UAE లో ఇకపై అలా చేయడం నేరం.. రూ.1కోటి వరకు జరిమానా!

ABN , First Publish Date - 2022-01-30T14:23:05+05:30 IST

యూఏఈ పౌరులతో పాటు నివాసితుల వ్యక్తిగత సమాచారం సేకరణ విషయమై ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్(పీపీ) తాజాగా కీలక ప్రకటన చేసింది.

UAE లో ఇకపై అలా చేయడం నేరం.. రూ.1కోటి వరకు జరిమానా!

అబుధాబి: యూఏఈ పౌరులతో పాటు నివాసితుల వ్యక్తిగత సమాచారం సేకరణ విషయమై ఆ దేశ పబ్లిక్ ప్రాసిక్యూషన్(పీపీ) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఇకపై ఎవరైనా చట్ట విరుద్ధంగా ఎమిరేటీల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తే కఠిన చర్యలు ఉంటాయని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ శనివారం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. చట్టాలకు విరుద్ధంగా వ్యక్తిగత డేటా, సమాచారాన్ని సేకరించడం మరియు ప్రాసెస్ చేయడం నేరంగా పరిగణించబడుతుందని పేర్కొంది. నెట్టింట జరిగే రూమర్స్, సైబర్‌క్రైమ్స్‌ను ఎదుర్కొవడం కోసం 2021లో తీసుకువచ్చిన ఫెడరల్ డిక్రీ చట్టం నం.34లోని ఆర్టికల్ 13 ప్రకారం 50వేల దిర్హమ్స్(రూ.10.21లక్షలు) నుంచి 5లక్షల దిర్హమ్స్(సుమారు రూ.1కోటి) వరకు జరిమానా ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే జైలు శిక్షలు కూడా ఉంటాయని పేర్కొంది. కొన్ని సందర్భాల్లో ఈ రెండు సైతం అమలు చేయడం జరుగుతుందని తెలిపింది. 


ఇక ఈ చట్టం ప్రకారం.. దేశంలో అమలులో ఉన్న చట్టానికి విరుద్ధంగా దేశ పౌరులు, యూఏఈ నివాసితులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారం, డేటాను సేకరించి ప్రాసెస్ చేయడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగించే వారు నేరస్తులుగా పరిగణించబడతారు. వారు శిక్షార్హులు అవుతారు. వారికి ఈ కఠిన జరిమానాలు, జైలు శిక్ష అమలు చేయడం జరుగతుంది. సమాజంలోని సభ్యులలో చట్టపరమైన సంస్కృతిని పెంపొందించడానికి, దేశంలోని తాజా చట్టాల గురించి వారిలో అవగాహన కలిగించడానికి పబ్లిక్ ప్రాసిక్యూషన్ చేపడుతున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

Updated Date - 2022-01-30T14:23:05+05:30 IST