పెగాసస్‌ కొనలేదు.. నేను దేశ ద్రోహినా.. నిజాలు తేలాలి..!

ABN , First Publish Date - 2022-03-22T09:01:07+05:30 IST

‘‘పెగాసస్‌ అనే స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను నిఘా విభాగం అధిపతిగా నేను ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగానీ, ప్రైవేటు సంస్థ కానీ కొనుగోలు చేయలేదు.

పెగాసస్‌ కొనలేదు.. నేను దేశ ద్రోహినా.. నిజాలు తేలాలి..!

  • 2019 మే వరకు ఈ సాఫ్ట్‌వేర్‌ వాడలేదు
  • నాడు ఫోన్లు విన్నారనే అభద్రత అక్కర్లేదు
  • సీనియర్‌ ఐపీఎస్‌గా ప్రజలకు ఇదే నా హామీ
  • విష ప్రచారంతో వ్యక్తిత్వ హననానికి యత్నం
  • పైసా ఖర్చు చేయకుండా 25 కోట్ల స్కామా?
  • వైసీపీ నేతలు, జగన్‌ మీడియాపై దావా వేస్తా
  • సీఎ్‌సను కలిసి అందుకు అనుమతి కోరా
  • ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీవీ వెల్లడి
  • దేశానికి సేవచేశా.. దేశద్రోహి అంటున్నారు


‘‘37మందికి డీఎస్పీలుగా పదోన్నతి ఇస్తే 35 మంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారంటూ ఆనాడు ఒకాయన ఆరోపించారు. తాజాగా హోంశాఖ మంత్రి అసెంబ్లీలో చెప్పిన సమాధానంలో అదంతా అబద్ధమని తేలిపోయింది. ఏ తప్పూ చేయని నాపై చేస్తున్న విష ప్రచారం కూడా అటువంటిదే! కొనుగోలు చేయని పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌తో నన్ను  ఎందుకు ముడిపెడుతున్నారో అర్థం కావడం లేదు’’ 


‘‘మూడేళ్లుగా చేయని తప్పును మోస్తున్నాను. ఒక సీనియర్‌ ఐపీఎ్‌సను ఇలా చేస్తే సంక్షోభ సమయాల్లో సమాజం కోసం ఎవరు ధైర్యంగా పనిచేస్తారు? నన్ను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేసేందుకు ప్రయత్నించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆధారాల కోసం వాళ్లు అక్కడ ఎదురు చూస్తున్నా ఇక్కడి నుంచి పంపడం లేదు.అంతేతప్ప నేను వెనుకడుగు వేయలేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగినీ నాలా ఇన్నాళ్లు సస్పెన్షన్‌లో ఉంచరు’’ 

- ఏబీవీ


అమరావతి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ‘‘పెగాసస్‌ అనే స్పైవేర్‌ సాఫ్ట్‌వేర్‌ను నిఘా విభాగం అధిపతిగా నేను ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంగానీ, ప్రైవేటు సంస్థ కానీ కొనుగోలు చేయలేదు. రాష్ట్రంలో 2019మే వరకూ ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ ఏదీ ఉపయోగించలేదని వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రజలకు పూర్తి స్పష్టతని ఇస్తున్నాను’’ అని ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు తెలిపారు. అబద్ధాలు, విష ప్రచారాలతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వైసీపీ నేతలు, జగన్‌ మీడియాపై పరువు నష్టం దావా వేసేందుకు ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు వెల్లడించారు. చంద్రబాబు ప్రభుత్వం పెగాసస్‌ కొనుగోలు చేసిందంటూ రెండు రోజులుగా అధికార పార్టీ చేస్తున్న ప్రచారంపై సోమవారం విజయవాడ ప్రెస్‌ క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. నిఘా విభాగంలో తన హయాంలో పెగాసస్‌ కోసం ఏ కొనుగోళ్లూ జరగకపోయునా, పైసా ఖర్చుపెట్టకపోయినా రూ. 25కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపించి, దానిని ఏదోలా రుద్దేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, ఫోర్జరీకి పాల్పడిన అధికారులపై చర్య తీసుకోవాలని సీఎస్‌ సమీర్‌ శర్మకు విన్నవించినట్లు చెప్పారు.


‘‘అధికార పార్టీ నేతలు, జగన్‌ మీడియా, మరికొందరు రకరకాల ఆరోపణలు నాపై వ్యక్తిగతంగా చేస్తూ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తున్నారు. అదంతా విషప్రచారం. 2021 ఆగస్టులో సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు పెగాసస్‌ కొనుగోలు చేయలేదని ఏపీ డీజీపీ కార్యాలయం రాతపూర్వకంగా స్పష్టం చేసింది. గత ప్రభుత్వంలో పోలీస్‌, ఇంటెలిజెన్స్‌, ఏసీబీ, సీఐడీ.. ఇలా ఏ ఇతర ప్రభుత్వ శాఖలు, ప్రైవేటు సంస్థలూ కొనుగోలు చేయలేదు ప్రస్తుతం సీఎంవో పీఆర్వోగా పనిచేస్తున్న శ్రీహరి నాపై ఆరోపణలు చేశారు. కానీ చార్జిషీట్‌లో ఎక్కడా ఆ విషయాలే పేర్కొనలేదు. ప్రభుత్వ ఉద్యోగిగా ప్రభుత్వ పాలసీ, నిర్ణయాలను తప్పుబట్టే అధికారం నాకు ఉండదు. కానీ..వ్యక్తిత్వ హననానికి గురైన వ్యక్తిగా నిజాలు వెల్లడించే హక్కు ఉంటుంది. దుష్టులు, దుర్మార్గుల నుంచి ముప్పై ఏళ్లుగా ప్రజల్ని కాపాడే ఐపీఎస్‌ అధికారి ఉద్యోగం చేశాను. ప్రజల్ని రక్షించిన నాకే ఇప్పుడు బలయ్యే పరిస్థితి వస్తే రేపు దేశం కోసం ప్రాణాలిచ్చే సైనికులు ఏమవ్వాలి? నాపై వచ్చిన ఆరోపణలు, విచారణలో జాప్యం, సస్పెన్షన్‌ అంశాలపై సీఎ్‌సకు మూడు వినతి పత్రాలనిచ్చాను’’ అని ఏబీ వివరించారు. 


