పెన్షన్‌.. టెన్షన్‌!

ABN , First Publish Date - 2021-07-24T06:56:02+05:30 IST

నగరానికి చెందిన మేకా నీరజ (45) ఒంటరిగా జీవిస్తోంది.

పెన్షన్‌.. టెన్షన్‌!

ఒంటరి మహిళల పింఛన్‌ రీ వెరిఫికేషన్‌ 

కొత్త నిబంధనల పేరుతో లబ్ధిదారులకు ఇబ్బందులు 

స్పందన అర్జీలకు పరిష్కారం లేదు 

వార్డు, గ్రామ సచివాలయాలకు లాగిన్‌ ఇవ్వకపోవడమే కారణం

నగరంలో రెండు వేలు, జిల్లాలో ఆరు వేలకు పైగా పెండింగ్‌ 


నగరానికి చెందిన మేకా నీరజ (45) ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఏడాది క్రితం ఒంటరి మహిళ పెన్షన్‌ కోసం స్పందనలో దరఖాస్తు చేసుకుంది. ఇప్పటి వరకు ఆమె దరఖాస్తును పరిశీలించలేదు.  ఆమె సచివాలయానికి వెళ్లి అడిగితే.. స్పందనలో పెండింగ్‌లో ఉంది కనుక మేమేమీ చేయలేమని చెబుతున్నారు. నీరజ వంటి ఒంటరి మహిళలతో పాటు ఎందరో వృద్ధులు స్పందనలో దరఖాస్తు చేసుకున్నా అవన్నీ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. 

 

జిల్లాకు చెందిన వాణి గత 10 నెలలుగా ఒంటరి మహిళ పెన్షన్‌ తీసుకుంటోంది. రీ వెరిఫికేషన్‌లో ఆమె రేషన్‌, ఆధార్‌ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లు ఉన్నాయని అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆమె భర్త వెళ్లిపోయాడు. ఆమె ఆలనాపాలనా పిల్లలు చూడటం లేదు.  రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డుల్లో పేర్లను తొలగించుకునే అధికారం యజమానికి మాత్రమే ఉంది. ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఆమె ఉంది. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ)  : ప్రజా సమస్యల పరిష్కార వేదికగా చెప్పుకుంటున్న స్పందనలో వస్తున్న అర్జీలపై ప్రభుత్వం స్పందిస్తున్న తీరుకు ఇవే నిదర్శనాలు. స్పందన అర్జీల వెరిఫికేషన్‌ లాగిన్‌ను గ్రామ, వార్డు సచివాలయాలకు ఇవ్వకపోవటం వల్ల చాలా అర్జీలు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. రాజకీయ సిఫార్సులు, సచివాలయాల్లో నిర్వాకాల కారణంగా పెన్షన్‌కు అర్హత ఉన్నా, అందుకోలేకపోతున్న వారు ‘స్పందన’ లో పెన్షన్‌ దరఖాస్తులను సమర్పించారు. సంక్షేమ పథకాలకు అర్హులుగా ఉండి కూడా అందుకోలేని వారు స్పందన కార్యక్రమాల్లో అర్జీలు సమర్పించుకోవచ్చని ప్రభుత్వమే చెప్పింది.. దీంతో విజయవాడ నగర పరిధిలో 1500 మందికి పైగా అర్హులు స్పందనలో పెన్షన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జిల్లావ్యాప్తంగా మరో ఆరు వేలకు పైగా దరఖాస్తులు స్పందనలో ఇచ్చినవి పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం ఎనిమిది వేల వరకు అపరిష్కృతంగా ఉన్నాయి. 


పరిశీలన జరిపిందెక్కడ?

 ‘స్పందన’కు వచ్చిన దరఖాస్తులు అర్హమైనవో కావో తెలుసుకోవటానికి అయినా పరిశీలన జరపాలి. ఆ పని కూడా ఇప్పటి వరకు చేయలేదు. గ్రామ, వార్డు సచివాలయాలకు వచ్చిన దరఖాస్తులతో పాటు, స్పందనలో వచ్చే అర్జీలను కూడా సచివాలయాల్లో పరిష్కరించాలి. వీరికి స్పందన లింక్‌ ఉన్నా, లాగిన్‌కు అనుమతినివ్వకపోవటంతో ఆ దరఖాస్తులు పెండింగ్‌లోనే ఉంటున్నాయి. 


రీ వెరిఫికేషన్‌ ని‘బంధ’నాలు.. 

జిల్లావ్యాప్తంగా ఒంటరి మహిళల పెన్షన్లపై ప్రభుత్వం రీ వెరిఫికేషన్‌ చేయిస్తోంది. ఇందులో భాగంగా సరికొత్త నిబంధనలను నిర్దేశిస్తోంది.  పెన్షన్‌ పొందుతున్న మహిళలు ఎందుకు ఒంటరిగా ఉండాల్సి వస్తుందో తెలియజేయాలి. భర్త చనిపోతే డెత్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. విడాకులు తీసుకుంటే డైవోర్స్‌ కాపీ ఇవ్వాలి.  భర్త డెత్‌ సర్టిఫికెట్‌ను సమర్పిస్తే.. ఆ భార్యకు ఎలాగూ వితంతు ఫించను వస్తుంది. ఒంటరి మహిళ పెన్షన్‌ అవసరం లేదు. అలాగే భర్త, కుమారులు వదిలేసినా.. రేషన్‌ కార్డులో, ఆధార్‌ కార్డులో పేర్లు ఎందుకు ఉన్నాయని ప్రశ్నిస్తూ అనర్హులను చేస్తున్నారు. అనేక వివాదాలతో దూరంగా ఉండేవారు. వీటికి ఆధారం ఏమని చూపుతారు? ఇలాంటి కారణాలకు ఏమని ఆధారం చూపిస్తారు అన్నది ప్రభుత్వానికే తెలియాలి. 

Updated Date - 2021-07-24T06:56:02+05:30 IST