పెళ్లి బాజా మోగేనా?

ABN , First Publish Date - 2021-04-23T05:25:26+05:30 IST

సుముహుర్తాలకు శుక్ర మూఢమి అడ్డంకిగా కొనసాగుతున్న వేళ..

పెళ్లి బాజా మోగేనా?

వచ్చే నెల ఒకటి నుంచి సుముహూర్తాలు 

ఒక్కటయ్యేందుకు జంటలు సమాయత్తం

ఏర్పాట్లలో నిమగ్నమైన పెద్దలు.. మండపాలకు, భోజనాలకు అడ్వాన్సులు

పొంచివున్న కరోనా గండం.. వెంటాడుతున్న నిబంధనల కత్తి

ఆందోళనలో వధూవరుల కుటుంబాలు

భీమవరం, ఏప్రిల్‌ 22 : సుముహుర్తాలకు శుక్ర మూఢమి అడ్డంకిగా కొనసాగుతున్న వేళ.. 70 రోజుల తర్వాత వచ్చే నెల ఒకటో తేదీ నాటికి వైశాఖ మాసం రాకతో శుభ ఘడియలు రానున్నాయి. రెండు నెలలుగా వందలాది జంటలను కలపడా నికి పెళ్లిళ్ల ముహూర్తాలు పెట్టేసుకున్నారు. ఇప్పుడు ముహూ ర్తానికి ముందే కరోనా వచ్చేసింది. పెళ్లిళ్లు, శుభకార్యాలపై కుటుంబ సభ్యులలో ఆందోళన మొదలైంది. కొవిడ్‌–19 రెండో దశ కారణంగా లాక్‌డౌన్‌కు ముందస్తు చర్యలను గుర్తు చేస్తూ నియమావళి కఠినం చేస్తున్నారు. వారం క్రితమే అన్ని మతా ల ప్రార్థనా మందిరాలలో భక్తుల సంఖ్య పరిమితంగా పాల్గొ నాలని, ఉత్సవాలు, జాతరలలో సంఖ్య 50కి మించకూడదని రెవెన్యూ యంత్రాంగం ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యం లో పెళ్లిళ్లు, శుభకార్యాలు రానున్నాయి. గత ఏడాది ఇదే పరి స్థితులు ఉండటంతో ఎక్కువగా పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నా రు. కొన్ని పరిమితంగా జరిగాయి. ఇప్పుడు ముహూర్తాలు పెద్దఎత్తున పెట్టుకున్నారు. ఈ ఏడాది  జనవరి మూడో వారం నుంచి ముహూర్తాలు లేకపోవడంతో మే ఒకటో తేదీ నుంచి వస్తున్న ముహూర్తాలకు ఎక్కువ జంటలను కలిపే ఏర్పాట్లు చేసుకున్నారు. 


పెళ్లిళ్లకు భారీ ఏర్పాట్లు

జిల్లావ్యాప్తంగా పెళ్లిళ్ల ఏర్పాటుకు లక్షలాది రూపాయలు ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చేశారు. ఫంక్షన్‌ హాళ్లను, పురోహితు లను, మ్యారేజ్‌ ఈవెంట్స్‌ వారిని సిద్ధం చేసుకున్నారు. మం డపాల డేకరేషన్‌లకు అడ్వాన్సులు ఇచ్చారు. అవసరమైన పెళ్లి సామగ్రిని కొనుగోలు చేసుకున్నారు. అందరినీ ఆహ్వానించి అందుకనుగుణంగా భారీగా విందు భోజనాలు ఏర్పాటు చేయ బోతున్నారు. ఇలా మే నుంచి జూన్‌ చివరి వరకు శుభకార్యా లు, గృహ ప్రవేశాలు జరగనున్నాయి. మరి ఇంతలో కరోనా మహమ్మారి ఊపందుకుంది. ఇలాంటి శుభకార్యాలపై జనాన్ని పరిమితం చేయాలని కఠినమైన ఉత్తర్వులు జారీ కావడంతో ఇప్పుడు వఽధూవరుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమ వుతోంది. మరోవైపు హోటల్‌, పెళ్లి మండపాలు, ఈవెంట్‌ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. వారు ఇందుకనుగుణం గా సిబ్బందిని సిద్ధం చేసుకున్నారు. పైగా ఇచ్చిన అడ్వాన్సులు కూడా పెళ్లి వారు వెనక్కి అడిగే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యను కుదిస్తే ఉపాధిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


దేవుడిపైనే భారం వేశాం

వచ్చే నెల ఐదో తేదీన భీమవరంలో మా అబ్బాయి పెళ్లి పెట్టుకున్నాం. బంధువులకు, స్నేహితులకు శుభలేఖలు పంపిం చాం. పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. కల్యా ణ మండపం, వంటకాలు, ఇతర సౌకర్యాల కోసం డబ్బు అడ్వాన్స్‌లు ఇచ్చేశాం. ఇప్పుడు కరోనా వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలని దేవుడిపైనే భారం వేసి ప్రార్థిస్తున్నాం.

 మల్లువలస వాణి, పెళ్లి కుమార్తె తల్లి, భీమవరం


ఆందోళన కలిగిస్తోంది

గత ఏడాది ముహూర్తాలు పెట్టించుకు న్నా చాలామంది కరోనాతో పెళ్లిళ్లు చేసుకోలేదు. ఈ ఏడాది ముహూర్తాలు బాగానే ఉన్నాయని చాలామంది వివాహాలకు సిద్ధమైన తరుణంలో మళ్లీ కరోనా ఆందోళన కలిగిస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు వెళ్లాలి. 

కొత్తపల్లి సూర్యప్రకాష్‌, పురోహితుడు, భీమవరం


Updated Date - 2021-04-23T05:25:26+05:30 IST