క్రూరచట్టాలపై ప్రజాపోరు

ABN , First Publish Date - 2021-07-28T08:44:24+05:30 IST

ఫాదర్‌ స్టాన్‌స్వామి మరణానికి (హత్యకు) సమాజం నుంచి వచ్చిన విస్తృత మానవీయ స్పందన, భవిష్యత్తు పట్ల ఒక ఆశను కలిగిస్తున్నది....

క్రూరచట్టాలపై ప్రజాపోరు

ఫాదర్‌ స్టాన్‌స్వామి మరణానికి (హత్యకు) సమాజం నుంచి వచ్చిన విస్తృత మానవీయ స్పందన, భవిష్యత్తు పట్ల ఒక ఆశను కలిగిస్తున్నది. ఫాదర్‌ స్వామి అమరత్వానికి దేశవ్యాప్తంగా వచ్చిన స్పందన పత్రికలలో, సోషల్‌ మీడియాలో జరిగిన, జరుగుతున్న చర్చలు మానవత్వం బతికే ఉన్నదన్న అనుభూతిని కలిగిస్తున్నాయి. ఈ మరణం పాలకవర్గాన్ని డిఫెన్స్‌లో పడేసింది. ఫాదర్‌ స్వామి మరణం దిగ్ర్భాంతికి గురి చేసిందంటూ ఆయనను ‘వండర్‌ఫుల్‌ హ్యూమన్‌బీయింగ్‌’గా బాంబే హైకోర్టు అభివర్ణించడం సాధారణ విషయం కాదు.


ప్రభుత్వాలు అనుసరించిన నియోలిబరల్‌ అభివృద్ధి నమూనా వల్ల ఆదివాసీలు అందరి కంటే ఎక్కువ నిర్బంధానికి గురయ్యారు. వాళ్ళు నిలబడ్డ నేల కింద విపరీతమైన సహజసంపద ఉండడమే ఆ అడవి బిడ్డల విషాదం. ఆ నిర్బంధం నుంచి ఆదివాసీలకు ఏదైనా న్యాయం జరగాలని ఫాదర్‌ స్టాన్‌స్వామి ఆ ప్రాంతాలకు చేరుకున్నారు. దాదాపు ఐదు దశాబ్దాలు ఆదివాసీలకు న్యాయం జరగాలని శాంతియుత పద్ధతుల ద్వారా, చట్టం హామీ ఇచ్చిన హక్కుల అమలు కోసం న్యాయస్థానాలలో, బయట ఎనలేని కృషి చేశారు. గిరిజనుల హక్కుల గురించి సమాజాన్ని ఎడ్యుకేట్‌ చేయడానికి విస్తృతంగా వ్యాసాలు రాసారు. రాసిన ప్రతి వ్యాసంలో సమాజం వాళ్ళ వైపు ఎందుకు నిలబడాలో బలంగా వాదించారు. ఆయన అనుసరించిన పద్ధతులు ఎంత శాంతియుతమైనవంటే, ఆయన అరెస్టును జార్ఖండ్‌ ముఖ్యమంత్రి ఖండించారు. అంతేగాక ఆ రాష్ట్ర హోం మంత్రి టివి ఛానల్లో ప్రత్యక్షంగా చర్చలో పాల్గొని ఫాదర్ స్వామి గురించి మాట్లాడారు. 