నేను దేశ ద్రోహినా.. నిజాలు తేలాలి.!

సీఎంవో పీఆర్‌వో పూడి శ్రీహరి అర్ధరాత్రి విడుదల చేసిన ఆరు పేజీల అబద్ధాలు, ఆరోపణలు ముగ్గురు అధికారుల విచారణలో ఎక్కడా తేలలేదని, ఎటువంటి స్పైవేర్‌ కొనుగోలు చేయని తాను దేశద్రోహి ఎలా అయ్యానో అర్థం కావడంలేదని ఏబీవీ అన్నారు. ఇటువంటి వాటికి సమాధానం చెప్పాల్సి రావడం దౌర్భాగ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేను తప్పు చేస్తే విచారించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. మూడేళ్లుగా చేయని తప్పునకు భారం మోస్తున్నాను. విచారణ వేగం పెంచి నిజాలు తొందరగా తేల్చాలని సీఎ్‌సను కోరాను. తప్పు చేయని సీనియర్‌ ఐపీఎస్‌ను ఇలా చేస్తే సంక్షోభ సమయాల్లో సమాజం కోసం ఎవరు ధైర్యంగా పనిచేస్తారు? నన్ను సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేసేందుకు ప్రయత్నించి కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. ఆధారాల కోసం వాళ్లు అక్కడ ఎదురు చూస్తున్నా ఇక్కడి నుంచి పంపడం లేదు. అంతేతప్ప నేను వెనుకడుగు వేయలేదు. ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా ఇన్నాళ్లు సస్పెన్షన్‌లో ఉంచరు. తక్షణమే దానిని ఎత్తేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లి స్టే తెచ్చింది. దీనిపై జాప్యం జరగకుండా చూడాలని సీఎస్‌ను కోరాను. విచారణను తప్పుదోవ పట్టించేందుకు నకిలీ డాక్యుమెంట్లతో ఫోర్జరీకి పాల్పడిన వ్యక్తులపైనా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆధారాలు సమర్పించాను. నాపై ఆరోపణలు చేసిన జగన్‌ పత్రిక, మీడియా, వైసీపీ నేతలు అంబటి రాంబాబు, అమర్‌నాథ్‌, అబ్బయ్య చౌదరి, విజయసాయి రెడ్డి, గ్రేట్‌ ఆంధ్ర, పయనీర్‌ మీడియాపై పరువు నష్టం దావా వేసేందుకు అనుమతి కోరాను’’ అని ఏబీవీ తెలిపారు.

 

వైవీ, సజ్జల ఎందుకు తగ్గారు?

ఫోన్లు ట్యాపింగ్‌ చేశారని ఆరోపించి కోర్టులో కేసు వేసిన వైవీ సుబ్బారెడ్డి(టీటీడీ చైర్మన్‌), సజ్జల రామకృష్ణారెడ్డి(ప్రభుత్వ సలహాదారు) ఎందుకు వెనక్కి తగ్గారని ఏబీ వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. ‘‘ఇంటెలిజెన్స్‌ ఛీప్‌గా నేను గతంలో తప్పు చేసి ఉంటే ప్రభుత్వం మారిన తర్వాత వైవీ సుబ్బారెడ్డి కోర్టులో కేసు ఎందుకు విరమించుకున్నారు. సజ్జల కోర్టుకు హాజరు కానందున న్యాయస్థానం కేసును కొట్టేసింది’’ అని పేర్కొన్నారు. జగన్‌ బాబాయి వివేకాహత్యకేసులో తనకు తెలిసిన విషయాలు సీబీఐకి చెప్పానని, దర్యాప్తు కొనసాగుతోందన్నారు.


ఈ మట్టిలోనే పుట్టా..

పెగాసస్‌ రాద్ధాంతంపై శాఖపరమైన విచారణ ఉంటుందని అనుకోవడం లేదని ఏబీవీ అభిప్రాయపడ్డారు. ‘‘దేశ రహస్యాలను ఇతరులకు చేరవేశానని ఆరోపించినవారు.. అందుకు ఆధారాలు చూపించలేకపోయారు. నేను ఎక్కడో నాగాలాండ్‌ నుంచి రాలేదు. ఇక్కడే పుట్టి, ఇక్కడి ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివాను.  తప్పుడు ప్రచారాలపై న్యాయ పోరాటం చేస్తాను’’ ఆయన హెచ్చరించారు. 


‘‘‘మా ఫోన్లలోకి పెగాసస్‌ ప్రవేశించిందా’ అనే అభద్రతాభావం ఎవ్వరూ పెట్టుకోవద్దు. గత ప్రభుత్వంలో పోలీస్‌, ఇంటెలిజెన్స్‌, ఏసీబీ, సీఐడీ.. ఇలా ఏ ఇతర ప్రభుత్వ శాఖలూ, ప్రైవేటు సంస్థలూ కొనుగోలు చేయలేదు. ఒక సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా రాష్ట్ర ప్రజలకు ఈ హామీని ఇస్తున్నాను. ఈ వ్యవహారంలో నాపై ఆరోపణలు చేయడం మాని, నిజానిజాలు నిగ్గుతేల్చాలి’’

Updated Date - 2022-03-22T09:01:07+05:30 IST