించిన సామాగ్రి అపహరణకు గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. చోరీ విషయమై పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ఏఈని నిలదీశారు. 21వ వార్డు కౌన్సిలర్‌ పిచ్చుక సతీష్‌ మాట్లాడుతూ, ఒకటో వార్డులోని పైడమ్మ తల్లి కాలనీలో రోడ్లు, డ్రెయిన్లు, మంచినీటి సదుపాయం కల్పించాలని కోరారు. స్పందించిన చైర్‌పర్సన్‌ జ్యోత్స్నరాణి కాలనీకి వెంటనే అన్ని సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అంబేడ్కర్‌ పార్కులో ప్రముఖుల పేర్లతో ఉన్న శిలాఫలకాలను పూడ్చివేయడం పట్ల చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్కు అభివృద్ధి పనుల వర్కు ఆర్డర్‌ ఇవ్వమని కోరితే ఏఈ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పారిశుధ్య పనుల కోసం కొత్త పుష్‌ కార్డులను కొనుగోలు చేయాలని కటకం ప్రసాద్‌ సూచించారు. పాత పుష్‌కార్డులకు మరమ్మతులు దండగన్నారు.  కమిషనర్‌ ఎం. అంజయ్య, టీపీవో ఏసుబాబు, ఆర్‌ఐ పామర్తి వెంకటేశ్వరరావు, ఏఈ వెంకటేశ్వరరావు  పాల్గొన్నారు.

 

Updated Date - 2022-07-01T06:38:37+05:30 IST