ఆదివాసీ పోరాటాల నేపథ్యంలో రాజ్యాంగంలో ఐదవ షెడ్యూల్‌ వచ్చింది. ఈ షెడ్యూల్‌ కొన్ని హక్కులను అంగీకరించి రాజ్యాంగంలో స్పష్టంగానే పొందుపరిచింది. కాని ఈ ఏడు దశాబ్దాలలో ‘స్వతంత్ర’ భారతదేశంలో అభివృద్ధి నమూనా తీరుతెన్నులు మారుతూ వచ్చాయి. సంక్షేమం, సమభావన, సామాజిక న్యాయం లాంటి ఉదాత్త ఆశయాలు మరుగున పడుతూ, సత్వర అభివృద్ధి అనే భావజాలం అటు ప్రపంచాన్ని ఇటు మనదేశాన్ని ఆక్రమించుకోవడం ఒక అమానవీయ మార్పునకు బాటలు పరిచింది. ఈ నమూనా విపరీతంగా ఆర్థిక అసమానతలున్న మనదేశానికి పనికిరాదని ప్రజాపక్ష ఆర్థికవేత్తలు, హక్కులసంఘాలు, ప్రజాస్వామ్యవాదులు వాదించారు. ఈ అభివృద్ధి నమూనా స్వాతంత్రోద్యమ ఆకాంక్షలకు, వాటిని క్రోడీకరించి రాసిన రాజ్యాంగానికి విఘాతం కలిగిస్తుందంటూ ప్రతిస్పందించారు. ఈ నేపథ్యంలోనే ఫాదర్‌ స్టాన్‌స్వామి ఆదివాసీల హక్కుల కోసం నిటారుగా నిలబడ్డాడు. నియోలిబరలిజంతో 1980లలో అభివృద్ధి నమూనా దిశ మారడంతో రాజ్యాంగంలో పొందుపరచిన హక్కుల పరిధిని కుంచిస్తూ నిర్బంధచట్టాలను ఒకదాని తర్వాత ఒకటి, ఒక రాష్ట్రం తర్వాత మరొక రాష్ట్రంలో ప్రవేశపెట్టారు.   ఒక దేశం అభివృద్ధికి, ప్రజల హక్కుల విస్తరణ, స్వేచ్ఛ స్వాతంత్ర్యాల వికాసాన్ని సూచికలుగా తీసుకోవాలి. ఒక ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిని ఎంత సంపద పెరిగింది అనే సూచికతో కాక ఆ అభివృద్ధి నుంచి ప్రజలకు ముఖ్యంగా అట్టడుగు ప్రజలకు నూతన హక్కులు ఏమైనా వచ్చాయా, ప్రజలు స్వేచ్ఛగా జీవిస్తున్నారా అన్న సూచికలను చేర్చి చూడవలసి ఉంటుంది. ప్రస్తుత అంతర్జాతీయ అంచనాలలో మన దేశ ప్రజాస్వామ్య ర్యాంకు పడిపోతూ వస్తున్నది. సంపద పెరుగుతున్నపుడు ప్రజాస్వామ్యం బలపడాలి. ప్రజల సంక్షేమం పెరగాలి. యువతకు తగినన్ని అవకాశాలు రావాలి. దానికి భిన్నంగా నిర్బంధం పెరగడమంటే అభివృద్థి నమూనాలో ఎక్కడో తీవ్ర లోపం ఉన్నట్లే. అభివృద్ధి నుంచి పెరిగిన సంపదతో అతికొద్దిమంది సంపన్నులు లాభపడ్డారు. అసమానతలు పెరిగిన కొద్దీ, అవకాశాలు తగ్గిన కొద్దీ సమాజంలో అసంతృప్తి పెరుగుతుంది. ఈ అసంతృప్తిని తగ్గించడానికి అసమానతలను తగ్గించడం లేదా నిర్బంధాన్ని పెంచడం రెండే మార్గాలు.


