జనవరి నుంచి అందని పెన్షన, గ్రాట్యుటీ

ABN , First Publish Date - 2022-06-25T05:42:44+05:30 IST

ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

జనవరి నుంచి అందని పెన్షన, గ్రాట్యుటీ
ఎస్కేయూ ముఖద్వారం


  కుటుంబ పోషణ కోసం అవస్థలు

 కూలి పనులకు వెళ్తున్న రిటైర్డ్‌ ఉద్యోగులు

 నేటికీ విడుదల కాని ఆర్థిక ప్రయోజనాలు 

  ప్రభుత్వ తీరుపై ఎస్కేయూ, జేఎనటీయూ ఉద్యోగుల మండిపాటు

అనంతపురం సెంట్రల్‌, జూన 23: ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్‌మెంట్‌ బెనిఫిట్స్‌ అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  జనవరి నుంచి ఉద్యోగ విరమణ పొందిన ఎస్కేయూ, జేఎనటీయూ ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు చెల్లించలేదు. ఉద్యోగ విరమణ ఉత్తర్వులు వారి చేతుల్లోపెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుంటోంది. కనీసం పెన్షనకూడా ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణకోసం బాధితులు కూలి పనులకు వెళ్తున్నారు. వయసుమీద పడి ఉద్యోగ విరమణ పొందిన అనంతరం ప్రశాంతమైన జీవితాన్ని గడపాల్సిన వారు ప్రభుత్వ నిర్వాకంతో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారు. భవిష్యత్తులో తమ పరిస్థితీ ఇలాగే ఉంటుందేమోనని ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు వాపోతున్నారు.  సమయానికి జీతాలు చెల్లించలేని రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ విరమణ పొందిన వారికి ఆర్థిక సాయాన్ని ఇవ్వాల్సి వస్తోందని భావించి రిటైర్డ్‌మెంట్‌ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. అయితే సమగ్రమైన ఉత్తర్వులు జారీచేసి అమలుచేయలేని ప్రభుత్వం జనవరి నుంచి ఉద్యోగ విరమణ పొందిన వారిని గాల్లోపెట్టిందని మండిపడుతున్నారు. యథావిధిగా కొనసాగించి జీతాలైనా ఇవ్వాలి. లేకుంటే  రిటైర్డ్‌మెంట్‌ చేసి పెన్షన అయినా చెల్లించాలి. అయితే ఇవేమిచేయకుండానే ప్రభుత్వం తమ జీవితాలను దుర్భర పరిస్థితుల్లోకి నెట్టిందని బాధితులు మండిపడుతున్నారు. 


కూలి పనులకు వెళ్తుతున్న బాధితులు...

వేతనం ఆధారంగా గృహ, వాహణ, విద్య తదితర వాటికోసం రుణాలు పొందిన వారు ప్రతినెలా కంతులు చెల్లించాల్సి ఉంటుంది. ఖాతాలో నెల జీతం జమకాగానే రుణ మొత్తాలను సంబంధిత సంస్థలు కట్‌ చేసుకుంటాయి. అయితే వేతనం, పెన్షన ఏదీ రాకపోవడంతో రుణాల వడ్డీలు పెరిగిపోయి భారంగా పరిణమిస్తున్నాయి. అయితే వర్సిటీల్లో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తరువాత పెన్షన రాకవపోడంతో చాలామంది బాధితులు కూలి పనులకు వెళ్తున్నారు. కనీసం పెన్షన అయినా చెల్లిస్తే రుణ కంతులు పోనూ మిగిలిన మొత్తంతో కుటుంబాన్ని పోషించుకోవచ్చునని పేర్కొంటున్నారు.  


వర్సిటీ ఉద్యోగులపై ప్రభుత్వం వివక్ష

వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు నుంచి తమపై వివక్ష చూపుతోందని వర్సిటీల ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి. మూడేళ్లలో వరుసగా ఏ ఆరు నెలలు ఒకటో తేదీన ప్రభుత్వం జీతాలను తమ ఖాతాల్లో జమచేసిన పాపాన పోలేదని వాపోతున్నాయి. నెలల తరబడి జీతాలు తీసుకోని కాలాన్ని చరిత్రలో తొలిసారిగా చూస్తున్నామంటూ పేర్కొంటున్నాయి. ఉద్యోగులకు వేతనాలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆర్థిక సంవత్సరానికి బ్లాక్‌గ్రాంట్‌ రూపంలో నిధులు కేటాయిస్తుంది. త్రైమాసికం ప్రకారం విభజించి నాలుగు దఫాలుగా బ్లాక్‌గ్రాంట్‌ నిధులు జమచేయాలి. ఒక త్రైమాసికానికి సంబంధించిన నిధులు ఖాళీ అయితే ప్రభుత్వం చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా సమయానికి జమజేయడంలేదు. పీఆర్సీ పెంపు విషయంలోనూ అదే నిర్లక్ష్యం. ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరికి జనవరిలోనే చెల్లిస్తే వర్సిటీల ఉద్యోగులకు మాత్రం రెండు నెలలు ఆలస్యం చేసింది. ఇలా ప్రతివిషయంలో వర్సిటీలపట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఉద్యోగ వర్గాలు విమర్శిస్తున్నాయి.


