పెద్దవాగు ఒక్కటే అప్పగిస్తాం

ABN , First Publish Date - 2022-01-25T06:59:06+05:30 IST

గోదావరి నదిపై పెద్దవాగు ఒక్కటే ఉమ్మడి ప్రాజెక్టు అని, దానిని

పెద్దవాగు ఒక్కటే అప్పగిస్తాం

  • మిగతా ప్రాజెక్టులను అప్పగించాల్సిన అవసరం లేదు
  • విజ్ఞప్తులు తేలకుండా బోర్డు పరిధిలోకి ఎలా తెస్తారు?
  • పూర్తిస్థాయి భేటీలో చర్చించాకే నోట్‌ సిద్ధం చేయాలి
  • గోదావరి బోర్డు సబ్‌కమిటీ భేటీలో తెలంగాణ వాదన
  • తెలంగాణలోని కాంపోనెంట్లన్నీ తీసుకోవాలన్న ఏపీ
  • డిమాండ్‌ సహేతుకం కాదన్న తెలంగాణ అధికారులు


హైదరాబాద్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిపై పెద్దవాగు ఒక్కటే ఉమ్మడి ప్రాజెక్టు అని, దానిని గోదావరి బోర్డుకు అప్పగించడానికి తమకు అభ్యంతరాలేమీ లేవని తెలంగాణ పేర్కొంది. మిగతా ప్రాజెక్టులను అప్పగించాల్సిన అవసరం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో లేదని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ప్రాజెక్టుల అప్పగింతపై సోమవారం బోర్డు ఉప కమిటీ కన్వీనర్‌ బీపీ పాండే నేతృత్వంలో వర్చువల్‌ సమావేశం జరిగింది.


ఎజెండాలో తెలంగాణలోని  మేడిగడ్డ బ్యారేజీతోపాటు కన్నెపల్లి పంప్‌హౌస్‌, ఎస్‌ఆర్‌ఎస్పీ గీసుకొండ రెగ్యులేటర్‌, దేవాదుల ఎత్తిపోతల పథకం, ఏపీలోని సీలేరు, తాడిపూడి, వెంకటనగరం ఎత్తిపోతల, పట్టిసీమ, ధవళేశ్వరం(సర్‌ ఆర్థర్‌ కాటన్‌) బ్యారేజీలను పేర్కొన్నారు. ప్రధానంగా మేడిగడ్డ బ్యారేజీతోపాటు కన్నెపల్లి పంప్‌హౌ్‌స(తెలంగాణ), వెంకటనగరం(ఏపీ) ప్రాజెక్టుల అప్పగింతపైనే చర్చించారు. తెలంగాణ అధికారులు మాట్లాడుతూ గత ఏడాది అక్టోబరు 11న జరిగిన గోదావరి బోర్డు 12వ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఖమ్మం జిల్లాలో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగును అప్పగించడానికి అంగీకారం తెలిపామన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర సమాచారం బోర్డుకు అందజేశామని, జీవో విడుదలకుగాను ప్రభుత్వానికి ఫైలు వెళ్లిందని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతర కాంపోనెంట్లను బోర్డు పరిధిలోకి తేవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.


ఇక గెజిట్‌లో అనుమతిలేని జాబితాలో 11 ప్రాజెక్టులు ఉండగా... వాటిలో 5 ప్రాజెక్టులను జాబితానుంచి తొలగించాలని కోరినట్లు, మరో 6 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించినట్లు తెలిపారు. ఈ ఫైలు కేంద్ర జలవనరుల సంఘం పరిశీలనలో ఉందన్నారు. ఇక షెడ్యూల్‌-2 (ప్రత్యక్ష నియంత్రణలో ఉన్న) ప్రాజెక్టులను షెడ్యూల్‌-3 (బోర్డు పరోక్ష నియంత్రణ)లోకి తేవాలని కేంద్ర జలశక్తి శాఖకు విజ్ఞప్తులు చేశామని, ఆ విజ్ఞప్తులు తేలకుండా కొత్త ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తేవాలని ప్రతిపాదించడం సమంజసం కాదని అన్నారు. బోర్డు పూర్తిస్థాయి సమావేశంలో చర్చించిన తర్వాతే ప్రాజెక్టుల అప్పగింత నోట్‌ సిద్ధం చేయాలని కోరారు. ఇక ఉప కమిటీ ఐదో సమావేశంలో తెలంగాణ వ్యక్తం చేసిన అభిప్రాయాలు అసంపూర్ణంగా రికార్డయ్యాయని, దీనిని సవరించాలని కోరినా ఆ పని జరగలేదని గుర్తు చేశారు. తమ అభిప్రాయాలను ఆరో ఉప కమిటీ సమావేశం మినిట్స్‌లో సమగ్రంగా రికార్డు చేయాలని కోరారు. 


తెలంగాణలోని ప్రాజెక్టులన్నింటినీ తీసుకోవాల్సిందే..

గెజిట్‌లోని షెడ్యూల్‌-2లో తెలంగాణ నుంచి చేర్చిన ప్రాజెక్టులన్నింటినీ బోర్డు ప్రత్యక్ష నియంత్రణలోకి తేవాల్సిందేనని ఆంధ్రప్రదేశ్‌ జలవనరుల శాఖకు చెందిన గోదావరి డెల్టా సిస్టమ్‌(జీడీఎస్‌) చీఫ్‌ ఇంజనీర్‌ పుల్లారావు డిమాండ్‌ చేశారు. ఏపీలోని వెంకటనగరం ఎత్తిపోతల పథకంపై చర్చ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.


గెజిట్‌లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించడానికి తమకు అభ్యంతరాల్లేమీ లేవన్నారు. గోదావరిలో ఏపీకి ఎగువన తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ తీసుకోకపోతే.. దిగువ ప్రాంతంలో ఉండే వారిపై ఆ ప్రభావం పడుతుందని తెలిపారు. దీనిపై తెలంగాణ అధికారులు స్పందిస్తూ.. ఈ ప్రాజెక్టులన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టినవేనని గుర్తు చేశారు. అవి తెలంగాణ ఆయకట్టుకు మాత్రమే నీటిని సరఫరా చేసే ప్రాజెక్టులనీ, గోదావరి ట్రైబ్యునల్‌లోని క్లాజ్‌-4 ప్రకారం రాష్ట్రాలకు గోదావరిలో తమ వాటా నీళ్లను ఎక్కడికైనా తరలించే అధికారం ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రాజెక్టులు కానివాటిని బోర్డు పరిధిలోకి తీసుకోవాలనే డిమాండ్‌ సహేతుకం కాదన్నారు. ఈ సమావేశానికి గోదావరి బోర్డు సభ్యుడు పీఎస్‌ కుటియల్‌, తెలంగాణ నుంచి అంతర్రాష్ట్ర విభాగం చీఫ్‌ ఇంజనీర్‌ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సుబ్రమణ్యప్రసాద్‌, ఏపీ నుంచి గోదావరి డెల్టా చీఫ్‌ ఇంజనీర్‌ పుల్లారావు, ఏపీ జెన్‌కో అధికారులు హాజరయ్యారు. 


Updated Date - 2022-01-25T06:59:06+05:30 IST