సినిమా రివ్యూ: పెద్దన్న

Nov 4 2021 @ 14:25PM

చిత్రం: పెద్దన్న

విడుదల తేదీ: 04 నవంబర్, 2021

నటీనటులు: రజనీకాంత్, నయనతార, కీర్తిసురేశ్, ఖుష్బూ, మీనా, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, అభిమన్యు సింగ్, రవి, లివింగ్ స్టన్, పాండ్యరాజన్, సూరి, సతీష్ తదితరులు

కెమెరా: వెట్రి

ఎడిటింగ్: రూబెన్

సంగీతం: డి.ఇమాన్

నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్

దర్శకత్వం: శివ

సూపర్ స్టార్ రజనీకాంత్ లాస్టియర్ ‘దర్బార్’ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆ సినిమా ఆశించినరీతిలో అలరించలేకపోయింది. ఇక ఈ ఏడాది తలైవా.. మాస్ ప్రేక్షకులకోసం ఫుల్ యాక్షన్ మోడ్ లో ‘పెద్దన్న’గా థియేటర్స్ లోకి వచ్చారు. సిస్టర్ సెంటిమెంట్ ప్లస్ తన మాస్ పెర్ఫార్మెన్స్ తో ఆయన అభిమానులకి ఏ రేంజ్ లో యాక్షన్ ట్రీట్ ఇచ్చారు? సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుంది? అనే విషయాలు రివ్యూలో చూద్దాం.


కథ:

వీరన్న (రజనీకాంత్)ని  రాజోలు గ్రామ ప్రజలు పెద్దన్నగా గౌరవిస్తారు. ఆయన మాటని వేదవాక్కుగా భావిస్తారు. గ్రామ ప్రజల మంచి చెడ్డ చూస్తూ వారికి కొండంత అండగా ఉంటాడు.  అతడికి  చెల్లెలు కనకమహాలక్ష్మి (కీర్తిసురేశ్) అంటే ప్రాణం. ఎప్పుడూ చెల్లెలి క్షేమం కోసం, ఆమె ఆనందం కోసం పరితపిస్తూ ఉంటాడు. ఆమెకు ఎలాంటి హాని కలగకుండా చూస్తుంటాడు. ఊరందరి అభిప్రాయం మేరకు చెల్లెలి పెళ్ళి ఘనంగా జరిపించాలని అనుకుంటాడు.  కానీ సరైన వరుడు కోసం వెతుకుతాడు. చివరికి తనతో శ్రతుత్వం పెట్టుకున్న ఓపెద్ద మనిషి (ప్రకాశ్ రాజ్) వీరన్న వ్యక్తిత్వం కారణంగా  మనిషిగా మారి తన తమ్ముడితో అతడి చెల్లెలి పెళ్ళి చేయమని అర్ధిస్తాడు. వీరన్న దానికి సంతోసంగా అంగీకరిస్తాడు. తీరా పెళ్ళి సమయానికి కనక మహాలక్ష్మి తను ప్రేమించిన వాడితో వెళ్ళిపోతుంది. తను ప్రాణంగా భావించిన తన చెల్లెలు తనతో చెప్పకుండా ఎందుకు పారిపోయింది? అన్నే తన ప్రాణంగా బతుకుతున్న కనక మహాలక్ష్మి తన అన్నకు ఎందుకు ద్రోహం తలపెట్టింది?  దాని వెనుక ఎవరున్నారు? పెద్దన్న తన చెల్లెలిని తిరిగి ఎలా కలుసుకున్నాడు? ఆమె కోసం ఏం చేశాడు? అన్నదే మిగతా కథ.

విశ్లేషణ: 

అసలు రజనీకాంత్ నుంచి ఈ మధ్యకాలంలో ఈ తరహాలో పూర్తి గ్రామీణ  నేపధ్యంలో ఇంత మాస్ యాక్షన్ సినిమా రాలేదు. ‘పెద్దన్న’  సినిమా ఆ లోటు పూర్తిగా తీర్చేస్తుంది. అభిమానులచేత థియేటర్స్‌లో గోల చేయించి విజిల్స్ వేయిస్తుంది. దానికి తగ్గట్టుగానే తలైవా ఎప్పటిలాగానే.. తన స్టైలాఫ్ యాక్షన్ తోనూ, మేనరిజమ్స్ తోనూ, పెర్ఫార్మెన్స్ తోనూ అదరగొట్టారు. ఆయన స్టైల్స్ లోనూ, యాక్షన్ సీక్వెన్సెస్ లోనూ, ఆయన కేరక్టర్ ఎలివేషన్స్ లోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు దర్శకుడు శివ. అలాగే రజనీ పంచ్ డైలాగ్స్, డైలాగ్ డెలివరీ, ఎనర్జీ ఆకట్టుకుంటాయి. కాకపోతే రజనీకాంత్ వయసు ఆయన మేకోవర్ ను దాచలేకపోయింది. అది ముఖంలో క్లియర్ గా కనిపిస్తుంది.  కథ మొదటి నుంచి చివరిదాకా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా సాగడం సినిమాకి  ప్లస్ పాయింట్ అయింది. కథానాయికగా నయనతార స్ర్కీన్ ప్రెజెన్స్ ఆకట్టుకుంటుంది. చెల్లెలిగా కీర్తి సురేశ్ అద్భుమైన అభినయంతో మెప్పిస్తుంది. ఇక విలన్స్ గా అభిమన్యు సింగ్, జగపతి బాబు ఆకట్టుకుంటారు. మీనా, ఖుష్బూ చేసిన అతిథి పాత్రలు రజనీకాంత్ తో రీయూనియన్ అయినట్టుగా అనిపిస్తాయి. తప్ప వాటికి అంతగా ప్రధాన్యత ఉండదు.


‘పెద్దన్న’ సినిమా చూస్తుంటే.. చాలా సినిమాలు గుర్తుకొస్తాయి. అజిత్ ‘విశ్వాసం’ ఫార్మెట్ లో పవన్ కళ్యాణ్  ‘అన్నవరం’  సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. కానీ  అన్నగా రజనీకాంత్ కనిపించడం వల్ల.. వాటిని ప్రేక్షకులు అంతగా పట్టించుకోరు. సెకండాఫ్ పూర్తిగా కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో రన్ అవుతుంది. అక్కడ వచ్చే సీన్స్, యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తాయి. మొత్తానికి యాక్షన్ చిత్రాల్ని ఇష్టపడే మాస్ జనానికి ‘పెద్దన్న’ సినిమా నిజంగా ఫుల్ మీల్స్ కిందే లెక్క. మరి మన ప్రేక్షకులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.


ట్యాగ్‌లైన్: రజనీకాంత్ ఫ్యాన్స్ కోసం ‘పెద్దన్న’

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.