ఆర్థిక భారాన్ని మోయలేకనే...

రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక భారాన్ని మోయలేకనే ఉద్యోగ విరమణ వయసు పెంపు అమలు చేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగికి రూ.10 లక్షల నుంచి రూ.13లక్షలు గ్రాట్యుటీ, దాదాపు పది నెలల జీతం లీవ్‌ ఎనకా్‌షమెంట్‌ రూపంలో రూ.10లక్షలు వరకు, జీపీఎప్‌ ద్వారా పొదుపుచేసుకున్న మొత్తంలో అవసరాలకు డ్రాచేసుకుని మిగిలిన మొత్తం. ఇలా రూ.30 లక్షల నుంచి రూ.50లక్షల వరకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది. సమయానికి వేతనాలివ్వలేని రాష్ట్ర ప్రభుత్వం పెద్దమొత్తంలో ఆర్థిక భారాన్ని మోయలేకనే వయసు పెంపు తెరమీదకు తీసుకువచ్చిందని ఉద్యోగ వర్గాలు మండిపడుతున్నాయి.


వయసు పెంపు అమలు ఉంటుందా...?

వర్సిటీల అధికారుల మేరకు.. స్టేట్‌ యూనివర్సిటీస్‌ అయిన ఎస్కేయూ, జేఎనటీయూ పాలన  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్తాధ్వర్యంలో కొనసాగుతోంది. టీచింగ్‌ ఫ్యాకల్టీ ఉద్యోగ విరమణ వయసు పెంపు, జీతాలు తదితర సంక్షేమాన్ని నిబంధనల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. బోధనేతర ఉద్యోగులు, సిబ్బందికి సంబంధించిన మొత్తం వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వానిదే. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అన్ని ప్రభుత్వ శాఖలు నేరుగా అమలుచేయవచ్చు. అయితే వర్సిటీలకు ఆ వెసులుబాటులేదు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ప్రతి జీఓను వర్సిటీల పాలకమండలి చర్చించి, అడాప్ట్‌ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే జీఓలలో కాపీ టూ ఆల్‌ యూనివర్సిటీస్‌ రిజిస్ర్టార్‌ అనే పదాన్ని చేర్చడంలేదు. అదేవిధంగా రాష్ట్ర ఉన్నత విద్యశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వ ఉత్తర్వులను వర్సిటీలకు అనుగుణంగా అమలు చేయడంలేదు. ఈ నేపథ్యంలో జీతాలు, పీఆర్సీ, ఉద్యోగ విరమణ వయసు పెంపు వంటి అంశాల్లో తీవ్ర జాప్యం నెలకొంటోంది. ఇందులో భాగంగా ఉద్యోగ విరమణ వయసుపెంపు జీఓను వర్సిటీలకు అడ్‌ప్డచేసి అమలు చేస్తారా లేదా అన్న అనుమానాలను ఉద్యోగ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.


ఈ నెలాఖరుకు మరో 20మంది రిటైర్డ్‌

వర్సిటీల్లోని వివిధ విభాగాల్లో టెక్నికల్‌, నాన టెక్నికల్‌ ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. నాన టెక్నికల్‌ విభాగాల్లో స్వీపర్‌, గార్డనర్‌, జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు, సూపరింటెండెంట్‌, అసిస్టెంట్‌ రిజిస్ర్టార్‌, డిప్యూటీ రిజిస్ర్టార్‌, ఫైనాన్స ఆఫీసర్‌ ఇలా కేడర్ల వారిగా వందలాదిమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఫిట్టర్‌, ఎలక్ర్టీషియన, మెకానిక్‌, టెక్నీషియన వంటి కేడర్ల ద్వారా టెక్నికల్‌ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఎస్కేయూ, జేఎనటీయూలో జనవరి నుంచి మే వరకు వివిధ కేడర్లనుంచి దాదాపు 15మంది ఉద్యోగ విరమణ పొందారు. ఈనెల 30న మరో 20మంది ఉద్యోగులు రిటైర్డ్‌ కాబోతున్నారు. 


Updated Date - 2022-06-25T05:42:44+05:30 IST