దండం పెడతా.. వచ్చి కూర్చోండి

ABN , First Publish Date - 2022-06-29T08:17:54+05:30 IST

దండం పెడతా.. వచ్చి కూర్చోండి

దండం పెడతా.. వచ్చి కూర్చోండి

ప్లీనరీలో విప్‌ కాపు రామచంద్రారెడ్డి వేడుకోలు

మంత్రి పెద్దిరెడ్డిపై ఎమ్మెల్యే సోదరుడి ఫైర్‌


అనంతపురం క్రైం, జూన్‌ 28: ‘మీకు దండం పెడతా. దయ చేసి బయట ఉండకుండా లోపలికి వచ్చి సీట్లలో కూర్చోండి..’ అని ప్రభుత్వ విప్‌, వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి సొంత పార్టీ నాయకులను బతిమాలారు. మంగళవారం అనంతపురం వైసీపీ ప్లీనరీ జరిగినంతసేపూ కాపు ఇలా తంటాలు పడుతూ కనిపించారు. అనంతపురం జిల్లా కేంద్రం సమీపంలోని శిల్పారామంలో వైసీపీ జిల్లా ప్లీనరీని మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరయ్యారు. ప్లీనరీలో ప్రజాప్రతినిధులు మాట్లాడుతున్న సమయంలోనే అక్కడక్కడా సీట్లు ఖాళీగా కనిపించాయి. ప్లీనరీకి హాజరైన నాయకులు సమావేశపు హాల్‌ పక్కనున్న చెట్ల కింద సేదతీరడానికి వెళ్లారు. కాపు రామచంద్రారెడ్డి వేదిక దిగి వచ్చి బయట ఉన్నవారిని లోపలికి వచ్చి కూర్చోవాలని వేడుకున్నారు. ఇక, ‘ఎమ్మెల్యేలకు ఏం పవరుంది..? కనీసం ఆర్డీవో, డీఎస్పీలను వేయించుకోలేకపోతున్నారు’ అంటూ రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి సోదరుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌ రెడ్డి ప్లీనరీలో అసంతృప్తి వ్యక్తంచేశారు. జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఈ విషయమై ఆయన ఒకదశలో నిలదీశారు కూడా. ప్లీనరీ ప్రారంభం కాగానే నాయకులందరూ వేదికపైకి వచ్చారు. ఈ సమయంలో కింద నుంచి మైక్‌ తీసుకుని చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడారు. పార్టీకి మద్దతుగా కార్యకర్తలు, ప్రజలు ఉన్నారని, అయినా ఈ రోజు పార్టీ అన్యాయమైపోతోందని వ్యాఖ్యానించారు. వీటన్నింటిపై సమీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. 


Updated Date - 2022-06-29T08:17:54+05:30 IST