అగమ్యగోచరం

ABN , First Publish Date - 2022-08-14T06:06:16+05:30 IST

అగమ్యగోచరం

అగమ్యగోచరం
అస్తవ్యస్తంగా కౌతవరం-ఐలూరు-నిడుమోలు రహదారి

ముందుకు కదలని 13 రోడ్ల విస్తరణ పనులు 

ఎన్‌డీబీ రోడ్‌ మ్యాప్‌ ప్రకారం జరగని పనులు 

నిధులున్నా.. పట్టించుకోని సబ్‌ కాంట్రాక్టర్లు

ఏడాదిన్నర అయినా ఒక పనీ లేదు

ఇంకా గడువు ఏడు నెలలే..


రెండు జిల్లాల్లో 13 ఆర్‌ అండ్‌ బీ రోడ్ల విస్తరణ పనులు అగమ్యగోచరంగా మారాయి. ఎన్‌డీబీ నిధులున్నా.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్య వైఖరితో ఏడాదిన్నర అవుతున్నా ఒక్కటంటే ఒక్క రోడ్డు పని కూడా మొదలు కాలేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. అధికారుల అలసత్వం.. వెరసి కీలకమైన రోడ్లు ఇంకా అస్తవ్యస్తంగానే ఉన్నాయి.


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉమ్మడి కృష్ణాజిల్లాలోని 13 ఆర్‌అండ్‌బీ రోడ్ల విస్తరణ పనులకు ఏడాదిన్నర కిందట అనుమతిచ్చారు. నేషనల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఎన్‌డీబీ) ఆర్థిక సహకారం రూ.234 కోట్లతో పిలిచిన టెండర్లు అపహాస్యంగా మారాయి. పనుల పూర్తికి ఇంకా ఏడు నెలలే గడువు ఉండగా, ఇప్పటి వరకు జరిగిన పనులు శూన్యం. ఆర్‌అండ్‌బీ అధికారులు సమావేశాలు నిర్వహించి ఒత్తిడి చేస్తున్నా కాంట్రాక్టర్‌ నుంచి స్పందన లేదు. 

రోడ్డు టెండర్లు ఇవీ..

ఏడాదిన్నర కిందట ఉమ్మడి కృష్ణాజిల్లాగా ఉన్నప్పుడు జిల్లాలో ప్రధానమైన 13 ఆర్‌అండ్‌బీ రోడ్ల విస్తరణకు టెండర్లు పిలిచారు. మచిలీపట్నం-కల్లూరు రోడ్డు, చెవిటికల్లు-వత్సవాయి రోడ్డు, నూజివీడు-ఏలూరు రోడ్డు, గన్నవరం-పుట్టగుంట రోడ్డు, మధిర-కంచికచర్ల రోడ్డు, నూజివీడు-గన్నవరం రోడ్డు, కందులపాడు-గంగినేని-ఎర్రుపాలెం రోడ్డు, నందిగామ-పొక్కునూరు రోడ్డు, కౌతవరం-నిడుమోలు-ఐలూరు రోడ్డు, తేలప్రోలు-ఉయ్యూరు-వల్లూరు రోడ్డు, నడుపూరు-వాడవల్లి-కోరుకొల్లు, మంటాడ-లంకపల్లి రోడ్డు, మచిలీపట్నం కమ్మవారి చెరువు వయా చిన్నాపురం రోడ్లను విస్తరించాల్సి ఉంది. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానమవుతాయి. సింగిల్‌ లేన్‌గా ఉన్న ఈ రోడ్లను డబుల్‌ లేన్‌గా విస్తరించటానికి టెండర్లు పిలిచారు.

గంపగుత్తగా బడా సంస్థకు..

రోడ్ల విస్తరణకు ఎన్‌డీబీ ఆర్థిక సహకారం అందిస్తోంది. బిల్లులు రావన్న భయం లేదు. ప్రత్యేక ఎస్ర్కో అకౌంట్‌కు నిధులు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో బడా కాంట్రాక్టు సంస్థకు అప్పగిస్తే పనులు త్వరగా అవుతాయని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులు నిర్ణయించారు. టెండర్లు పిలిచి.. ఉమ్మడి జిల్లాలో 13 రోడ్ల పనులను గంపగుత్తగా వృద్ధి కన్‌స్ట్రక్షన్స్‌కు అప్పగించారు. 

అడుగడుగునా ఆలస్యం.. సబ్‌ కాంట్రాక్టర్‌కు అప్పగింత..

బడా కాంట్రాక్టు సంస్థగా టెండర్‌ దక్కించుకున్న వృద్ధి కన్‌స్ట్రక్షన్స్‌ పనులు చేయకుండా, సబ్‌ కాంట్రాక్టుకు ఇచ్చి చేతులు దులుపుకొంది. దీంతో సబ్‌ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యంగా మారింది. ఎన్‌డీబీ నిర్దేశిస్తున్న ప్రమాణాలు, సాంకేతిక అంశాలు, అలైన్‌మెంట్స్‌ వంటివి సబ్‌ కాంట్రాక్టర్లకు నచ్చలేదు. దీంతో పనులు చేపట్టలేదు. ఫలితంగా రెండు జిల్లాల్లో ప్రజాప్రతినిధులు రోడ్లకు ఆర్భాటంగా శంకుస్థాపనలు చేశారు కానీ, ఒక్కటంటే ఒక్క రోడ్డు పనులు కూడా పూర్తికాలేదు. పనులు పూర్తికావడానికి వచ్చే మార్చి నెల గడువు. ఈ ఏడు నెలల్లో పనులు పూర్తవుతాయో లేదో ప్రశ్నార్థకమే. అయితే, సబ్‌ కాంట్రాక్టర్లపై ఎన్‌డీబీ ఉపేక్షిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. నోటీసు కూడా ఇవ్వకపోగా, కాంట్రాక్టు రద్దుకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 


నెలలో పురోగతి చూపిస్తాం..

ఉమ్మడి జిల్లాలో 13 రోడ్లకు టెండర్లు పిలిచాం. వీటిలో కనీసం 8 రోడ్ల పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. నెల రోజుల్లో పురోగతి కనిపిస్తుంది. కాంట్రాక్టర్లతో మేము మాట్లాడుతున్నాం. ఒక్కొక్కటి గా పరిష్కరించుకుంటూ వస్తున్నాం. - శ్రీనివాసమూర్తి, ఎస్‌ఈ ఆర్‌అండ్‌బీ సర్కిల్‌ 






Updated Date - 2022-08-14T06:06:16+05:30 IST