అభివృద్ధి మరిచి.. విధ్వంసమే మేనిఫెస్టోగా జగన్ పాలన : పీతల సుజాత

ABN , First Publish Date - 2022-03-08T18:20:55+05:30 IST

‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో కల్లబొల్లి కబుర్లు మోసపుమాటలతో

అభివృద్ధి మరిచి.. విధ్వంసమే మేనిఫెస్టోగా జగన్ పాలన : పీతల సుజాత

జంగారెడ్డిగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) : ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో కల్లబొల్లి కబుర్లు మోసపుమాటలతో జనాల్ని నమ్మించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శలు గుప్పించారు. ఉమెన్స్ డే సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. జగన్ గద్దెనెక్కిన నాటినుంచి ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి మరిచి అరాచకం తన విధానంగా, విధ్వంసం తన మ్యానిఫెస్టోగా మార్చుకుని పాలన చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో అన్ని వర్గాలు కూడా దగాపడి నీ పాలన మాకొద్దు అంటూ రోడ్లమీదకు వచ్చి పోరాటాలు చేస్తున్నారు. అసెంబ్లీలో గొప్పగా మహిళల కోసం దిశ చట్టం తెస్తున్నానని జబర్దస్త్ షో చేసి దగా చట్టాన్ని తెచ్చి నేడు ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ లేకుండా చేశారు. అమరావతి రాజధానిగా ఉండాలని ఐదుకోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకోసం అమరావతి మహిళా రైతులు ఉద్యమం చేస్తుంటే అత్యంత పాశవికంగా వారి పొత్తి కడుపుల మీద తన్నడం, జుట్టు పట్టుకుని లాగడం, ఒంటిమీద వస్త్రాలను కూడా చించేసి మగ పోలీసులు చేత ఆడవారి దాడులు చేయించిన రాక్షస ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంఅని సుజాత మండిపడ్డారు.


మా ప్రభుత్వంలో..

ఆంధ్రప్రదేశ్‌లో ఆడవారిపై నిత్యం దాడులు జరుగుతున్నా ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. స్వాతంత్ర్య దినోత్సవం నాడు పట్టపగలు బీటెక్ విద్యార్థినిని నడిరోడ్డు మీద హత్య చేశారంటే రాష్ట్రంలో మహిళలకు ఏలాంటి రక్షణ ఉందో అర్థం చేసుకోవచ్చు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాచేపల్లిలో బాలిక మీద అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి ప్రభుత్వానికి భయపడి ఆత్మహత్య చేసుకున్నాడు. నేడు వైసీపీ ప్రభుత్వంలో మహిళల మీద దాడులు చేసి నిందితులు యధేచ్ఛగా రోడ్ల మీద తిరుగుతూ బాధితులను బెదిరించే పరిస్థితి ఉంది. రాజమండ్రిలో బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి బాలికను పోలీసు స్టేషన్ దగ్గర వదిలి వెళ్ళారంటే రాష్ట్రంలో నేరాలు చేసినా ఏం చేయలేరనే దైర్యం నిందితులకు వచ్చింది.. దీనికి కారణం వైసీపీ ప్రభుత్వ అలసత్వమే అని మాజీ మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


మొద్దు నిద్రలో హోం మంత్రి!

వైసీపీ నాయకులు, మంత్రులే మహిళలతో అసభ్యంగా మాట్లాడుతూ అడియో రికార్డులు బయటకు వచ్చాయి. ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే మహిళలంటే గౌరవం లేకుండా వుంటున్నారు. మహిళా హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో పట్టపగలు ఆడబిడ్డలపై అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా మేకతోటి సుచరిత మొద్దునిద్రలో ఉన్నారు. మహిళలపై జరిగిన దాడిలో ఇప్పటివరకు ఎంతమందికి దిశ చట్టం ద్వారా 21 రోజుల్లో శిక్ష వేశారో ఈ హోంమంత్రి సమాధానం చెప్పాలి. నాడు అన్న నందమూరి తారకరామారావు మహిళలకు ఆస్తిలో సమానహక్కుతో పాటు, మహిళా రిజర్వేషన్లు కల్పించారు. చంద్రబాబు మహిళలంతా ఇంటికే పరిమితం అవకూడదు.. కుటుంబంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా, ఆర్థిక స్వాలంబన సాదించాలని డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు ఇచ్చి కుటిర పరిశ్రమలు ఏర్పాటు చేసి మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దారు. ప్రపంచంలో మహిళలంతా అన్ని రంగాల్లో దూసుకుని పోతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మహిళలు బయటకు రావడానికే భయపడే పరిస్థితులు నెలకొన్నాయిఅని పీతల సుజాత చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-03-08T18:20:55+05:30 IST