Advertisement

ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే అలా ఎందుకు జరుగుతోంది..?

Oct 17 2020 @ 12:21PM

ఆ జిల్లాలో కీలకమైన అధికారుల పోస్టులన్నింటిలోనూ ఇన్‌ఛార్జులే! రిటైర్డు అయిన అధికారుల స్థానంలో కొత్తవారిని కూడా నియమించడం లేదు. ఎవరైనా నిజాయితీగా, నిక్కచ్చిగా పనిచేస్తే వారికి బదిలీ సత్కారం! ఇంతకీ అది ఏ జిల్లా? అక్కడ ఇన్‌ఛార్జిల పాలన వల్ల ఎదురవుతున్న సమస్య ఏంటి? అసలు అధికారుల వరుస బదిలీలకు రాజకీయ జోక్యం ఏ స్థాయిలో పనిచేసింది? వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


ఎక్కడెక్కడో పనిచేసి ఇక్కడే రిటైర్...

పెద్దపల్లి జిల్లాకు పాలనాపరంగా పెద్దకష్టమే వచ్చింది. ఉన్నతాధికారులంతా వరుసగా బదిలీలు అవుతున్నారు. అందేంటో తెలియదు కానీ... ఉన్న కొద్దిమంది అధికారులు కూడా ఎక్కడెక్కడో పనిచేసి పెద్దపల్లిలోనే రిటైర్డ్ అవుతున్నారు. బదిలీ, లేక రిటైర్డ్ అయినవారి స్థానంలో కొత్త అధికారులు వస్తారనుకుంటే అదీ జరగడం లేదు. కొత్త జిల్లాలు ఏర్పడి నాలుగేళ్లు పూర్తయ్యాయి. మిగతా జిల్లాలతో పోలిస్తే పెద్దపల్లి జిల్లాలకు అన్ని హంగులూ ఉండి అభివృద్ధిలో వెనకబడిపోతోంది. పాలనాపరమైన నిర్ణయాలు తీసుకునే సరైన అధికారులు లేక జిల్లాలో అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా మారింది. ఒకటీ రెండు కాదు ఏకంగా పదిహేను శాఖలకు చెందిన ప్రధాన బాధ్యతలన్నీ ఇంఛార్జ్‌ అధికారులతోనే నెట్టుకువస్తోంది పెద్దపల్లి జిల్లా యంత్రాంగం.


బదిలీలే.. బదిలీలు...

తెలంగాణలో ఏ జిల్లాలో లేనివిధంగా పెద్దపల్లిలో ఇప్పటికే నాలుగేళ్లలో నలుగురు కలెక్టర్లు మారారు. రాజకీయ, సామాజిక కారణాలతో ఇక్కడి వ్యవస్థ అంతా కుంటుపడుతోంది. ముందుగా కలెక్టర్ల విషయమే తీసుకుందాం. జిల్లా ఏర్పడిన కొత్తలో అలుగు వర్షిణిని తొలి కలెక్టర్‌గా నియమించింది ప్రభుత్వం. ఆమె పాలన చేపట్టిన కొద్దిరోజులకే ప్రజల మన్ననలను పొందారు. కిందిస్థాయి అధికారులు గజగజ వణుకుతూ పనిచేశారు. కానీ కొన్ని నెలలకే ఆమెను బదిలీ చేసింది ప్రభుత్వం. దీంతో పెద్దపల్లి జిల్లా పాలనా బాధ్యతలను జేసీగా పనిచేస్తున్న ప్రభాకర్‌కు అప్పగించింది. ఆయన కొద్దిరోజులు ఇంఛార్జ్ కలెక్టర్‌గా, కలెక్టర్‌గా చేసి అక్కడే రిటైర్డ్ అయ్యారు. ఆయన తర్వాత మళ్లీ శ్రీ దేవసేన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాలన జెట్ స్పీడ్‌లో దూసుకుపోతున్న తరుణంలో ఆమెను అకస్మాత్తుగా బదిలీ చేసింది ప్రభుత్వం. అందుకు కారణాలు తెలియకపోయినా.. దేవసేన దూకుడు స్వభావం రాజకీయ నేతలకు నచ్చలేదట. తమను కాదని పనులు చేస్తున్నారని ప్రజాప్రతినిధులు ఆమెపై అలిగారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలన్నీ కేవలం దేవసేన పనిచేయడం వల్లే వచ్చాయా? అంటూ నేతలంతా నొచ్చుకున్నారు. దీంతో రాజకీయ ఒత్తిళ్ల కారణంగా ప్రభుత్వం ఆమెను కూడా బదిలీ చేసిందని టాక్.

Advertisement

కలెక్టర్ వస్తారని భావించినా...

