పింఛన్‌.. తుంచెన్‌

ABN , First Publish Date - 2022-08-03T05:29:20+05:30 IST

గంట్యాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఓ దివ్యాంగుడు రెవెన్యూ శాఖలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఉద్యోగం ఉందన్న కారణంతో ఆగస్టు 1నుంచి రూ.3వేల పింఛను నిలిపేశారు. ఇదే కుటుంబంలోని తన తల్లి వృద్ధాప్య పింఛను సైతం నిలిపేశారు. దీంతో ఆమె లబోదిబోమంటోంది. ఈ వయసులో తమను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమంటూ వాపోతోంది.

పింఛన్‌.. తుంచెన్‌
పింఛను తొలగిన ఓ లబ్ధిదారునికి వచ్చిన మేసెజ్‌


చిరుద్యోగుల కుటుంబాలపై సర్కారు కన్నెర్ర
పెన్షన్‌ తొలగించి రోడ్డున పడేసిన వైనం
లబోదిబోమంటున్న లబ్ధిదారులు


- గంట్యాడ మండలం సిరిపురం గ్రామానికి చెందిన ఓ దివ్యాంగుడు రెవెన్యూ శాఖలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఉద్యోగం ఉందన్న కారణంతో ఆగస్టు 1నుంచి రూ.3వేల పింఛను నిలిపేశారు. ఇదే కుటుంబంలోని తన తల్లి వృద్ధాప్య పింఛను సైతం నిలిపేశారు. దీంతో ఆమె లబోదిబోమంటోంది. ఈ వయసులో తమను ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం అన్యాయమంటూ వాపోతోంది.
- మెంటాడ మండల కేంద్రానికి చెందిన తోండ్రంకి రామాయమ్మ కొన్నేళ్లుగా వితంతు ఫించను పొందుతోంది. తాజాగా పింఛను తీసుకునేందుకు డివైస్‌పై వేలి ముద్ర వేశాక ‘మీ ఇంట్లో రూ.12వేలు పైబడి జీతం పొందే కుటుంబ సభ్యుడున్న కారణంగా పింఛను తొలగించాం’ అని సమాచారం వచ్చింది. దీనికి కారణం ఈమె కుమారుడు మోడల్‌ స్కూల్లో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
 - పూసపాటిరేగ మండలం కొప్పెర్ల పంచాయతీలో పొట్నూరు సన్యాశికి దివ్యాంగ పింఛను వస్తోంది. ఈ నెలలో  నిలిపేసినట్లు మెసేజ్‌ వచ్చింది. కారణం కొల్లాయివలసలో ఈయన కుమార్తె మహిళా పోలీస్‌గా పనిచేయడమే.
- పూసపాటిరేగ మండలం పాతకొప్పెర్ల గ్రామానికి చెందిన తెలుగు చీకటయ్యకు వికలాంగ పింఛను వస్తోంది. ఈనెలలో నిలిపేశారు. ఈయన భార్య గురుకుల పాఠశాలలో అవుట్‌ సోర్సింగ్‌లో చిరుద్యోగిగా పనిచేస్తున్నారన్నది కారణం.

(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
చిరుద్యోగులపై ప్రభుత్వం కత్తి కట్టింది. రూ.10వేలు పైబడి జీతం వస్తోందన్న కారణం చూపి ఆయా కుటుంబాల్లోని సామాజిక పింఛన్లను నిలిపేసి వేదనకు గురిచేస్తోంది. పండుటాకులపైనా దయ చూపలేదు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది చిరుద్యోగుల కుటుంబ సభ్యులు పింఛన్ల తొలగింపుపై ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఈ నెలలో సుమారు 2500 పింఛన్ల వరకు తొలగించినట్లు సమాచారం. ఈ సంఖ్య నిర్దిష్టంగా తెలియడం లేదు. డీఆర్‌డీఏ పీడీలకు కూడా సమాచారం లేదంటున్నారు. వలంటీర్లకు మాత్రమే ఇంచుమించుగా తెలుసుకునే పరిస్థితి ఉంటోంది. వీరికి కూడా ముందుగా సమాచారం లేదు. పింఛన్‌ డివైస్‌ పట్టుకుని పంపిణీకి వెళ్లినప్పుడు లబ్ధిదారుని వేలి ముద్ర తీసుకున్నాక వలంటీర్‌ సెల్‌కు మెసేజ్‌ వస్తోంది. ఇది చూసి లబ్ధిదారుల్లో దడ మొదలవుతోంది. ఇలా చెల్లింపులకు వలంటీర్‌ వెళ్లే వరకు వారికి కూడా సమాచారం ఉండటం లేదు. అంతా రాష్ట్ర స్థాయిలోనే తొలగింపులు జరిగినట్లు చెబుతున్నారు. సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ ద్వారా జీతాలు పొందుతూ రేషన్‌ కార్డు, ఆధార్‌, ఈకేవైసీ అనుసంధానం కారణంగా చిరుద్యోగుల కుటుంబాల్లోని లబ్ధిదార్లకు నష్టం జరుగుతోంది.
వేరే కార్డు ఉంటే...
జిల్లాల్లో వేల సంఖ్యలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నత స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నవారు ఉన్నారు. 10ఎకరాలు పైబడిన భూ స్వాములున్నారు. కాని సంబంధిత ఉద్యోగుల కుటుంబ సభ్యుల రేషను కార్డు నుంచి తొలగింపులు చేసుకుంటున్నారు. వేరే రేషను కార్డులు పొందుతున్నారు. దీంతో తల్లిదండ్రులకు ఒక కార్డు, పిల్లలకు వేర్వేరు కార్డులు ఉంటున్నాయి. ఒకే కుటుంబంలో ఉన్న కొంత మందికి నాలుగు రేషన్‌కార్డులు ఉంటున్నాయి. ఇలా తెలివిగా వ్యవహరించే వారు వేరే రేషను కార్డున్న కారణంగా ఎంతటి కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులైనప్పటికీ వారి కుటుంబ సభ్యులు దర్జాగా పింఛన్లు పొందుతున్నారు. లక్షల్లో జీతం పొందుతున్న కుటుంబాల్లో కూడా వేరే రేషను కార్డున్న కారణంగా వారికి సంబంధించిన వ్యక్తులకు సామాజిక పింఛను అందుతోంది. అమాయకులైన వారి కుటుంబాల్లో మాత్రం నష్టపోతున్నారు.


ఎన్ని అనేది తెలియదు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.10వేలు పైబడి జీతం పొందే కుటుంబానికి సంక్షేమ పథకాలు వర్తించవు. ప్రస్తుతం ఆధార్‌, పాన్‌ లింకేజీతో సీఎఫ్‌ఎమ్‌ఎస్‌ విధానంలో జీతాల చెల్లింపులు జరుగుతున్నాయి. ఎవరికి ఎంత జీతం అందుతున్నదీ సునాయాసంగా తెలిసిపోతోంది. అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు రూ.12వేలు మించి జీతం పొందుతున్నారు. ఇటువంటి వారి కుటుంబాలకు చెందిన సామాజిక పింఛన్లు ఆటోమెటెక్‌గా తొలగిపోతాయి. ఎన్ని తొలగాయన్నది నిర్దిష్టమైన లెక్కలు లేవు.
                                        - కల్యాణ్‌ చక్రవర్తి, పీడీ, డీఆర్‌డీఏ, విజయనగరం.

 

Updated Date - 2022-08-03T05:29:20+05:30 IST