ఊపందుకున్న వ్యాక్సినేషన్‌

ABN , First Publish Date - 2022-01-18T05:06:35+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు.

ఊపందుకున్న వ్యాక్సినేషన్‌
గట్టులో వ్యాక్సిన్‌ వేయించుకుంటున్న యువకుడు

- జిల్లాలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

- టీకా వేయించుకునేందుకు ముందుకొస్తున్న జనం

- 4,56,000 మందికి మొదటి డోస్‌ టీకా

గద్వాల క్రైం, జనవరి 17 : జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు జనం పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. దీంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చురుకుగా సాగుతోంది. ఇప్పటి వరకు మొదటి దోస్‌ వ్యాక్సినేషన్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. జిల్లాలో 4,60,075 మందికి వ్యాక్సిన్‌ వేయాల్సి ఉండగా, ఇప్పటి వరకు 4,56,000 మందికి మొదటి డోస్‌ టీకా వేశారు. మొత్తంగా జిల్లాలో 99.27 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయినట్లు జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ శశికళ తెలిపారు. 3,01,630 మంది రెండవ డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నారని, 66.04 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తయిందని తెలిపారు. 


25,993 మంది టీనేజర్లకు టీకా

జిల్లాలో టీనేజర్లు (15 నుంచి 18 ఏళ్ల వయసు) 32,000 మంది ఉండగా, వారిలో 25,993 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు చెప్పారు. అలాగే ఇప్పటివరకు 3011 మందికి బూస్టర్‌ డోస్‌ టీకా ఇచ్చినట్లు తెలిపారు. అందులో హెల్త్‌వర్కర్లు 2,192, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లు 819 మంది ఉన్నట్లు చెప్పారు. 


వ్యాక్సిన్‌ తప్పనిసరి 

రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని అందరు గమనించాలి. కొవిడ్‌ నివారణకు ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించాలి. భౌతిక దూరం పాటిస్తూ, తరుచూ చేతులను శుభ్రం చేసుకోవాలి.

- డాక్టర్‌ శశికళ, జిల్లా ప్రోగ్రాం అధికారి

Updated Date - 2022-01-18T05:06:35+05:30 IST