ఇక శ్రీ దేవసేన తర్వాత వచ్చిన కలెక్టర్ సిక్తా పట్నాయక్ కూడా జిల్లాలో ఎక్కువ కాలం పని చేయలేకపోయారు. జేసీని మినహా మిగతా ఎవ్వరినీ కలవని సిక్తా పట్నాయక్‌ను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రస్తుతం మూడు నెలలుగా మంచిర్యాల కలెక్టర్ భారతీ హోలీకేరి పెద్దపల్లి ఇంఛార్జ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు చూస్తున్నారు. అయితే ఆ కలెక్టర్ రెండు జిల్లాల బాధ్యతలు చూస్తుండటంతో పెద్దపల్లి జిల్లా మీద పెద్దగా దృష్టి పెట్టలేకపోతున్నారు. రేపోమాపో కలెక్టర్ వస్తారని అంతా భావించినప్పటికీ పెద్దపల్లి జిల్లాకు ఇప్పటికీ పూర్తిస్థాయి కలెక్టర్ లేరు. దీంతో పాలనా యంత్రాంగానికి సారథి అయిన కలెక్టర్ పోస్టే ఇంఛార్జిల పాలనలో నడుస్తోంది. 


ఉన్నత పోస్టులన్నీ ఇంఛార్జిల ఆధ్వర్యంలోనే...

జిల్లాలో కలెక్టర్ తర్వాత అటు పోలీస్, ఇటు రెవెన్యూ డిపార్టుమెంట్లతోపాటు ఇతర ప్రధాన శాఖల్లో ఉన్నతాధికారుల పోస్టులన్నీ ఇంఛార్జిల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. పాలనలో కీలకమైన డీఆర్వో అధికారి, జిల్లా పంచాయతీ, పశుసంవర్ధక, జెడ్పీ సీఈవో, జిల్లా పట్టణ ప్రణాళిక అధికారి, వ్యవసాయశాఖ జిల్లా అధికారి వంటి పోస్టులన్నీ ఇంఛార్జిలతోనే నెట్టుకువస్తున్నారు. ఇక పోలీస్ డిపార్టుమెంట్‌లోనూ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పెద్దపల్లి, ఏసీపీ ట్రాఫిక్ రామగుండం, అడిషనల్ డీసీపీ లా అండ్ ఆర్డర్ లాంటి కీలకమైన పోస్టులను కూడా ఇంఛార్జిలతోనే లాక్కువస్తున్నారు. మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా పేరు గాంచిన రామగుండం పారిశ్రామిక ప్రాంతం, సింగరేణీ, ఆర్‌ఎఫ్‌సీఎల్, ఎన్టీపీసీ లాంటి ప్రధాన పరిశ్రమలు ఉన్న ప్రాంతంలో అభివృద్ధి శరవేగంగా జరగాలి. అయితే అది జరగక పోగా.. పరిశ్రమలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే కీలక అధికారుల పోస్టులన్నీ ఇలా ఇంచార్జీలతోనే నెట్టుకురావడంపై ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది.


అందరూ ఇక్కడే పదవీ విరమణ..

ఇక జిల్లాలో విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే.. ఎక్కడెక్కడో పనిచేసి వచ్చిన అధికారులంతా ఇక్కడే రిటైర్డ్ అవుతున్నారు. అలా పదవీ విరమణ అయిన పోస్టుల్లోనూ కీలక శాఖలున్నాయి. ముఖ్యంగా జేసీగా ఉండి పూర్తిస్థాయి బాధ్యతలు తీసుకున్న ప్రభాకర్ కూడా రిటైర్ట్ అయ్యారు. తర్వాత జేసీ వనజాదేవీ కూడా ఇక్కడే పదవీ విరమణ చేశారు. జిల్లా పంచాయితీరాజ్ అధికారి సుదర్శన్ కూడా పెద్దపల్లిలో పనిచేస్తున్న సమయంలోనే రిటైర్డ్ అయ్యారు. ఏసీపీ అబీబ్ ఖాన్, డీసీపీ స్థాయి అధికారులు కూడా ఇక్కడే రిటైర్డ్ అయ్యారు.  ఇలా అనేక మంది పెద్దపల్లి జిల్లాలోనే రిటైర్డ్ అవుతున్నా.. వారి స్థానంలో రెగ్యులర్ అధికారులను నియమించడం లేదు.  


నియామకాలు లేక...

ఓ వైపు కొత్త రెవెన్యూ చట్టం, మరోవైపు మున్సిపల్ చట్టం, నూతన వ్యవసాయ విధానంతో పాలనాపరంగా రాష్ట్ర ప్రభుత్వం భారీగా సంస్కరణలు చేపడుతోంది. కానీ పెద్దపల్లి లాంటి జిల్లాల్లో మాత్రం అధికారులను నియమించడం లేదు. ఒక్కరే అనేక చోట్ల బాధ్యతలను చూడటంతో పాలన మీద దృష్టి పెట్టలేకపోతున్నారు. మరి పెద్దపల్లి జిల్లాపై ప్రభుత్వం ఎప్పుడు దృష్టి పెడుతుందో.. ఈ జిల్లాకు పాలనాపరంగా తలెత్తిన సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తుందో.. చూడాలి.

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.