మా జీవితాలతో ఆటలా..?

ABN , First Publish Date - 2021-05-11T06:12:29+05:30 IST

ప్రజల జీవితాలతో అధికారులు ఆటలాడుకుంటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా జీవితాలతో ఆటలా..?
ఆకివీడు ఏఎంసీ కార్యాలయ ప్రాంగణంలో ఆందోళన చేస్తున్న కోవిషీల్డ్‌ టీకా కోసం వచ్చిన ప్రజలు

టీకా కోసం రమ్మన్నారు.. వస్తే  పొమ్మన్నారు..

ఆకివీడులో టీకా పంపిణీ రద్దుతో ప్రజల ఆగ్రహం

పెనుమంట్రలో సీపీఎం నాయకుల నిరసన

ఆకివీడు, మే 10: ప్రజల జీవితాలతో అధికారులు ఆటలాడుకుంటున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకివీడులో వలంటీర్లు సోమవారం వ్యాక్సిన్‌ వేస్తారని ఆదివారం రాత్రి పలువురికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించడంతో తెల్లవారుజామున 3 గంటల నుంచే ఆస్పత్రికి వెళ్ళారు. వైద్య సిబ్బంది వ్యాక్సిన్‌ ఇక్కడ వేయడం లేదు ఏఎంసీ కార్యాలయం దగ్గర వేస్తారనడంతో సుమారు 100 మంది రెండు కిలోమీటర్లు దూరంలో ఉన్న ఏఎంసీకి చేరుకున్నారు. ఎనిమిది గంటలకు వ్యాక్సిన్‌తో వైద్య సిబ్బంది కూడా వచ్చారు. అయితే కమిషనర్‌ అయిన నోడల్‌ అధికారి బోయిన సాల్మన్‌రాజు ఈ రోజు వ్యాక్సిన్‌ వేయడం లేదని వైద్యులకు తెలిపారు. దీంతో సిబ్బంది వ్యాక్సిన్‌ తీసుకుని వెనుకకు వచ్చేస్తుండడంతో వ్యాక్సిన్‌ కోసం వచ్చిన ప్రజలు  సిబ్బందిని అడ్డుకు న్నారు. వ్యాక్సిన్‌ అక్కడన్నారు.. ఇక్కడన్నారు... పరుగెత్తుకుని వచ్చాం. వచ్చిన తరువాత వ్యాక్సిన్‌ వేయడంలేదు వెళ్లిపోమంటున్నారు. మాలో బీపీ, షుగర్‌ పేషంట్లున్నారు. పనులు మానుకొని మరీ వచ్చిన తరువాత ఈ విధంగా వెళ్ళిపోమనడం బాధాకరమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాస్తారోకో చేయడానికి  సిద్ధపడ్డారు. పోలీసులు వారికి సర్ధిచెప్పడంతో ఆందోళన విరమించుకున్నారు. ఓట్లు వేసి గెలిపించినందుకు  ప్రభుత్వం బాగా బుద్ధి చెబుతోందని అంటూ  అక్కడి నుంచి వెనుదిరిగారు. కలెక్టర్‌ జోక్యం చేసుకొని ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వాలు

పెనుమంట్ర: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారోగాన్ని గాలికి వదిలేశాయని సీపీఎం మండల నాయకుడు కె. సుబ్బరాజు ఆరోపించారు. పెనుమంట్ర మండలం పొలమూరు  గ్రామ సచివాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కోవిడ్‌ రోగులకు ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని, ప్రజలందరికి ఉచిత వ్యాక్సిన్‌ ఇవ్వాలని, ప్రతి పేద కుటుంబానికి 7  వేల 500 రూపాయిలు ఇవ్వాలని, రెమిడెసివిర్‌ బ్లాక్‌ మార్కెట్‌లో అధిక దరలకు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని  డిమాండ్‌ చేశారు. అనంతరం గ్రామ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందించారు.  నాయకులు  సీహెచ్‌ తిరుమలరావు, పి. సాయిబాబు, కె. మూర్తి, తూటే సురేష్‌,  సీహెచ్‌ భారతి, బొక్కా శ్రీనివాస్‌, చేగొండి సత్యనారాయణ, కె ప్రమోద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-11T06:12:29+05:30 IST