పెగాసస్‌తో యువత అణచివేత : రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2021-08-05T21:27:28+05:30 IST

భారత దేశ యువత నోరు నొక్కేందుకు పెగాసస్‌ స్పైవేర్‌ను

పెగాసస్‌తో యువత అణచివేత : రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ : భారత దేశ యువత నోరు నొక్కేందుకు పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. యువత ఫోన్లలో ఈ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ను మోదీ ప్రభుత్వం పెట్టిందన్నారు. ఢిల్లీలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గురువారం జరిగిన ‘సంసద్ ఘెరావ్’ నిరసన కార్యక్రమంలో ఆయన ఈ ఆరోపణలు చేశారు. 


‘‘సోదర, సోదరీమణులారా! గుర్తుంచుకోండి, మీ మొబైల్ ఫోనే మీ గళం. మీ మొబైల్ ఫోన్ ద్వారా మీరు కోరుకున్నదానిని వ్యక్తీకరించవచ్చు. మీ ఫోన్లలోపల పెగాసస్‌ను నరేంద్ర మోదీ పెట్టారని మీరు తెలుసుకోవాలి. నా ఫోన్‌లో మాత్రమే కాదు. అసలు ఆలోచన ఏమిటంటే, యువత నిజం మాట్లాడితే, వారి ఫోన్లలో పెగాసస్,  మోదీ ఉంటారు’’ అని రాహుల్ గాంధీ చెప్పారు. ప్రజల గొంతును నొక్కేందుకే పెగాసస్ గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారన్నారు. 


పెగాసస్‌ను ప్రతిపక్షాల నేతలు, పాత్రికేయులు, ఉద్యమకారులపై నిఘా పెట్టేందుకు వాడుతున్నారని ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆరోపణలను బీజేపీ ఖండించింది. 


Updated Date - 2021-08-05T21:27:28+05:30 IST