మాస్కు తప్పనిసరి నిబంధన రద్దు.. కరోనా ఆంక్షలు కూడా!

ABN , First Publish Date - 2021-06-17T04:22:55+05:30 IST

కరోనా తీవ్రత తీవ్రంగా ఎదుర్కొన్న యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. అయితే ఇటీవలి కాలంలో ఇక్కడ కరోనా మహమ్మారి చాలా వరకు అదుపులోకి వచ్చింది.

మాస్కు తప్పనిసరి నిబంధన రద్దు.. కరోనా ఆంక్షలు కూడా!

ప్యారిస్: కరోనా తీవ్రత తీవ్రంగా ఎదుర్కొన్న యూరప్ దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. అయితే ఇటీవలి కాలంలో ఇక్కడ కరోనా మహమ్మారి చాలా వరకు అదుపులోకి వచ్చింది. దీంతో దేశ ప్రజలను నెమ్మదిగా కరోనా ముందటి పరిస్థితులకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది. ఈ క్రమంలో గురువారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో మాస్కు తప్పనిసరిగా ధరించాల్సిన నిబంధనను ప్రభుత్వం రద్దు చేయనుందట. అంటే ఇకపై ఫ్రాన్సులో మాస్కులు లేకుండా కూడా బయటకు రావచ్చు. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని జీన్ క్యాస్టెక్స్ వెల్లడించారు. చాలా కొన్ని ప్రాంతాల్లో తప్ప దేశం అంతటా మాస్కు ధరించే నిబంధనను తొలగించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే నైట్ కర్ఫ్యూ నిబంధనలను జూన్ 20న తొలగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. ఈ కొవిడ్ కర్ఫ్యూను జూన్ 30న తొలగించాలని ముందుగా అనుకున్నారు. అయితే వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతుండటంతో ఫ్రాన్స్‌లో రోజూ వెలుగు చూస్తున్న కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఒక పదిరోజులు ముందుగానే కరోనా కర్ఫ్యూను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పబ్లిక్ ట్రాన్స్‌పోర్టులు, స్టేడియాలు వంటి జనసమూహాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో మాత్రం మాస్కులు ధరించాల్సిన అవసరం ఉంటుందని ప్రధాని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-17T04:22:55+05:30 IST