పెగాసస్‌పై.. ‘అత్యున్నత’ డీల్‌!

ABN , First Publish Date - 2022-02-02T07:41:05+05:30 IST

పెగాసస్‌ సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలుకు భారత్‌, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య రహస్య ఒప్పందం అత్యున్నత స్థాయిలో జరిగిందని ఇజ్రాయెల్‌ పరిశోధక జర్నలిస్టు....

పెగాసస్‌పై.. ‘అత్యున్నత’ డీల్‌!

భారత్‌, ఇజ్రాయెల్‌ రాజకీయ, నిఘా నాయకత్వాల నడుమ..

ఈ పరిజ్ఞానంపై భారత సారథుల అమితాసక్తి!

చాలా ఏళ్లకు కాంట్రాక్టు!!

మిలియన్ల డాలర్ల చెల్లింపు?

ఇజ్రాయెల్‌ ప్రధాని ప్రత్యక్ష పాత్ర

ఒకేసారి 50 ఫోన్లపై నిఘా!

ఇజ్రాయెల్‌ జర్నలిస్టు రోనెన్‌ 

‘ది వైర్‌’కు ఇంటర్వ్యూ


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పెగాసస్‌ సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలుకు భారత్‌, ఇజ్రాయెల్‌ దేశాల మధ్య రహస్య ఒప్పందం అత్యున్నత స్థాయిలో జరిగిందని ఇజ్రాయెల్‌ పరిశోధక జర్నలిస్టు రోనెన్‌ బెర్జ్‌మన్‌ వెల్లడించారు. 2017లో ఉభయ దేశాల రాజకీయ, నిఘా నాయకత్వాల స్థాయిలో ఈ డీల్‌ కుదిరిందన్నారు. ఈ గూఢచర్య పరిజ్ఞానాన్ని కొనుగోలు చేసేందుకు భారత నాయకత్వం అమితాసక్తి ప్రదర్శించిందని సోమవారం ‘ది వైర్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇజ్రాయెల్‌ నిఘా, మిలిటరీ వ్యవస్థలకు సంబంధించిన వార్తల కవరేజీలో ఎన్నో ఏళ్లుగా బెర్జ్‌మన్‌ పాలుపంచుకుంటున్నారు. పెగాసస్‌ స్పైవేర్‌ను కనుగొన్న ఎన్‌ఎ్‌సవో గ్రూపు 2007లో ఏర్పాటు కాగా.. అప్పటి నుంచి దానిని ఫాలో అవుతున్నారు. ఇజ్రాయెల్‌ సాగించిన రహస్య హత్యలపై ఓ పుస్తకం కూడా రాశారు. 


పెగాసస్‌ రహస్య ఒప్పందంపై గతవారం సంచలనం సృష్టించిన న్యూయార్క్‌ టైమ్స్‌ కథనాన్ని కూడా ఆయన రిపోర్టరు మార్క్‌ మాజెటితో కలిసి రాశారు. టెల్‌ అవీవ్‌లోని తన నివాసం నుంచి బెర్జ్‌మన్‌ జూమ్‌ ద్వారా ‘ది వైర్‌’తో మాట్లాడారు. ఈ రహస్య ఒప్పందానికి సంబంధించి చాలా ఏళ్లకు కాంట్రాక్టు కుదిరిందని.. మిలియన్ల డాలర్ల చెల్లింపులు జరిగాయని తెలిపారు. ‘ఈ పరిజ్ఞానం కింద ఏకకాలంలో నిఘా పెట్టే ఫోన్ల సంఖ్యను బట్టి లైసెన్స్‌ ఫీజు ఉంటుంది. 50 ఫోన్లపై ఒకేసారి నిఘా పెట్టడానికి భారత్‌ కాంట్రాక్టు కుదుర్చుకుంది’ అని తెలిపారు. అయితే ఒప్పందంలో ఏ స్థాయి నేతల ప్రమేయం ఉందో.. ఏ భారతీయ ఏజెన్సీలు ఈ లైసెన్సును పొందాయో ఆయన జవాబివ్వలేదు. ‘నిఘా సంస్థ కోసం పెగాస్‌సను కొనుగోలు చేసి అమర్చి.. ఆ వ్యవస్థను యాక్టివేట్‌ చేయడానికి ఆర్డర్‌ ఇస్తే.. దానిని ఇజ్రాయెల్‌లోని అత్యున్నత అధికారులు డీల్‌ చేయాల్సి ఉంటుంది. సాధారణంగా ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి, జాతీయ భద్రతా సలహాదారు ప్రత్యక్ష ప్రమేయంతో ఇదంతా జరుగుతుంటుంది. అన్నిటికీ మించి మా గూఢచార సంస్థ మొసాద్‌ పాత్ర ఉంటుంది. ఈ వ్యవహారంలో ఇజ్రాయెల్‌ రక్షణ శాఖలోని పలు విభాగాలు, భారత అత్యున్నత అథారిటీ.. భారత నిఘా విభాగం పాలు పంచుకోవలసి ఉంటుంది’ అని బెర్జర్‌ పేర్కొన్నారు.


