పెన్షన్‌..టెన్షన్‌

ABN , First Publish Date - 2020-08-09T10:26:05+05:30 IST

సకాలంలో పింఛన్‌ అందక రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్య, వైద్య, సంక్షేమం, వ్యవసాయం ఇలా వివిధ ..

పెన్షన్‌..టెన్షన్‌

సకాలంలో జమకాని వైనం..

ఆందోళనలో రిటైర్డ్‌ ఉద్యోగులు..


అనంతపురం అర్బన్‌, ఆగస్టు 8: సకాలంలో పింఛన్‌ అందక రిటైర్డ్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్య, వైద్య, సంక్షేమం, వ్యవసాయం ఇలా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందిన వారు జిల్లాలో  13 వేల మందికి పైగా ఉన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీన వారి ఖాతాలో పింఛన్‌ జమ కావాల్సి ఉంది. అయితే నెల లో రెండు వారాలు గడిచినా పింఛన్‌ రాని దుస్థితి నెలకొంది. దీంతో వైద్యం, ఇంటి అద్దె, కిరాణా సరుకులు, కరెంట్‌ బిల్లు తదితర ఖర్చులకోసం ఇతరులపై ఆధార పడాల్సి వస్తోంది. వృద్ధాప్యంలో ఇతరుల సహాయం లేనిదే కాలుకూడా కదపనిలేనివారు ఎందరో ఉన్నారు. వీరంతా సకాలంలో పెన్షన్‌ రాకపోవడంతో అవసరాలకు చేతిలో డబ్బులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


పింఛన్‌లోనూ 50 శాతం కోత

కరోనాతో ఆదాయం తగ్గిందని ప్రభుత్వం మార్చినెలలో పింఛన్‌దారులకు చెల్లించే మొత్తంలో 50శాతం కోత విధించింది. లాక్‌డౌన్‌ను సాకుగా చూపుతూ ప్రభుత్వం వృద్ధుల సొమ్మును జమ చేసుకోవడం ఏంటని బాధితులు వాపోతున్నారు. షుగర్‌, బీపీ వంటి అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఒకరోజు మందులు వా డకుంటే ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లే ప్రమాదం ఉంది. నెలనెలా వచ్చే పెన్షన్‌తోనే మందులు కొనుగోలు చేయాలి. ప్రభుత్వం 50శాతం కోత విధించడంతో అవసరాలకు డబ్బు సరిపోక ఇతరులపై ఆధారపడాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. పెన్షనర్ల ఆందోళనలతో వెనక్కు తగ్గిన ప్రభుత్వం ఆ మొత్తాన్ని జమచేస్తామని హామీని చ్చింది. అయితే నాలుగు నెలలు కావస్తున్నా ఆ హామీ అమలు కాలేదు. 


సకాలంలో చెల్లించాలి : పెద్దన్న గౌడ్‌, జిల్లా పెన్షనర్ల సంఘం అధ్యక్షుడు.

ప్రతినెలా సకాలంలో పెన్షన్‌ చెల్లించాలి. ప్రస్తుతం పెన్షన్‌ ఎప్పడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. వారాల తరబడి ఆలస్యం చేస్తుండటంతో ఆనారోగ్యంతో బాధపడుతున్న వారు వైద్యంకోసం ఇతరులను అడుక్కో వాల్సి వస్తోంది. పెన్షనర్లను ప్రభుత్వం విస్మరించడం సరికాదు. ఒకటో తేదీనే పెన్షన్‌ను ఖాతాల్లో జమచేయాలి.

Updated Date - 2020-08-09T10:26:05+05:30 IST