అభివృద్ధి అనుకున్నంత పుంజుకోకపోగా నియోలి బరల్‌ పెట్టుబడిదారీ భావజాలం బలపడుతున్నకొద్దీ అసమానతలు పెరిగాయి. పర్యవసానంగా ఎన్నో నిర్బంధ   చట్టాలు ఒక దానిని మించి మరొకటి ముందుకు వచ్చాయి. అలా వచ్చిన అన్ని చట్టాలలో ఊపా చాలా దుర్మార్గమైనది. దీని ప్రకారం ప్రభుత్వం ఎవరినైనా ఏ సాక్ష్యాధారాలు లేకుండా అరెస్టు చేయవచ్చు. ఆరు నెలలు నిర్బంధించవచ్చు. సాధారణంగా ఒక పౌరుడిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే 24 గంటలలో కోర్టులో హాజరుపరచాలి. కోర్టు కేసు విని మొత్తం సమాచారం సేకరించే దాక అతనికి బెయిలు ఇయ్యవచ్చు. ఊపా చట్టం ఈ సహజన్యాయానికే వ్యతిరేకం. భారతీయ జనతాపార్టీ నియోలిబరలిజాన్ని మరింత వేగంగా అమలు చేయడానికి ఈ చట్టానికి కొన్ని కొత్త కొమ్ములను తొడిగింది. ఈ ఊపా చట్టం కిందే దేశంలోని 16 మంది మేధావులను, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లను, జర్నలిస్టులను, లాయర్లను, కవులను అరెస్టు చేశారు. మూడు సంవత్సరాలు కావస్తున్నా ఎవరికీ బెయిలు రాలేదు. (వరవరరావుకు ఆరోగ్యం క్షీణించడంతో ఆరు నెలల పాటు ముంబాయిలోనే ఉండే కట్టడితో బెయిలు గ్రాంటు చేశారు.) ఇంకా ఈ కేసును ఎంతకాలం పొడిగిస్తారో తెలియదు. వీళ్లందరు నేరస్థులు కాదని తగిన సాక్ష్యాధారాలు లేకపోవడంతో అందరూ తప్పక బయటికి వస్తారని సమాజం ఆశిస్తున్నది. నిజానికి ఊపా కింద అరెస్టయిన వారిలో రెండు నుంచి మూడు శాతం మందికే శిక్ష పడింది. మిగతా అందరు నిర్దోషులని తేలింది. అయినా ఆ నిర్దోషులు సంవత్సరాల తరబడి శిక్షను అనుభవించారు. ఇలాంటి దుర్మార్గపు చట్టం కిందే ఫాదర్‌ స్టాన్‌స్వామిని అరెస్టు చేశారు.


అరెస్టయిన వాళ్ళందరిలో స్టాన్‌స్వామి వయసులో చాలా పెద్దవాడు. నిరాడంబరంగా జీవించి అందరికీ స్ఫూర్తినిచ్చే వ్యక్తిని జైలుకు పంపవలసిన అవసరం ఏమొచ్చింది? అక్కడనుంచి కూడా ఆయన అమాయకులైన వేలాది ఆదివాసీల విడుదల గురించి కృషి చేయాలని సందేశం ఇచ్చారు. ఫాదర్‌ స్టాన్‌స్వామి తన జీవితతత్వాన్ని చెపుతూ బాధపడుతున్న వారి బాధను పంచుకోవడంలోనే జీవితానికి అర్థం ఉందని, తాను ఆ అన్వేషణలోనే జీవితాన్ని చూసానని కూడా అన్నారు. వక్ర అభివృద్ధి నమూనా ఈ సున్నితత్వం మీద దాడి చేసింది. సున్నితంగా ఆలోచించడం, స్పందించడం, మానవీయంగా జీవించడం ఈ నమూనాకి గిట్టదు. స్వార్థపూరితంగా జీవించడం ఈ అభివృద్ధికి చాలా అవసరం. ఈ క్రమం సమాజంలోని అన్ని సంస్థల సున్నితత్వాన్ని కొల్లగొట్టింది. ప్రభుత్వాలైనా, ప్రభుత్వ సంస్థలైనా, జైళ్ళైనా, న్యాయస్థానాలైనా ప్రజాస్వామిక స్పృహను, మానవీయతను కోల్పోతే నాగరికత తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడుతుంది. ఫాదర్‌ స్టాన్‌స్వామి తన జీవితకాలంలో ఎంత ప్రభావం చూపగలిగారో కానీ తన అమరత్వం ద్వారా సమాజాన్ని, సంస్థలను పునరాలోచింప చేశారు. ఈ మానవీయ స్పందనతో అమానుష చట్టాలను, అమానవీయంగా మారుతున్న సందర్భాన్ని మార్చేందుకు ప్రజల నుంచి ఒత్తిడిని పెంచడమే ఫాదర్‌ స్టాన్‌స్వామికి నిజమైన నివాళి.

ప్రొ. జి. హరగోపాల్‌

Updated Date - 2021-07-28T08:44:24+05:30 IST