టెర్రరిస్టులు, నేరగాళ్లపైనే వాడతామని..

‘ఇజ్రాయెల్‌ ఎగుమతి నిబంధనల ప్రకారం.. ప్రతి పెగాసస్‌ కస్టమరూ.. ఉగ్రవాదులు, వ్యవస్థీకృత నేరాలకు వ్యతిరేకంగా మాత్రమే ఆ టెక్నాలజీని వాడతానని హామీ ఇస్తూ ఒప్పందంపై సంతకం చేయాలి. ఇది ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ, వినియోగదారుడి మధ్యే ఉంటుందని సర్టిఫికెట్‌పైనా సంతకం చేయాలి. భారత్‌ తాను మాత్రమే పెగాస్‌సను ఉపయోగిస్తానని మాటివ్వాలి. ఒకవేళ మూడో వ్యక్తికెవరికైనా ఇవ్వాలనుకుంటే ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ నుంచి లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి. ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలపైనే ఆ నిఘా టెక్నాలజీని వాడాలి. వీటన్నిటిపై సంతకాలు పెడితేనే పెగాస్‌సను ఎన్‌ఎ్‌సవో గ్రూపు అమ్ముతుంది’ అని వెల్లడించారు. కాగా.. జర్నలిస్టులు, రాజకీయ నేతలు, మానవ హక్కుల కార్యకర్తలు, కాపలాదారులపై పెగాస్‌సను భారత్‌ ఉపయోగిస్తే దానిని ఒప్పంద ఉల్లంఘనగా ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ పరిగణిస్తుందా అని అడుగగా.. హక్కుల ఉల్లంఘనలకు సంబంధించి చాలా సార్లు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నామని, కానీ రక్షణ శాఖ, డీఈసీఏ సమాధానాలివ్వవని బెర్జర్‌ బదులిచ్చారు.


బారత్‌తో కాంట్రాక్టు ప్రత్యేకతలివీ..

భారత్‌తో పెగాసస్‌ కాంట్రాక్టు ప్రత్యేకతలేమిటని అడుగగా.. ‘భారత్‌కు విక్రయించిన టెక్నాలజీకి నిర్దిష్ట సామర్థ్యం, బ్యాండ్‌విడ్త్‌ ఉన్నాయి. నాకున్న సమాచారం ప్రకారం భారత్‌ ఒకేసారి 10-50 ఫోన్లపై నిఘా పెట్టే అవకాశం ఉంది. దీనిని దాటితే.. ఆపరేటర్‌ మరో ఫోనుపై నిఘాను ఆపాల్సి ఉంటుంది’ అని బెర్జర్‌ వివరించారు.

Updated Date - 2022-02-02T07:41:05+05:30 IST